More

    4500కు పైగా మరణాలను కేజ్రీవాల్ సర్కార్ దాచిపెట్టిందా..?

    భారతదేశం కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే..! రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులపైనా, మరణాల పైనా ఎటువంటి డేటాను దాచవద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం కరోనా మరణాల సంఖ్యను దాచిందని ‘ది హిందూ’ తమ రిపోర్టులో తెలిపింది. గత 24 రోజుల్లో ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా 4500 పైగా మరణాలను దాచిందని తెలుస్తోంది. ఏప్రిల్ 18 నుండి మే 11 మధ్య ప్రభుత్వం చెబుతున్న మరణాలకు.. అంత్యక్రియలు నిర్వహించిన మరణాలకు మధ్య 4783 వ్యత్యాసం ఉండడాన్ని గుర్తించారు. మున్సిపల్ రికార్డుల ప్రకారం 24 రోజుల వ్యవధిలో 12833 మంది చనిపోయారని ఉండగా.. ఢిల్లీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 8050 కరోనా మరణాలు సంభవించాయని తెలుస్తోంది.

    కరోనా మరణాలను ఆప్ ప్రభుత్వం దాస్తోందని ఢిల్లీ బీజేపీ నాయకులు ఆరోపించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య చెప్పకుండా పెద్ద తప్పు చేస్తోందని నార్త్ ఎంసిడి మేయర్ జై ప్రకాష్ విమర్శించారు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుండి ఆప్ ప్రభుత్వం కరోనా డేటా విషయంలో తప్పులు చూపిస్తోందని అన్నారు. మరణాల సంఖ్యలు సరిగా చెబితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. కావాల్సిన కట్టెలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుందని.. శానిటేషన్ పనుల కోసం మనుషుల అవసరం ఉంటుందని కూడా తెలిపారు.

    ఈ మరణాల సంఖ్యల్లో వ్యత్యాసం ఉండడానికి ‘టెక్నికల్ కారణాలు’ కూడా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారిని కూడా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నారని.. అందుకే మున్సిపల్ శాఖకు చెందిన డేటా వేరుగా ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉన్నారు. ఆసుపత్రుల్లో అడ్మిషన్స్ దొరక్కుండా చనిపోయిన వారు ఉంటారని కూడా వెల్లడించారు. తాము అన్ని విషయాల్లోనూ ఎంతో పారదర్శకతతో వ్యవహరిస్తూ ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

    దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగించారు. లాక్ డౌన్ తో ప్రస్తుతం కేసులు చాలా వరకు తగ్గాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మహమ్మారి తీవ్రతను మరింతగా తగ్గించేందుకు మరో వారం పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కరోనా పాజిటివిటీ రేట్ ను చాలా తగ్గించాల్సి ఉందని.. మే 24వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం నాడు తెలిపింది. ఏప్రిల్ మధ్య నాటికి ఢిల్లీలో 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 11.32 శాతానికి తగ్గిందని.. ఇది ఐదు శాతానికి చేరుకుంటేనే ముప్పు తగ్గినట్లుగా భావిస్తారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు తగ్గినా.. ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. అందుకే లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాన్న వినియోగించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) లేఖ రాసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధ్రువీకరించారు. స్టేడియంలో రోజూ 10 వేల మందికి వ్యాక్సిన్లు వేయొచ్చని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు స్టేడియాన్ని వాడుకోవచ్చని రోహన్ జైట్లీ చెప్పారు.

    Related Stories