More

  దక్షిణాపథాన రాజసూయం – వంగభూమి యుద్ధ మైదానం

  వింధ్యా పర్వత శ్రేణులకు ఇరువైపులా చేసే యుద్ధం ఒకేలా ఉండదు. దక్షిణాన అనుసరించే వ్యూహానికీ, ఉత్తరాన సంధించే ఎత్తుగడలకు భూమ్యాకాశాల వ్యత్యాసం ఉంటుంది అంటాడు సర్ జాదూ నాథ్ సర్కార్. బీజేపీ ఇప్పుడు వింధ్యా పర్వతాలకు ఇటువేపు దృష్టి సారించింది. జాదూ నాథ్ సర్కార్ అవిభాజ్య బెంగాల్ లో పుట్టిన చరిత్రకారుడు. మరీ ముఖ్యంగా భారతదేశ మిలట్రీ చరిత్రను సాధికారికంగా రాసినవాడు.

  ఔరంగజేబు నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిన అపురూప ఇతిహాసకర్త. ఈ ఏడాది మేలో జాదూనాథ్ సర్కార్ 63వ వర్ధంతి. సరిగ్గా ఇదే కాలంలో పశ్చిమ బెంగాల్ లో రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపించడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, ఇది సర్కార్ నిరపేక్ష చరిత్ర సేవకు నివాళిగా కూడా భావించాలి.

  మరోవైపు తమిళనాట ద్రవిడ భావజాల రాజకీయాలకు కాలం చెల్లిందని స్వయంగా ఆ పార్టీలే తమ ఆచరణలో నిరూపిస్తున్నాయి. భారతదేశ సార్వభౌమాధికారాన్నీ, హిందూ ధర్మాన్నీ తూలనాడుతూ రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో గందరగోళానికి కారణమైన ద్రవిడ రాజకీయ ఎజెండా ఇప్పుడు పెను మార్పులకు గురైంది. హిందూత్వ గురించి కొత్త పాఠాలు వల్లెవేస్తున్నాయి ద్రవిడ పార్టీలు. వర్తమాన రాజకీయాల్లో ఇది విశిష్ఠ పరిణామం.

  కేరనాడులో అధికార పంపకాలకు అలవాటు పడిన యూడీఎఫ్-ఎల్డీఎఫ్ ల కాళ్లకింది నేల కదలబారిపోతున్నది. అనేక వైరుధ్యాలకు పుట్టినిల్లుగా ఉన్న కేరళ ఇపుడు కొత్త రాజకీయాలవైపు చూస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలోనే.

  ఈఎంఎస్ నంబూద్రిపాద్ మొదటి ముఖ్యమంత్రి కూడా. నెహ్రూతో అంటకాగి తర్వాత  అదే నెహ్రూ ఆగ్రహం కారణంగా 356 అధికరణం ప్రయోగంతో కుప్పకూలిన చరిత్ర కూడా ఆ రాష్ట్రానికి ఉంది.

  ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాలూ, ఓ కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల్లో అసోం మినహాయిస్తే…పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల రాజకీయాల్లోని సైద్ధాంతిక నేపథ్యం సాంతం హైందవ వ్యతిరేకతలో, పరదేశపు భావజాల జాడ్యంలో మునిగితేలిందే. సరిగ్గా ఈ రాష్ట్రాల్లోనే ఇపుడు సదరు సోకాల్డ్ ప్రగతిశీల భావజాలం కొడిగట్టిపోతోంది. కాషాయ దళం దక్షిణాన కదన కుతూహలంతో ముందుకు సాగుతోంది.

  భారత దేశ జనాభాలోని దాదాపు ఐదో వంతు మంది ప్రజలు మరో రెండు నెలల్లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరగబోయే ఎన్నికల్లో పాల్గొని కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుకావడంతో పాటు.. జాతీయ రాజకీయాలపై, ముఖ్యంగా భారత అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల భవిష్యత్తుపైనా ఈ ఎన్నికలు ప్రభావం చూపనున్నాయి. భారత పార్లమెంటులోని ఉభయ సభల్లో సంఖ్యాబలం ఉండడంతోపాటూ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను బట్టి చూస్తే, బీజేపీ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.

  2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ భారత పార్లమెంట్ దిగువ సభలో 56 శాతం స్థానాలు గెలుచుకోగలిగింది. గత 35 ఏళ్లలో ఏదైనా ఒక పార్టీకి లభించిన అతిపెద్ద విజయం ఉందంటే ఇదే. అయితే, బీజేపీ మొత్తం దేశమంతా ప్రభావం చూపలేకపోయింది. 2019 ఎన్నికల్లో అది 11 పెద్ద రాష్ట్రాల్లో 75 శాతం పైగా స్థానాలు గెలుచుకున్నా, తమిళనాడు, కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.

  ఇప్పుడు అవే రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ 2019లో పశ్చిమ బెంగాల్లో 43 శాతం సీట్లు సాధించింది.

  అంతకు ముందు అది ఆ రాష్ట్రంలో ఎప్పుడూ 5 శాతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు, బీజేపీ మొదటిసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

  బీజేపీ తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో నేరుగా ఎప్పుడూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అది రానున్న ఎన్నికలను కీలకంగా భావిస్తోంది.

  ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన అసోం కూడా బీజేపీకి అంతే కీలకం. ఆ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉంది. మెల్లమెల్లగా అది రాష్ట్రంలో తన స్థితిని బలోపేతం కూడా చేసుకుంది. కానీ, ఈ ఎన్నికలకు ఏడాది ముందు కొంత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వచ్చింది.

  దేశంలో పౌరసత్వ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరిగాయి. ఆ సవరణల ప్రకారం మూడు పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు కేంద్రం పౌరసత్వం అందిస్తుంది. అస్సాంలో అలా స్థిరపడినవారు చాలా మంది ఉన్నారు. వీరి విషయంలో ప్రభుత్వం ఆచితూచీ వ్యవహరిస్తోంది. పుదుచ్చేరిలో నాలుగేళ్ల నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ గత నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయింది. కొంతమంది అధికార పార్టీకి రాజీనామా కూడా ఇచ్చారు.

  ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో దక్కే విజయం.. బీజేపీకి తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో, ఆ లోపు జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చూపడానికి ఉపయోగపడడంతోపాటూ రాజ్యసభలో తమ సంఖ్యాబలాన్ని పెంచుకోడానికి కూడా సహకరిస్తుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ 40 శాతం స్థానాలతో మైనారిటీలో ఉంది.

  ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం భారత పార్లమెంటులో విపక్షాలుగా ఉన్న పార్టీలకూ అంతే ముఖ్యంగా మారాయి. ఈ పార్టీల్లో స్వతంత్ర భారతదేశాన్ని 50 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ కూడా ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు భారత పార్లమెంటు దిగువ సభలో 21 శాతం స్థానాల షేరింగ్ ఉంది.

   2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 421 స్థానాల్లో పోటీ చేసింది. కానీ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. వాటిలో సగానికి పైగా స్థానాలు ఈ రాష్ట్రాల నుంచే వచ్చాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎన్ని సీట్లు గెలుచుకున్నాయో, వాటిలో 65 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. మరోవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలకు వచ్చిన స్థానాల్లో కేవలం 8 శాతం మాత్రమే ఈ రాష్ట్రాల నుంచి దక్కాయి.

  పార్లమెంట్ దిగువ సభలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న రెండు పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్ మినహా తమిళనాడులోని పెద్ద ప్రాంతీయ పార్టీ డీఎంకే ఉంది. ఇది కాంగ్రెస్ మిత్రపక్షం. మరో పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఇది గత పదేళ్ల నుంచీ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలకు పార్లమెంటు ఉభయసభల్లో దాదాపు 8 శాతం స్థానాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలో వాటి పరిస్థితి అటుఇటు అయితే, పార్లమెంటులో కూడా వారి స్థితి బలహీనపడుతుంది.

  బెంగాల్ ముస్లీం ఓటర్లు నిర్ణయాత్మకమా?

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి 27 నుంచి 30 శాతం వరకూ ముస్లిం ఓటర్ల గురించి చాలా చర్చ జరుగుతోంది. ఏఐఎంఐఎంతోపాటూ, ఫుర్‌ఫురా షరీఫ్ పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ పార్టీ-ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ -ఐఎస్ఎఫ్ కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ వర్గం ఓట్లు ఈసారీ ఎవరికి పడతాయనే సందేహం నెలకొంది.

  ఈ రెండు పార్టీలూ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రత్యేకంగా ఎలాంటి తేడా ఉండదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. కానీ, కొంతమంది మాత్రం ఈ పార్టీల వల్ల ముస్లిం ఓటు బ్యాంకుకు కాస్త గండిపడే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. దాదాపు గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో మైనారిటీల పాత్ర చాలా కీలకం అవుతోంది. అధికారం ఎవరికి దక్కేదీ ఈ వర్గం ఓటర్లే నిర్ణయిస్తూ వస్తున్నారు.

  మొదట్లో లెఫ్ట్ ఫ్రంట్ చాలాకాలంపాటు ఈ ఓటు బ్యాంక్ నుంచి రాజకీయ లబ్ధి పొందింది. ఇప్పుడు, గత ఒక దశాబ్దంగా ఈ వర్గం మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌కు అండగా ఉంది.

  కానీ, ఈసారీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వల్ల తృణమూల్ ఓటు బ్యాంకుకు ముప్పు ముంచుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  హుగ్లీ జిల్లాలోని ఫుర్‌ఫురా షరీఫ్ మైనారిటీల పవిత్ర స్థలం. దక్షిణ బెంగాల్‌లోని దాదాపు 2500 మసీదులపై ఐఎస్ఎఫ్ నియంత్రణ ఉంది. ఎన్నికల సమయంలో ఫుర్‌ఫురా షరీఫ్‌ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. లెఫ్ట్ నుంచి టీఎంసీ, కాంగ్రెస్ వరకూ అన్ని పార్టీల నేతలు ఇక్కడికి బారులు తీరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్ మొత్తం జనాభాలో 27.01 శాతం ముస్లింలు ఉన్నారు. ఇప్పుడది 33 శాతానికి దగ్గరగా చేరుకుంది.

  రాష్ట్రంలోని ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 40 శాతం కంటే ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ముర్షీదాబాద్‌లో 70 శాతం, మాల్దాలో 57 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముర్షీదాబాద్, మాల్దాలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

  ఈ జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 100 నుంచి 110 స్థానాల్లో ముస్లింల ఓట్లు నిర్ణయాత్మకం అవుతాయి. 23శాతం ఉన్న ఎస్సీ జనాభాతో పాటు, గిరిజన ఓట్లు సైతం బెంగాల్ ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. 16 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, 68 ఎస్సీ స్థానాల్లో గెలుపు ఎవరిని వరిస్తే అధికారం వారి పంచన చేరుతుందంటారు పరిశీలకులు.

  ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల ఫలితాలు భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని సంపూర్ణంగానే మార్చేయనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు భిన్నంగా ఉంటారని, బిజెపిని ఆదరించరని, బెంగాల్లో కానీ, దక్షిణాదిలో కానీ ఆ పార్టీకి చెల్లుబాటు తక్కువని చెబుతుంటారు. ఈ బడాయి పరిశీలనలకు చెలామణీ తగ్గిపోతుందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే అంతిమ తీర్పు. భౌగోళిక ప్రత్యేకతలు, సాంస్కృతిక భిన్నత్వం ప్రాతిపదికన రాజకీయ సిద్ధాంతాలు లేదా నిర్మాణాలు స్థిరపడతాయనుకోవడం భ్రమ. ఆయా ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏ రాజకీయ పార్టీ అయినా…ఏ ప్రాంతంలో అయినా నిలదొక్కుకుంటుంది. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ శరవేగంగా విస్తరించడానికి కారణమేంటో కామ్రేడ్లే వెతుక్కోవాలి కానీ, కమలనాథులు కాదు. కేరళ, బెంగాల్ ఫలితాలు రాబోయే రోజుల్లో ఈ వాదనకు బలం చేకూర్చినా ఆశ్చర్యపోవాల్సిన అగత్యం లేదు.

  Trending Stories

  Related Stories