వణికిన చైనా.. వరుస భూకంపాలు

చైనా దేశంలో వరుసగా భూమి కంపించింది. 7.3 తీవ్రతతో చైనాలో భూమి కంపించిందంటూ అమెరికా సిస్మొలాజిస్టులు చెప్పుకొచ్చారు. ఒక భూకంపం కింగ్హై కేంద్రంగా చోటు చేసుకోగా.. మరో భూకంపం యున్నాన్ కేంద్రంగా చోటు చేసుకుంది.
7.3 తీవ్రతతో దక్షిణ కింగ్హై లో శనివారం తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. కింగ్హై నగరానికి నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది. కింగ్హై కేంద్రంగా తెల్లవారుజామున 2.04 గంటలకు సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల(6మైళ్ళ) లోతులో వచ్చిందని గుర్తించారు. సెంట్రల్ చైనాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. ఈ భూకంపం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని భావిస్తూ ఉన్నారు. అయితే ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించి ఉంటుందని అమెరికా భావిస్తున్నా.. ఎప్పటిలాగే చైనా ఏ విషయాన్ని కూడా ఇంకా బహిర్గతం చేయలేదు.
శుక్రవారం రాత్రి యున్నాన్లో కూడా భూమి తీవ్రంగా కంపించింది. 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఒకరు చనిపోయారని స్థానిక అధికారులు రిపోర్ట్ చేశారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నారని తెలిపారు. భూ ప్రకంపనాలు రాగానే జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కూలిపోయామని.. మరికొన్ని దెబ్బతిన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఈ భూకంపం తీవ్రత గ్రామీణ ప్రాంతాలపై పడిందని అంటున్నారు. యున్నాన్ అధికారుల లెక్కల ప్రకారం ఒకరు చనిపోగా.. ఆరు మంది గాయపడ్డారని తెలుస్తోంది. యున్నాన్ ప్రాంతంలో భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయని యున్నాన్ సీస్మోలాజికల్ బ్యూరో తెలిపింది. 2020లో 5 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి నలుగురు చనిపోగా, 23 మందికి గాయాలు అయ్యాయి. 2008లో సిచువాన్ ప్రావిన్స్ లో వచ్చిన భారీ భూకంపానికి ఏకంగా 90000 మంది మరణించారు.