వంద కొడితే 500రూ ఏటీఎం నుండి వస్తుంటే..!

ఏటీఎం మెషీన్లు ఎలా పని చేస్తాయో అందరికీ తెలిసిందే..! ఏటీఎం లో డబ్బులు పెడుతున్నప్పుడు సిబ్బంది 100 రూపాయలు నోటుకు కేటాయించిన స్థానంలో 100 రూపాయల నోట్లను.. 500 రూపాయలకు కేటాయించిన స్థానంలో 500 రూపాయలను.. 2000 రూపాయలను కేటాయించిన స్థానంలో 2000 రూపాయలను పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు చేసి 100 రూపాయలు పెట్టాల్సిన చోట 500 రూపాయలు పెడితే.. విత్ డ్రా చేసుకోవాలని అనుకున్న వాళ్లు 100 కావాలని కొడితే 500 రూపాయలు.. 500 రూపాయలు కావాలని కొడితే 100 రూపాయలు చేతుల్లో పడే అవకాశం ఉంది. ఇలాంటి పొరపాట్లు అతి అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వంద బదులు అయిదు వందలు రూపాయలు వచ్చిందంటే ప్రజలు వదులుతారా చెప్పండి.
ఇలాంటి ఘటన వనపర్తి జిల్లా అమరచింతలో చోటు చేసుకుంది. ఇండియన్ నెంబర్ 1 ఏటీఎంలో 100 కొడుతూ ఉంటే 500 రూపాయలు రావడం చూసిన జనం పెద్ద ఎత్తున విత్ డ్రా చేయడం మొదలు పెట్టారు. తమకు తెలిసిన వాళ్లకు చెప్పి కూడా విత్ డ్రాలను చేయించారు. ఇంకేముంది దొరికినంత దక్కించుకో అన్నట్లు అక్కడి జనం పరిస్థితి తయారైంది. అప్పుడప్పుడు మాత్రమే విత్ డ్రా చేయడానికి సదరు ఏటీఎంను వాడే జనాలు.. ఏకంగా బారులు తీరారు. కొందరు రూ. 500 విత్ డ్రా చేస్తే 2,500 వచ్చాయి. నాలుగు వేలు డ్రా చేస్తే ఏకంగా 20వేల రూపాయలు వచ్చాయట..! జనం ఆ ఏటీఎంకు ఎగబడ్డారు. మొత్తం 5.8 లక్షల రూపాయల సొమ్మును ప్రజలు విత్ డ్రా చేసుకున్నారట..! ఎప్పుడూ లేనిది ఇలా ఆ ఏటీఎం ముందు జనం ఉండడం.. లాక్ డౌన్ సూచనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉండడంతో పోలీసుల దగ్గరకు విషయం వెళ్ళింది. సమచారం అందుకున్న పోలీసులు సదరు ఏటీఎం సెంటర్ ను మూసివేశారు. ఏటీఎం సెంటర్ కు తాళం వేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.