Special Stories

రాష్ట్రపతి రేసులో ఏడుగురు..! వెంకయ్య స్థానమెక్కడ..?

రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్థానంలో.. జూలై 25న కొత్త రాష్ట్రపతి కొలువుదీరాల్సివుంది. దీంతో కేంద్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా అభ్యర్థిని బరిలో నిలిపే పనిలో.. ఇప్పటికే విపక్ష పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తో ఇదే విషయంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల తరఫున బలమైన అభ్యర్థిని నిలిపి, సత్తా చాటాలని చర్చించినట్లు సమాచారం. ఇందుకోసం బీజేపీయేతర సీఎంల భేటీ ఏర్పాటు చేసి.. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది..

ఇదిలావుంటే, విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే పలువురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ని బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు కూడా బాగానే వినిపించింది. రాష్ట్రపతి పదవి కోసం ఆయన స్వయంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. విపక్ష పార్టీలు కూడా శరద్ పవార్ అయితే బాగుంటందని దండోరా వేశాయి. కాదు, కాదు శరద్ పవార్ బీజేపీ ఆప్షన్ అనే మాటలు కూడా వినిపించాయి. అంతలోనే బీజేపీ తరఫున గులాం నబీ ఆజాద్ పేరు తెరపైకి వచ్చింది. అధిష్టానంపై ధ్వజమెత్తిన 23 మంది సీనియర్ల బ్యాచ్ లో ఆజాద్ కూడా ఒకరు. దీంతో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలంటే ఆయనే బెటరని బీజేపీ భావిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది.

తాజాగా యూపీ మాజీ సీఎం బీఎస్పీ అధినేత్రి మాయావతి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఆమె పేరును సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తెరపైకి తేవడం మరీ విడ్డూరం.
ఇటీవల యూపీ ఎన్నికల సందర్భంగా బీఎస్పీ ఓట్లు బీజేపీకి పడేలా చేశారని.. ప్రతిఫలంగా బీజేపీ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థి చేస్తుందేమో చూడాలని ఓ విచిత్రమైన కామెంట్ చేశారు అఖిలేష్. అయితే, దీనిపై మాయావతి వెంటనే రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి లేదా ప్రధాని కావాలనుకుంటున్న తాను.. రాష్ట్రపతి పదవిని ఎలా ఆశిస్తానని కౌంటర్ ఇచ్చారు. సమాజ్ వాదీ పార్టీ కావాలని పుకార్లు సృష్టిస్తోందని మండిపడ్డారు. యూపీలో మళ్లీ సీఎం అయ్యేందుకు.. తన అడ్డు తొలగించుకోవాలని అఖిలేష్ యాదవ్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఊహాగానాలు పక్కనపెడితే.. అసలు నిజంగా ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగబోతున్నారు..? బీజేపీ అధిష్టానం దృష్టిలో ఎంతమంది ప్రాబబుల్స్ వున్నారు..? రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కే మరోసారి అవకాశం కల్పిస్తారా..? లేక, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయకుడుకు ఛాన్స్ ఇస్తారా..? జూలై నెల దగ్గర పడుతున్న కొద్దీ ఈ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వయసు 76 దాటింది. 70 ఏళ్లు దాటిన ఎవరినీ ప్రమోట్ చేయకూడదనేది బీజేపీ పాలసీ. కాబట్టి, ఆయనను రెండోసారి ఎన్నుకునే అవకాశం దాదాపు శూన్యం. సో.. కొత్త వ్యక్తి రాష్ట్రపతి కావడం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల పక్కా సమాచారం ప్రకారం బీజేపీ తరఫున రాష్ట్రపతి రేసులో ఏడుగురు అభ్యర్థులున్నట్టు తెలుస్తోంది. వారిలో మొదట వినిపిస్తున్న పేరు సురేష్ ప్రభు. 2014 నుంచి 2019 వరకు కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన.. ఏడాదిపాటు పౌర విమానయానం, రెండేళ్ల పాటు వాణిజ్యం, మూడేళ్లు రైల్వే శాఖలను నిర్వహించారు. వాజ్ పేయి హయాంలో కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే, పార్టీ కోసం పదవులను లెక్కచేయని కొద్దిమంది మంత్రుల్లో సురేష్ ప్రభుది మొదటి స్థానం. అందుకే, మోదీ రెండో మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోయినా.. 2019 జూన్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు జి20, జి7 లకు భారత దూతగా అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఆ స్థానాన్ని పియూష్ గోయల్ కు కట్టబెట్టారు. ఇటీవలే సురేష్ ప్రభు రాజ్యసభ పదవి గడువు కూడా ముగిసింది. ప్రస్తుతం ఆయన ఎలాంటి పదవిలో లేరు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎలాంటి ఆటంకాలు లేవు. పైగా వివాదాలు లేని నాయకుడు కావడంతో.. రాష్ట్రపతి రేసులో బీజేపీ ఆయనకు తొలిస్థానం కల్పించినట్టు తెలుస్తోంది.

ఇక, జాబితాలో వినిపిస్తున్న రెండో పేరు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 2017 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీని 272 ఓట్ల మెజారిటీతో ఓడించిన వెంకయ్య.. జాతి వ్యతిరేక శక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న హమీద్ అన్సారీ స్థానంలో ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపరాష్ట్రపతిగా, న్యాయపరమైన సంస్కరణలకు సంబంధించి.. దేశంలోని న్యాయవ్యవస్థను ప్రశ్నించడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అంతేకాదు, విపక్షాల హైవోల్టేజ్ నిరసనలు, ఆందోళనల మధ్య రాజ్యసభను సమర్థవంతంగా నడిపిన పేరుంది. పైగా వెంకయ్య నాయుడుకు సరితూగే వ్యక్తిని అభ్యర్థిగా నిలపడం ప్రతిపక్షాలకు కష్టమైన పని. అటు, మోదీ హయాంలోనే కాదు, వాజ్ పేయి మంత్రివర్గంలోనూ కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉపరాష్ట్రతిగా ఆయన గడించిన అనుభవం అదనపు బలం కానుంది. RSS నేపథ్యం, కఠినంగా వ్యవహరించే తత్వం, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యం.. వెంకయ్య నాయుడుకు కలిసొచ్చే అంశాలు. అయితే, ఇటీవలే ఆయన వయసు 70 ఏళ్లు దాటడం ఒక్కటే కాస్త ప్రతికూలాంశం. అది మినహా.. రాష్ట్రపతి పదవికి ఆయనకు అన్ని అర్హతలు వున్నట్టే.

ఇక, రాష్ట్రపతి అభ్యర్థుల లిస్టులో మూడో పేరు ఆరిఫ్ మహ్మద్ ఖాన్. ప్రస్తుతం కేరళకు గవర్నర్ గా పనిచేస్తున్న ఆయన.. మైనార్టీ వర్గం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తని బీజేపీ భావిస్తోంది. ఓవైపు చురుకైన రాజకీయ జీవితాన్ని గడుపుతూనే.. ఇస్లాంలో సంస్కరణల కోసం తన గళాన్ని వినిపిస్తున్న నాయకడు ఆరిఫ్. వి.పి. సింగ్ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన నాటి నుంచి.. కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని సరిదిద్దడం వరకు.. ఆరిఫ్ ఖాన్ తనదైన ముద్రవేశారు. గత ఉప రాష్ట్రపతి అన్సారీలా సంకుచిత ఇస్లామిస్ట్ భావాలు కలిగిన వ్యక్తిగా కాకుండా.. నిజమైన లౌకికవాదిగా పేరు సంపాదించుకున్నారు. మోదీ ప్రభుత్వం అమల్లోకి ట్రిపుల్ తలాఖ్ కు బహిరంగ మద్దతు పలకడం ఇందుకు ఉదాహరణ. అంతేకాదు, ఇటీవల హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి కాదంటూ.. ఆ వివాదం అనవసరమని కూడా తన గళాన్ని బలంగా వినిపించారు ఆరిఫ్ మహ్మద్. గతంలో తలపై ఇరుముడి కట్టుకుని శబరిమల అయ్యప్పను దర్శించుకుని.. తాను నిజమైన లౌకికవాదినని చాటుకున్నారు ఆరిఫ్ మహ్మద్ ఖాన్. పైగా అసదుద్దీన్ వంటి సంకుచిత మనస్తత్వం కలిగిన నాయకులకు ఆరిఫ్ ఖాన్ సరైన విరుగుడు. ఇవన్నీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనకు కలిసొచ్చే అంశాలు.

ఇక, నెంబర్ ఫోర్.. గోపాల్ నారాయణ్ సింగ్. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా జముహర్ గ్రామంలో జన్మించిన గోపాల్ నారాయణ్ సింగ్ బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. జనతా పార్టీ నాయకుడిగా 1977లో నోఖా నియోజకవర్గం నుంచి తొలిసారి బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2003లో, నందకిశోర్ యాదవ్ స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. సుశీల్ కుమార్ మోదీ తర్వాత రెండేళ్ల పాటు.. ఆ పదవిని విజయవంతంగా నిర్వర్తించిన నాయకుడాయన. 2016లో గోపాల్ నారాయణ్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. గత నెలలోనే ఆయన పదవీకాలం కూడా ముగిసింది. బీహార్ రాజకీయాల్లో గోపాల్ నారాయణ్ సింగ్ బలమైన నాయకుడు. ఆ ప్రాంత ఓటర్లపై గణనీయమైన పట్టున్న వ్యక్తి. తన సొంత జిల్లాల్లో ఏకంగా ఓ విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేని గోపాల్ నారాయణ సింగ్ ఎంపిక బీజేపీకి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.

రాష్ట్రపతి రేసులో ఎన్డీఏ దళం నుంచి వినిపిస్తున్న మరో పేరు ద్రౌపది ముర్ము. ఓబీసీ, గిరిజన వర్గాలకు రాష్ట్రపతి భవన్ లో ఇప్పటివరకు ప్రాతినిథ్యం లభించలేదు. ఆ కోణంలో చూసుకుంటే, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీలో బలమైన గిరిజన నేత ద్రౌపది ముర్ము. నిజానికి, 2017లోనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే, బీజేపీ ఎస్సీ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపడంతో రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయ్యారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి బరిలో నిలబెట్టడమంటే.. బీజేపీ ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టే. ముర్ము ఎంపిక ద్వారా గిరిజన నాయకురాలికే కాదు.. మహిళకు అవకాశం కల్పించిన పేరు దక్కుతుంది. ఒడిశాలోని గిరిజన జిల్లా మయూర్ భుంజ్ నుంచి వచ్చిన ముర్ము.. రెండు దశాబ్దాల క్రితం ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2024లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలంటే, గిరిజనుల ఓటు బ్యాంకు చాలా ముఖ్యం. ఆ కోణంలో చూసుకుంటే ద్రౌపది ముర్ము అవకాశాలను కొట్టిపారేయలేం.

రాష్ట్రపతి రేసులో వినిపిస్తున్న మరో బలమైన పేరు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. బీజేపీ మైనార్టీ వర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి నఖ్వీ. ప్రస్తుత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న ఆయన.. 2016 నుంచి మోదీ కేబినెట్ లో కొనసాగుతున్నారు. మోదీ మంత్రివర్గం ఎన్నోసార్లు మార్పులకు గురైనా.. నఖ్వీ స్థానం మాత్రం చెక్కుచెదరలేదు. మోదీ కేబినెట్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మంత్రుల్లో నఖ్వీ ఒకరు. వాజ్ పేయి హయాంలో సమాచార ప్రసార శాఖామంత్రిగా కూడా ఆయన పనిచేశారు. నఖ్వీ హయాంలోనే దేశంలో డీటీహెచ్ ప్రసారాలకు బాటలు పడ్డాయి. భారతీయ చలనచిత్ర రంగానికి పరిశ్రమ హోదా దక్కింది కూడా ఆయన హయాంలోనే. ప్రయాగ్ రాజ్ లో పుట్టి పెరిగిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు.. సంపూర్ణ కరంతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే జైలు శిక్షను అనుభవించారు. బీజేపీలో ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య నాయకుల్లో నఖ్వీ ఒకరు. అట్టడుగుస్థాయి నుంచి వచ్చిన ఆయన ప్రాతినిథ్యం కారణంగా.. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ కాదనే సందేశాన్నిస్తోంది. సో.. మైనార్టీ వర్గం కోణంలో ఆలోచిస్తే, రాష్ట్రపతి రేసులో నఖ్వీ పేరు ముందు వరుసలో ఉన్నట్టే.

ఇక, రాష్ట్రపతి అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్న మరో పేరు థావర్ చంద్ గెహ్లాట్. ప్రస్తుతం కర్నాటక గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్న గెహ్లాట్.. 2014 నుంచి 2021 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత.. గతేడాది వరకు రాజ్యసభలో ఎన్డీఏకు నాయకత్వం వహించారు. గత ఎనిమిదేళ్లలో బీజేపీకి అనేక విజయాలను అందించిన పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఆయన విశేష సేవలందించారు. లో ప్రొఫైల్ కారణంగా ఆయన పేరు మీడియాలో ఎక్కువగా ప్రచారం కాకపోవచ్చు గానీ.. బీజేపీలో అత్యంత ప్రభావవంతమైన నాయుకుల్లో థావర్ చంద్ గెహ్లాట్ ఒకరు. అంతేకాదు, ఎస్సీ సామాజికవర్గం నుంచి పార్టీలో పెద్దదిక్కు ఆయనే. రాష్ట్రపతి రేసులో ఈసారి కూడా ఎస్సీ వర్గానికి పెద్దపీట వేయాలనుకుంటే మాత్రం.. బీజేపీ అధిష్టానం థావర్ చందర్ గెహ్లాట్ పేరును పరిగణలోకి తీసుకోవచ్చు.

ఇదీ మొత్తంగా, బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థుల ప్రాబబుల్స్ లిస్ట్. అయితే, పార్టీ ప్రయోజనాల నేపథ్యంలో.. అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం బీజేపీ ఆనవాయితీ. మరి, రాష్ట్రపతి అభ్యర్థిగా చివరి నిమిషంలో ఎవరి పేరును ప్రతిపాదిస్తుందో తెలియాలంటే కొన్ని వారాల వరకు వేచిచూడక తప్పదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

17 + twenty =

Back to top button