టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ హత్య కేసును.. 24 గంటల్లో సాల్వ్ చేశారు పోలీసులు. నటిని హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారు.
జమ్ము కశ్మీర్ టీవీ నటి అమ్రీన్ భట్‌ను బుద్గం జిల్లాలో కాల్చి చంపారు టెర్రరిస్టులు. అయితే వాళ్లను ట్రాప్ చేసిన జమ్ము పోలీసులు.. పుల్వామా జిల్లా అవంతిపోరా అగన్‌హంజిపోరా దగ్గర గురువారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఈ తాయిబా గ్రూప్ సభ్యులుగా నిర్ధారించారు. ఎల్‌ఈటీ కమాండర్ లతీఫ్ ఆదేశాలతోనే వీళ్లిద్దరూ టీవీ నటిని పొట్టనబెట్టుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే.. శ్రీనగర్ సౌరా ఏరియాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో.. ఇంకో ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు ఏరిపారేశారు. గత మూడు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
బుద్గామ్‌లోని చదూరా ప్రాంతంలో కశ్మీరి టీవీ నటి అమ్రీన్ భట్‌ను బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఇదే ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ గాయపడ్డాడు. పదేళ్ల బాలుడి చేతికి బుల్లెట్ గాయమైందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అమ్రీన్ భట్ తల్లిదండ్రులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. టీవీ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్ బంధువు జుబైర్ అహ్మద్ మాట్లాడుతూ బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు షూటింగ్ ఉందంటూ పిలిచేందుకు ఇంటికి వచ్చారని తెలిపారు. అమ్రీన్ బయటకు షూటింగ్‌కు రానని చెప్పడంతో కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఏం తప్పు చేసిందని కాల్పులు జరిపారని ప్రశ్నించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం గురువారం రాత్రి భద్రతా బలగాలు ఆ ముష్కరులను మట్టుబెట్టాయి.
పోలీసుల లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో గత 5 నెలల్లో 26 మంది విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కర్ కు చెందిన 14 మంది, జైష్ ఏ మహ్మద్ కు చెందిన 12 మంది ఉన్నారు. గురువారం కుప్వారాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ముకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. 2021లో జరిగిన ఎన్‌కౌంటర్లలోలో మొత్తం 182 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. మరోవైపు.. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత.. 2022 జనవరి నాటికి 439 మంది ఉగ్రవాదులు హతమయ్యారని పార్లమెంటులో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. 2022మే 8 వరకున్న అధికారిక సమాచారం ప్రకారం.. 2018లో 187, 2019లో 121, 2020లో 181, 2021లో 142, 2022లో 28 మంది జమ్ము కశ్మీర్ కు చెందిన స్థానిక యువకులు పలు ఉగ్రవాద సంస్థల్లో చేరారు. గత 4 నెలల్లో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో 460 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.