More

  అడవిలో జలయజ్ణం.. 70 ఏళ్ల వృద్ధుడి ఆశయం..

  ఏడు పదుల వయసులోనూ ఆయన విశ్రాంతి కోరుకోవడం లేదు. పోలియో బారిన పడినా.. తనలోని సేవా దృక్ఫథాన్ని వీడలేదు. ఈయన ఓ సత్యాన్వేషి .. అడవుల రక్షణ.. పక్షులు, వన్యప్రాణుల సంరక్షణ ఆయన సంకల్పం. నిత్యం అరణ్యంలోని మూగజీవాల దాహం తీర్చాలని పరితపిస్తుంటాడు.

  అడవులు, వన్యప్రాణులు, పక్షులను రక్షించకపోతే.. జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకే ఈ ధర్మాన్ని నమ్మి త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నాడు. దశాబ్ధకాలంగా వేసవి వచ్చిందంటే చాలు.. ఆ పెద్దాయనకు నెమళ్లు, జింకలు, దుప్పులు, పక్షులు మొదలైన జంతు జాతి దాహార్తి గుర్తుకొస్తుంది. నల్లమల అడవిలో అక్కడక్కడా నీటి తొట్లను ఏర్పాటు చేశాడు. వాటిని నీటితో నింపి వన్య ప్రాణుల దప్పిక తీరుస్తున్నాడు. వనజీవి రమణరావు నిర్వర్తిస్తున్న జలయజ్ణంపై నేషనలిస్ట్ హబ్ స్పెషల్ స్టోరీ..

  ఊరికి చుట్టూ ఎత్తైన కొండలు .. ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుగా దట్టమైన చెట్లు్. పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ప్రశాంతత ఉన్నచోటే కొన్ని సమస్యలూ ఉన్నట్లు గుర్తించారు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం, అయ్యన్నపాలెంకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట రమణారావు. పదేళ్ల క్రితం పల్నాడు ప్రాంతంలోని నల్లమల్లలో కరువు తాండవించింది. వందలాది నెమళ్లు, పక్షులు, వన్యప్రాణులు తన కళ్లముందే మరణిస్తుంటే చలించిపోయారాయన. వయోభారం, పోలియో.. ఇవేవీ తన సేవకు అడ్డురాలేదు. మూగ జీవాలకు తాగునీటి కొరత రాకుండా చూడడమే తన లక్ష్యంగా పని చేస్తున్నారు. తన గ్రామానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అడవిలో నీటి తొట్లను ఏర్పాటు చేశారు. రెండు రోజులకోసారి ఆ తొట్లను శుభ్రం చేసి, మళ్లీ నీటిని నింపుతూ పదేళ్లుగా మూగజీవుల దాహార్తిని తీరుస్తున్నాడు.

  వన్యప్రాణుల సంరక్షణార్థం రమణరావు చేస్తున్న నిస్వార్థ సేవలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి గొప్పలు, మెప్పులు లేని నిరాడంబర జీవితమే తనకు చాలా ఇష్టం. కేవలం మానవత్వానికి, దయగుణానికి, సేవాతత్పరతకు మాత్రమే బద్ధుడై ముందుకుసాగుతున్నారు. తనతోపాటు ఇటువంటి వన్యప్రాణుల సేవ, అడవుల సంరక్షణపై యువత దృష్టిసారిస్తే బాగుంటుందని సూచిస్తున్నాడు. వేసవిలో పక్షులు, వన్యప్రాణులకు సమృద్ధిగా నీళ్లు అందించినప్పుడు కలిగిన సంతృప్తి తన జీవితంలో మరే సందర్భంలోనూ కలగలేదంటారాయన. తాను ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లో వన్య ప్రాణులు దాహం తీర్చుకుంటూ ఉంటే, పక్షులు నీళ్లు తాగి తొట్టెల్లో ఆనందంగా జలకాలాడుతుంటే… ఆ దృశ్యాలు చూసి తన జీవితం సార్థకమైపోయిందని సంతోషంగా చెబుతున్నారు రమణరావు.

  రమణరావు 20 ఏళ్ల పాటు అయ్యన్న పాలెం గ్రామ సర్పంచ్ గా పని చేశారు. తన రాజకీయ జీవితంలో ఆయన ఆరుగురు ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెలిగారు. ఏడు పదుల వయస్సులోనూ తాను నమ్మిన సేవా యజ్ణంలోనే జీవితం గడుపుతున్నారు. సుమారు 50 కి పైగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి తొట్టెలు నింపుతున్నారు. ఆయన సంకల్పానికి, కృషికి గ్రామస్థులు కూడా చేయి చేయి కలుపుతున్నారు. తమకు తోచిన సాయం చేస్తూ .. తొట్టెల్లో నీటిని నింపి, మూగ జీవాలను కాపాడటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అలానే ప్రభుత్వం చొరవ చూపి.. వేసవిలో నల్లమలలోని బొల్లొరికుంట ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు నీటి బోర్లును వేయించాలని స్థానికంగా నివాసం ఉంటున్న నాగేశ్వర నాయక్ కోరుతున్నారు.

  ఇదిలా ఉంటే కొంతమంది నీటి తొట్టెలు పగలకొడుతూ.. రమణరావు సంకల్పానికి తూట్లు పొడుస్తున్నారు. దీంతోపాటు అడవిలో విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి మూగజీవాలను చంపుతున్న వేటగాళ్లపై అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎంతో స్ఫూర్తివంతమైన సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్న రమణరావును మరికొందరు ఆదర్శంగా తీసుకుని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ముందడుగు వేస్తారని ఆశిద్దాం.

  Trending Stories

  Related Stories