International

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 43 సార్లు టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్.. చివరికి..!

కరోనా మహమ్మారి సాధారణంగా 15 రోజులలో ప్రభావం తగ్గుతుందని చెబుతూ ఉంటారు. ఇంకొంత మందికి ఇంకొద్దిరోజులు బాధిస్తుంది. అయితే ఒక వ్యక్తిని ఏకంగా 10 నెలల పాటూ కరోనా మహమ్మారి బాధించింది. 72 సంవత్సరాల ఆ వ్యక్తికి ఎన్ని టెస్టులు చేసినా కరోనా పాజిటివ్ అని వస్తూనే ఉంది. అది కూడా ఏకంగా 43 సార్లు కరోనా టెస్టులను చేశారు. చేసిన ప్రతి సారీ పాజిటివ్ అనే రావడంతో వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఇన్ని సార్లు కరోనా పాజిటివ్ ఏంటా.. ఏ ట్రీట్మెంట్ చేయాలి అతనికి అంటూ టెన్షన్ పడ్డారు.

ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన 72 ఏళ్ల డేవ్ స్మిత్ కు పరీక్షల్లో 43 సార్లు పాజిటివ్ అని వచ్చింది. అది కూడా 10 నెలల వ్యవధిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వృత్తిరీత్యా డ్రైవింగ్ నేర్పిస్తూ ఉండే స్మిత్ ఏడుసార్లు ఆసుపత్రిలో చేరాడు. కొన్ని కొన్ని సార్లు ఎంతో ఇబ్బందిగా అనిపించేదని.. చాలా వరకూ రాత్రుళ్ళు 5 గంటల పాటూ దగ్గుతూనే ఉన్నానని చెప్పాడు. ఓ దశలో తాను బతకనని డీలా పడిపోయిన స్మిత్ తన భార్య లిన్‌తో ‘నన్ను వెళ్లనివ్వండి. ఎన్నాళ్లని వేలాడుతూ ఉండగలను.. నా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలి’ చెప్పాడు.

కానీ వైద్యులు మాత్రం స్మిత్ కు ధైర్యం చెప్పి.. అతడిని కాపాడాలని ప్రయత్నించారు. స్మిత్ శరీర స్థితిపై ఓ అంచనాకు వచ్చిన వైద్యులు ఆఖరిగా రెజినరాన్ యాంటీబాడీ థెరపీ అమలు చేశారు. యాంటీ వైరల్ మిశ్రమంతో డేవ్ కు వైద్యులు చికిత్స అందించారు. అతని చికిత్సకు రెండు వారాలు పట్టింది. ఈ ట్రీట్మెంట్ కు మాత్రం స్మిత్ శరీరం స్పందించింది. 10 నెలల తర్వాత ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చింది. నెగెటివ్ అని తన డాక్టర్ నుండి వార్త వచ్చిన తరువాత, అతను దానిని నమ్మలేకపోయాడు. దీంతో స్మిత్, అతడి కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. ఒకానొక దశలో తనకు అంత్యక్రియలు నిర్వహించమని కోరిన స్మిత్.. ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉన్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − four =

Back to top button