దోచుకెళ్లిన వారసత్వ సంపద తిరిగి తీసుకుని వచ్చింది మోదీ ప్రభుత్వమే

0
666

దోచుకెళ్లిన 75 శాతం వారసత్వ సంపదను మోదీ ప్రభుత్వం హయాంలోనే తిరిగి రప్పించగలిగామని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి చెప్పారు. మన దేశ వారసత్వ సంపదలో దోచుకెళ్లిన ఎక్కువ కళాఖండాలు మోదీ పాలనలో తిరిగి భారత్‌కు వచ్చాయని అన్నారు. గురువారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 1976 నుంచి ఇప్పటి వరకు 54 కళాఖండాలను విదేశాల నుండి తిరిగి రప్పించామని, వీటిలో అత్యధికం ఈ ఏడేళ్ళలో వచ్చినవేనని ఆ సమాధానంలో చెప్పుకొచ్చారు. 2014 నుండి ఇప్పటి వరకు 41 కళా ఖండాలను రప్పించినట్లు చెప్పారు. వివిధ దేశాల అధినేతలతో మోదీ సత్సంబంధాలను ఏర్పరచుకుంటున్నారని, ఫలితంగా మన దేశంతో ఇతర దేశాలతో సాంస్కృతిక సంబంధాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని చెప్పారు.

నెహ్రూ-గాంధీ కుటుంబం, ఆ పార్టీ నేతలు సంపదను పోగేసుకోవడంపైనే దృష్టి సారించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 10 కళాఖండాలను మాత్రమే వెనుకకు రప్పించగలిగిందన్నారు. 2014 లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశం 41 వారసత్వ కళాఖండాలను దేశానికి తీసుకుని రాగలిగింది. ఇది ఇప్పటి వరకు తిరిగి వచ్చిన మొత్తం వస్తువులలో 75% కంటే ఎక్కువ అని తేల్చి చెప్పారు. విదేశాల నుండి దొంగిలించబడిన అనేక వారసత్వ వస్తువులను మేము తిరిగి పొందగలిగినందుకు గర్విస్తున్నామని అన్నారు. గత ఏడు సంవత్సరాలలో రికవరీ చేయబడిన పురాతన వస్తువుల సంఖ్య అత్యధికమని.. వారసత్వపు పురాతన వస్తువులను వెలికితీసేందుకు ప్రధాని మోదీ చేసిన నిర్విరామ కృషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రధాన మంత్రి వివిధ దేశాధినేతలతో పెంచుకునే స్నేహపూర్వక వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎన్నో వస్తువులను వేగవంతంగా భారత్ కు తిరిగి తీసుకురావడం సాధ్యమైందని సాంస్కృతిక మంత్రి తెలిపారు. ఈ ప్రయత్నంలో ASI, CBI వంటి వివిధ ప్రభుత్వ సంస్థల అవిశ్రాంత కృషిని కిషన్ రెడ్డి ప్రశంసించారు.

కాంగ్రెస్ తన 25 సంవత్సరాల పాలనలో 10 కంటే తక్కువ పురాతన వస్తువులను తిరిగి తీసుకువచ్చింది:
కాంగ్రెస్ నాయకులు భారతదేశ సాంస్కృతిక మరియు నాగరిక సంపదను కాపాడడం కంటే తమ కోసం సంపదను కూడబెట్టుకోవడమే ఎక్కువ అని భావించారని కిషన్ రెడ్డి విమర్శించారు. 1976 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు పరిపాలించింది, 10 కంటే తక్కువ పురాతన వస్తువులను తిరిగి తీసుకువచ్చింది. ఇది మన భారతీయ నాగరిక వారసత్వాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చూపిన నిబద్ధత మరియు గౌరవం అని కౌంటర్ వేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారసులు భారతదేశ సంస్కృతి మరియు నాగరిక సంపదను కాపాడడం కంటే తమ కోసం సంపదను సంపాదించడంలో ఎక్కువ ఆసక్తి చూపారని కిషన్ రెడ్డి అన్నారు.

భారత్ కు తిరిగి ఇచ్చేస్తున్న ఆస్ట్రేలియా

నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన 14 కళాఖండాలను భారత ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. భారత్ కు తిరిగి పంపబడుతున్న 14 కళాఖండాలలో ఆరు కాంస్య శిల్పాలు, ఊరేగింపు చేసే శిల్పాలు, పెయింటింగ్ చేసిన ఆరు ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఈ కలెక్షన్ విలువ సుమారు $ 2.2 మిలియన్లు (సుమారు రూ. 16.34 కోట్లు). వాటిలో కొన్ని 12 వ శతాబ్దానికి చెందినవి. వీటిలో చాలా వరకూ దొంగిలించబడిన విగ్రహాలేనని తెలుస్తోంది. భారత్ నుండి దొంగతనం చేయబడి.. పలు మార్గాల్లో ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి ఈ విగ్రహాలు. అవి భారత్ కు చెందినవేనని మన ప్రభుత్వం వాదించడంతో ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేయాలని అనుకుంటూ ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం నవంబర్ 2019 లో మూడు సాంస్కృతికంగా ముఖ్యమైన కళాఖండాలను భారత్ కు తిరిగి ఇచ్చేసింది. తమిళనాడుకు చెందిన ఒక జత ‘ద్వారపాలకుల’ విగ్రహాలు, రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్ కు చెందిన ‘నాగరాజు (పాము రాజు)’ విగ్రహాలను భారత్ కు తిరిగి ఇచ్చేసింది. దశాబ్దాలుగా ఎన్నో వందల అమూల్యమైన పురాతన విగ్రహాలు, కళాఖండాలు భారతదేశం నుండి అక్రమంగా రవాణా చేయబడ్డాయి. అనేక ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీలు, వేలం వేసే సంస్థలు మధ్యవర్తులు, స్మగ్లర్ల ద్వారా ఇటువంటి వస్తువులను అందుకున్నట్లు తెలిసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here