నేడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రానిక్స్ మయం. ‘చిప్’ లేనిదే మనిషి అడుగు తీసి అడుగు వేయలని రోజులివి. చిప్ అనేది.. ఇప్పుడు కంప్యూటర్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇంట్లో కాలింగ్ బెల్ నుంచి.. మొబైల్ ఫోన్ వరకు.. ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ మొదలు.. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఓవెన్.. ఇలా ప్రతి వస్తువుకు గుండెకాయ ‘చిప్’. చిప్ పేరు వినగానే మనకు మొదటగా గుర్తకొచ్చే కంపెనీ ‘ఇంటెల్’. ఇంటెల్ తొలి కంప్యూటర్ చిప్ విడుదలై నవంబర్ 15తో 50 ఏళ్లు పూర్తయింది. ఈ అర్థశతాబ్దంలో దినదినాభివృద్ధి చెందిన ఇంటెల్ ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్‌ను శాసించింది. అయితే, ఇంటెల్ భారత్ భాగస్వామ్యంతోనే ప్రపంచ దిగ్గజ మైక్రో చిప్ కంపెనీగా ఎదిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతోమంది భారతీయ నిపుణుల ఆవిష్కరణలతోనే చిప్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది.
గతనెలలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై.. ‘Increasing India’s Electronic Exports and Share in Global Value Chains’ పేరుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. స్వదేశీ ఎలక్ట్రానిక్స్ రంగం సాధించిన అభివృద్ధి, ముఖ్యంగా కొవిడ్ తర్వాత.. కొత్త మార్కెట్లు, కొత్త వినియోగదారులను సృష్టించుకున్న తీరును వివరించారు. ఇన్నాళ్లూ సాఫ్ట్వేర్ రంగంలో జరిగినన్ని ఆవిష్కరణలు.. హార్డ్‌వేర్ రంగంలో జరగలేదని తెలిపారు. అలాంటి పరిస్థితి నుంచి ఇటీవలి కాలంలో భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేషమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డిజైన్, సిస్టమ్స్ డిజైన్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ తన బలాన్ని, బలగాన్ని చాటుకుందని అన్నారు.
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ నేడు ప్రపంచంలోనే రెండో స్థానంలో వుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఏటా 30 కోట్ల మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. అయితే, మొబైల్ ఫోన్లలో వాడే చిప్‌లు మాత్రం.. తైవాన్, చైనా, జపాన్ వంటి దేశాల్లోనే తయారవుతున్నాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద పెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థలు కూడా భారత్‌లో వెల్లువలా పెట్టుబడులు పెడుతున్నాయి. అటు స్వదేశీ సంస్థలు కూడా సొంతంగా సెమీకండక్టర్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో సెమీ కండక్టర్ తయారీలో భారత్ కూడా అగ్రగామి దేశాల్లో ఒకటిగా మారబోతోంది.
ఇంటెల్ తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కమర్షియల్ మైక్రో ప్రాసెసర్ ‘4004’తయారై 50 ఏళ్లు పూర్తయింది. సరిగ్గా ఈ చారిత్రక సందర్భంలోనే భారత్ కూడా సెమీ కండక్టర్ తయారీ రంగంలో కొత్త అవకాశాలను పుణికిపుచ్చుకుని పరుగులు తీస్తోంది. మైక్రో చిప్ మార్కెట్లో ఇంటెల్ ఇప్పటికీ గ్లోబల్ లీడరే. అయితే, ఇంటెల్ విజయగాథ వెనుక.. ప్రపంచం గుర్తించని ఎందరో భారతీయ నిపుణుల కృషి దాగివుందన్నది నగ్న సత్యం.
స్వయంగా ప్రస్తుత కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఒకప్పుడు ఇంటెల్ ఇంజనీర్. 1988లో ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్. పూర్తిచేసిన రాజీవ్.. ఆ వెంటనే ఇంటెల్ లో జాయిన్ అయ్యారు. ఇంటెల్ తయారు చేసిన ప్రతిష్టాత్మక ‘80486’ ప్రాసెసర్ డెవలప్మెంట్ టీమ్‌లో రాజీవ్ కూడా మెంబర్. ఇంటెల్ మైక్రో ప్రాసెసర్ గ్రూప్ హెడ్, ‘ఫాదర్ ఆఫ్ ది పెంటియమ్ చిప్’ వినోద్ ధామ్.. అప్పట్లో రాజీవ్‌కు టీమ్ లీడ్. వినోద్ ధామ్తో కలిసి ‘పెంటియమ్ సెంట్రల్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్’పై రాజీవ్ పనిచేశారు. 1991లో భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ BPL గ్రూప్‌లో చేరారు. 1994లో BPL మొబైల్ సంస్థను స్థాపించిన రాజీవ్ చంద్రశేఖర్.. దేశంలో తొలి స్వదేశీ మొబైల్ ఫోన్‌ను తయారు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ ప్రోత్సాహంతో వినోద్ ధామ్ పలుమార్లు మోదీ ప్రభుత్వంతో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఉన్నతి కోసం విలువైన ప్రణాళికలు, వ్యూహాలు అందించారు. అవే ఇప్పుడు భారత స్వదేశీ సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతమిచ్చాయి.
‘80386’ నుంచి ‘80486’ చిప్ వరకు.. ఆ తర్వాత పెంటియమ్ నుంచి జీయాన్ వరకు.. ఇలా ఇంటెల్ ఆవిష్కరించిన ప్రతి మైక్రోచిప్ తయారీలో భారతీయుల పాత్ర వుంది. వినోద్ ధామ్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి ఎందరో ఇంజనీర్లు తమ మేథస్సును ధారపోసి దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు కాబట్టే.. ఇంటెల్ ఈరోజున ప్రపంచ నెంబర్ వన్ చిప్ తయారీ సంస్థగా వెలుగొందుతోంది. ఇంటెల్ ఎదుగుదల వెనుక దాదాపు 40 ఏళ్ల భారతీయుల కృషి దాగివుందని నిపుణులు చెబుతారు.
నాడు, నేడు కూడా ఇంటెల్‌లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇంటెల్ శాంటా క్లారా ప్లాంట్ జనరల్ మేనేజర్, పెంటియమ్ యూఎస్ టీమ్ లీడర్ అవతార్ సైనీ.. మైక్రో చిప్ ప్రాసెసింగ్‌ను 32 బిట్ నుంచి 64 బిట్ కు అప్ గ్రేడ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.1996లో భారత్ కు తిరిగొచ్చిన తర్వాత ఇంటెల్ దక్షిణాసియా హెడ్‌గా ఆయన వ్యవహరించారు. బెంగళూరులో ఇంటెల్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించారు అవతార్ సైనీ. ఆ తర్వాత భారత్ లో ఇంటెల్ చిప్ తయారీ పరిధి పెరిగింది. 2008లో తయారైన జియాన్ చిప్ ప్రాసెసర్ భారత్ లోనే పురుడుపోసుకుంది.
ఇక, ఇంటెల్ ఇంజనీర్స్ డైరెక్టర్ రవిశంకర్ కుప్పుస్వామి 2011లో జియాన్ సెవెన్త్ జనరేషన్ తయారీకి నేతృత్వం వహించారు. వసంత ఎర్రగుంట్ల నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్.. ప్రపంచంలోనే తొలి టెరాఫ్లాబ్ చిప్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఇక, 2016లో సోలార్ ప్యానెల్‌తో మైక్రోచిప్ తయారు చేసింది ఇంటెల్. ఈ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహించింది కూడా భారతీయుడే. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ వెంగల్ నేతృత్వంలో సోలార్ ప్యానెల్ మైక్రోచిప్ తయారైంది. ఇలా ఎందరో భారతీయులు ఇంటెల్ లో సెమీకండక్టర్ల దినదినాభివృద్ధికి పాటుపడ్డారు.
ఒక్క ఇంటెల్ లోనే కాదు, AMD లోనూ భారతీయ నిపుణులదే హవా. హైదరాబాద్, బెంగళూరులో వున్న కంపెనీ R&D సెంటర్లలో 80 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఇటీవల కొవిడ్ లాక్ డౌన్ లో వర్క్ ఫ్రమ్ హోం చేసి కూడా అద్భుతాలు ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మైక్రోచిప్ EPYC మిలాన్ ను తయారు చేసి సత్తాచాటారు.
ఇక IBM లో భారతీయ ప్రతిభ గురించి చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్లుగా మన ఇంజనీర్లు ఎన్నో ఆవిష్కరణలకు ఆజ్యం పోశారు. 1996 నుంచి భారత్ కేంద్రంగా కూడా IBM లో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ‘పవర్ ప్రాసెసర్ ఫ్యామిలీ’ నుంచి అనేక చిప్ లను ఆవిష్కరించింది IBM. 2020లో ఆవిష్కరించిన ‘పవర్ 10 చిప్’ భారత్ లోనే తయారైంది. ఈ చిప్ ఆవిష్కరణకు ముందు 2019లో IBM India ఇంజనీర్లు ఏకంగా 900 గ్లోబల్ పేటెంట్లను పొందారు.
నిజానికి, పాతికేళ్ల క్రితమే దేశంలో మైక్రో చిప్ తయారీకి తొలి అడుగులు పడినా.. పరిశ్రమ వేగం పుంజుకోవడానికి మరో 20 ఏళ్లు ఆగాల్సివచ్చింది. 1985లో తొలి రాకెట్ ను ఎడ్లబండిమీద లాంఛింగ్ స్టేషన్ కు తీసుకెళ్లి ప్రయోగించింది భారత్. ఈ అంతరిక్ష ప్రయోగంతో తొలి ప్రయివేట్ ఇంటర్నేషనల్ గేట్ వే ఏర్పడింది. భారత్ నుంచి డేటా ప్రసారం మొదలైంది. ఒక రకంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి అంకురార్పణ జరిగింది అప్పుడే. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు 1995లో స్వదేశంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధికి తొలి అడుగులు పడ్డాయి. మల్టీ నేషనల్ కంపెనీ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ భారత్ లో మొదటిసారి ఆర్ అండ్ డి సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కంపెనీ తొలి భారతీయ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని రాజమ్ నేతృత్వంలో.. పూర్తిస్థాయిలో ‘డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్’ చిప్ తయారు చేసింది. ఆ తర్వాత ఆ కంపెనీలో మరికొన్ని మేడిన్ ఇండియా చిప్ లు రూపుదిద్దుకున్నాయి. ఆడియో ప్రాసెసర్ ‘మల్హర్’ తో పాటు.. ప్రపంచంలోనే తొలి సింగిల్ చిప్ మోడెమ్ ‘సంగమ్’ను తయారు చేసింది టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. అలా భారత్ లో సెమీకండక్టర్ల తయారీకి బాటలు పడ్డాయి. శ్రీని రాజమ్ తన ఆరుగురు కొలీగ్స్ తో కలిసి.. మరిన్ని చిప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చారు.
ఇక, ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత భారత్ లో సెమీ కండక్టర్ల తయారీ మరింత ఊపందుకుంది. 2015లో ‘సాఫ్ట్వేర్ రేడియో సొల్యూషన్స్’లో పేరుగాంచిన ‘సాంఖ్యా లాబ్స్’ కంపెనీ.. ‘పృథ్వి’ పేరుతో ప్రపంచంలోనే తొలి ‘సింగిల్ చిప్ రేడియో మోడల్’ను ఆవిష్కరించింది. ఈ చిప్ కారణంగానే నేడు గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. మొబైల్ డేటా, బ్రాండ్ బాండ్ కవరేజీ లేని ఏరియాల్లో టీవీ సిగ్నల్స్ అందుతున్నాయి. బాంబే, ఢిల్లీ ఐఐటీలు, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ‘సాంఖ్యా ల్యాబ్స్’ చిప్‌లను ఫీడ్ టెస్ట్ చేశారు. అప్పటి నుంచి స్వదేశీ చిప్ డిజైనింగ్ లో ఐఐటీలు కూడా కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నాయి. 2019లో ‘అజిత్’ పేరుతో ఐఐటీ బాంబే మైక్రో ప్రాసెసర్‌ను తయారు చేసింది.
ఇక, లో పవర్ అప్లికేషన్స్ కోసం ఐఐటీ మద్రాస్ శక్తి పేరుతో RISC ప్రాసెసర్‌ను తయారు చేసి సత్తా చాటింది. కాన్పూర్ ఐఐటీ ఏడాది క్రితం కొవిడ్ లాక్ డౌన్ లోనూ ‘మౌషిక్’ పేరుతో చిప్‌ను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. ఇలా విదేశీ కంపెనీలకు దీటుగా స్వదేశీ సెమీకండక్టర్ల డిజైన్ లో ప్రస్తుతం ఐఐటీలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు, చండీగఢ్‌లోని సెమీకండక్టర్ ల్యాబోరేటరీ దేశ డిఫెన్స్, స్పేస్ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లను అందిస్తోంది. సెమీకండక్టర్ పరిశ్రమ ఇదే స్పీడ్ తో ముందుకు సాగితే.. మరికొద్ది రోజుల్లో.. పూర్తి దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా.. చైనా, అమెరికాను తలదన్ని విదేశీ ఎగుమతుల్లోనూ భారత్ రికార్డు సృష్టిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.