దేశంలో అక్రమంగా నివసిస్తున్న 40 మంది బంగ్లాదేశీయులను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. భివాండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో వీరంతా పని చేస్తూ ఉన్నారు. అలా మొత్తం 40 మంది బంగ్లా జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద సరైన ధృవపత్రాలు లేవని స్పష్టంగా తెలుస్తోంది. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులు, పాస్‌పోర్టులు, పాన్ కార్డులు, రూ.94 విలువచేసే 28 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముంబై, గుజరాత్, భివాండి చిరునామాలతో నకిలీ పత్రాలు ఉన్నాయని వెల్లడించారు. వారు తమ బంధువులు, సరిహద్దులు దాటించిన వ్యక్తితో ఐఎంపీవో యాప్ సహాయంతో మాట్లాడుతున్నారని చెప్పారు. వారందరిపై కేసు నమోదుచేశామన్నారు.
భివాండిలోని మూడు వేర్వేరు పోలీసు స్టేషన్ లిమిట్స్ లో వారు ఇన్ని రోజులు బ్రతుకుతూ వచ్చారు. భివాండిలోని జోన్ 2 డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) యోగేష్ చవాన్ విలేకరులతో మాట్లాడుతూ, అరెస్టు చేసిన వ్యక్తులు వేర్వేరు ప్రదేశాలలో కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్పారు. భారత్‌లో ఉండేందుకు వారి వద్ద సరైన పత్రాలు లేవని చెప్పారు. భారత పాస్‌పోర్ట్ చట్టం, విదేశీ పౌరుల చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.

పట్టణం పరిసర ప్రాంతాల్లో అనేక దాడులు నిర్వహించామని.. పలు అరెస్టులకు దారితీసిందని అన్నారు. శాంతి నగర్‌లో మొత్తం 20 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేయగా, భివాండి పట్టణం మరియు నార్పోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది చొప్పున అరెస్టు చేశారు. ఈ బంగ్లాదేశ్ జాతీయుల నుండి కనుగొనబడిన పత్రాలలో ముంబై, గుజరాత్ మరియు భివాండి చిరునామాలు ఉన్నాయి. సరిహద్దు దాటడానికి తమకు సహకరించిన వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి IMO యాప్‌ను ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు.
గత వారం, బెంగళూరు శివార్లలో అక్రమంగా నివసిస్తున్న ఐదుగురు బంగ్లాదేశీయులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ అక్రమ వలసదారులు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లను ఆదేశించినట్లు జననేంద్ర తెలిపారు.వలస వచ్చినవారు కాఫీ తోటలు మరియు నిర్మాణ ప్రదేశాలలో పనిచేశారు. ఎంతమంది కర్ణాటక రాష్ట్రంలోకి చొరబడ్డారనే వివరాలను వారి నుంచే బయటకు తీస్తామని జ్ఞానేంద్ర అన్నారు. వారు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు పొందారు. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం తీసుకుని వచ్చిన ప్రయోజనాలను పొందారని అన్నారు.