రాజస్థాన్‌లోని శ్రీ పంచఖండ్ పీఠ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరానికి సంబంధించిన 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2020లో రామాలయ నిర్మాణం మొదలు కాగా, 2024లో పూర్తి కానుంది. 2024 మకర సంక్రాంతి రోజున రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించాలని భావిస్తూ ఉన్నారు. 1949లో రామమందిరం కోసం ఉద్యమం ఆరంభమవ్వడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల ఫలితంగా ఆలయ నిర్మాణం సగం పూర్తి అయినట్టు చెప్పారు.
అన్ని సామాజిక, మతపరమైన ఉద్యమాలలో ‘శ్రీ పంచఖండ పీఠం’ ఎల్లప్పుడూ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. “మహాత్మా రామచంద్ర వీర్ జీ మహరాజ్, స్వామి ఆచార్య ధర్మేంద్ర జీ మహారాజ్ దేశానికి నిస్వార్థంగా కృషి చేసిన వారు. దేశ సంక్షేమం, ప్రజల సంక్షేమం కోసం పీఠం కూడా కీలక పాత్ర పోషించింది. రాముడు జన్మించిన చోటే ఆలయాన్ని నిర్మించాలన్నది ఆచార్య కల అని అన్నారు యోగి. ఆచార్య తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, హేతుబద్ధంగా చెప్పేవారని సీఎం అన్నారు. నేడు, ఆచార్య జీ భౌతికంగా లేకపోయినా, ఆయన విలువలు, ఆదర్శాలు, సహకారం మనందరిలో సజీవంగా ఉన్నాయని అన్నారు.