భారతీయ జనతా పార్టీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి

తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో భారతీయ జనతా పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే..! ఇటీవలి కాలంలో పలువురు భారతీయ జనతా పార్టీ నేతలపై దాడులు జరిగాయి. తాజాగా మరో భారతీయ జనతా పార్టీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో నాలుగు సంవత్సరాల చిన్నారి మరణించగా.. మరో ఏడు మంది దాకా గాయపడ్డారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని ఖండ్లి ప్రాంతంలోని బీజేపీ నాయకుడు జస్బీర్ సింగ్ ఇంటిపై గురువారం జరిగిన గ్రెనేడ్ దాడిలో 4 ఏళ్ల చిన్నారి మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మరణించిన మైనర్ ను జస్బీర్ సింగ్ మేనల్లుడుగా గుర్తించారు. రాజౌరిలోని ఖండ్లి ప్రాంతంలో బీజేపీ నాయకుడు జస్బీర్ సింగ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనేడ్ దాడి చేసినట్లు జమ్ము ఎడిజిపి ధృవీకరించారు. ఈ గ్రెనేడ్ దాడికి పాల్పడినట్లు పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ప్రకటించింది. జస్బీర్ సింగ్ నివాసం వద్ద గ్రెనేడ్ దాడి నేపథ్యంలో రాజౌరిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరో ఘటనలో జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై గురువారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు భద్రతా సిబ్బంది సహా నలుగురు గాయపడ్డారు. “జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కుల్గాంలోని ఖాజీగుండ్ ప్రాంతంలోని మల్పోరా వద్ద బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు” అని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న కాన్వాయ్ ను తీవ్రవాదులు టార్గెట్ చేశారని అధికారులు తెలిపారు.