More

  టైమ్ లేదు మిత్రులారా..! చేసింది చెప్పి ఓట్లు అడగండి..! కార్యకర్తలకు మోదీ దిశా నిర్దేశం..

  దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇక 400 రోజులే సమయం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తవగా,.. కేసీఆర్ ప్రచార సభలు, ఏపీలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ యాత్రలు మొదలయ్యాయి. అన్ని పార్టీలు వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతుండగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇందుకు సిద్దం అవుతోంది. దీనికోసం అధికారంలో ఉన్న మంత్రులకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయా శాఖల మంత్రులు పనిచేయాలని కోరారు. దీనికి సోషల్ మీడియాను పకడ్బందీగా ఉపయోగించుకుంటే మరింత చేరువ కావచ్చని పిలుపునిచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు ఎనిమిదిన్నరేళ్ళ కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.

  దీనికి సంబంధించి అన్ని శాఖలతో ప్రధాని మోదీ ఓ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజనతో పాటు,.. 81 కోట్ల మందికి ఉచితంగా అందించిన బియ్యం లాంటి పథకాలను జనంలోకి తీసుకెళ్ళాలన్నారు. తమ పథకాలను ప్రతి పేదవారికీ చేర్చాలనే లక్ష్యంతో పని చేశామన్నారు. కులం, మతం, ప్రాంతీయ బేధాలు లేకుండా తమ పథకాలు అర్హులందరికీ చేరాయని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల్లో కూడా కేంద్ర ఏమాత్రమూ రాజీ పడలేదన్నారు. ఈ ఐదు గంటల మీటింగ్ లో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి వివరించారు. సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య సదుపాయాల్లో కేంద్రం సాధించిన విజయాల గురించి తెలిపారు. IITలు, IIMల కల్పనలో కూడా కేంద్ర ప్రభుత్వం రాజీపడలేదన్నారు. దేశంలో ఎంతో మంది విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ లలో విద్య కొనసాగించేందుకు వీలు ఏర్పడిందని రాజీవ్ అన్నారు.

  ఈ పథకాల కాపీలను ఆయా శాఖల మంత్రులకు క్యాబినెట్ కార్యదర్శి అందించారు. వీటిని సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేయాలన్నదానిపై Broadcasting మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వివరించారు. యువతకు చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన వనరు అని ఆయన అన్నారు. దీని ద్వారా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ప్రచారం కలుగుతుందని తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాంల వినియోగంలో ప్రధాని మోదీ ముందు వరుసలో ఉన్నారని వెల్లడించారు. మోదీలా కొద్ది మంది మంత్రులు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. చాలామంది మంత్రులు సోషల్ మీడియా ప్రాథాన్యత గుర్తించడంలో విఫలం అవుతున్నరాన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాధనాలను ఉపయోగించుకుని, పథకాల ప్రచారానికి వాటిని వాడుకుంటే ఎంతో మేలు కలుగుతుందని వివరించారు. యువతకు పథకాలను చేరువ చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు.

  ఇక ప్రధాని మోదీ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ప్రయత్నాలు ఒకవైపు కొనసాగిస్తూనే ప్రభుత్వ మంత్రులకు కూడా ఇందులో భాగం కావాలని కోరుతున్నారు. కేవలం మంత్రిత్వ బాధ్యతలు మాత్రమే కొనసాగిస్తే సరిపోదనీ,.. వాటికి సంబంధించిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా మంత్రులు ప్రధాన పాత్ర పోషించాలని హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం కనబరిస్తే నష్టపోయేది పార్టీనే కాబట్టి,.. గెలుపు కోసం అందరూ సమిష్టిగా కష్టపడాలని తెలుపుతున్నారు.

  Trending Stories

  Related Stories