77 మంది ఉగ్రవాదులను హతం చేసిన భారత సైన్యం.. ఎంత మంది అరెస్ట్ అయ్యారంటే

0
929

గతేడాది పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 77 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, 12 మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. 2020లో 99 మంది తీవ్రవాదులను అంతం చేయగా.. 19 మందిని అరెస్టు చేశారు. “సరిహద్దు ఆవల నుండి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌లో ఉన్నాయి. హింసను ప్రేరేపించడానికి వారు చొరబడుతూ ఉన్నారు. సరిహద్దు ఆవల నుండి తీవ్రవాదులకు మద్దతు ఉంది” అని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చొరబాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

2021లో ఉగ్రవాద దాడులలో 42 మంది భద్రతా దళ సిబ్బంది మరణించగా, 117 మంది గాయపడ్డారని రాయ్ సభకు తెలియజేశారు. 2020 సంవత్సరంలో 62 మంది భద్రతా దళ సిబ్బంది మరణించగా.. 106 మంది గాయపడ్డారు. భారతదేశం, పాకిస్తాన్ 2021 ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఇండో-పాక్ సరిహద్దులో కాల్పుల సంఘటనలు గణనీయంగా తగ్గాయి. అయితే ఇది చొరబాటుపైనా ప్రభావం చూపుతుందని భావించారు. అయితే, సరిహద్దు గుండా ఉగ్రవాదులను పాక్ భారత్ లోకి పంపిస్తూనే ఉందని భద్రతా వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపై మరొక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆర్థిక నిర్వహణలో భాగంగా ప్రాజెక్టుల అమలులో కూడా పారదర్శకత ఉందని, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం అనేక చర్యలు, కార్యక్రమాలను చేపట్టిందని రాయ్ చెప్పారు.

అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్, టెక్నికల్ సాంక్షన్, ఇ-టెండరింగ్‌లు పారదర్శకంగా పని చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. బీమ్స్ (బడ్జెట్ అంచనా, కేటాయింపు & మానిటరింగ్ సిస్టమ్) ద్వారా పనులు/ప్రాజెక్ట్‌లు, వనరుల కేటాయింపులు, తదితర అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేస్తూ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచారు. “ఇటీవల ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు, జోక్యాలు పనులు/ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేయడానికి దోహదపడ్డాయి. 2018-19 మరియు 2019-20లో వరుసగా 9229 మరియు 12637 ప్రాజెక్ట్‌లు/పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా, 2020-21లో, 21943 పనులు/ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి, ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలను చూపుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో, 2022 జనవరి వరకు 22975 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి, ” అని రాయ్ చెప్పారు. అన్ని పనులు/ప్రాజెక్ట్‌ల భౌతిక ధృవీకరణ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. NITI ఆయోగ్ సహాయంతో, ముఖ్యమైన కేంద్ర ప్రాయోజిత పథకాలు/ప్రాజెక్ట్‌ల కోసం అవుట్‌పుట్-అవుట్‌కమ్ మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ తయారు చేయబడింది.