డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు..?

0
794

మత్తుసీమలో టాలీవుడ్ నటులే కాదు, తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా విహరిస్తున్నారు. తాజాగా బెంగళూరులో వెలుగుచూసిన ఓ డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు బయటికిరావడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా ఈ డ్రగ్స్ రాకెట్‌కు హైదరాబాద్‌తోనూ సంబంధం ఉందని తేలిది. ఇటీవల బెంగళూరులో కొద్దిరోజుల క్రితం కొందరు నైజీరియ‌న్స్‌ పట్టుబడ్డారు. వారిని విచారించిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిశాయి. క‌న్నడ చిత్ర పరిశ్రమలో నిర్మాత శంక‌ర్ గౌడ్‌తో క‌లిసి క‌ల‌హ‌ర్ రెడ్డి, సందీప్ అనే వ్యక్తులు ఈ డ్రగ్స్ రాకెట్ ను కొనసాగించినట్లు తెలుస్తతోంది. బెంగళూరులోని పబ్‌లు, హోటళ్లకు హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్తలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్‌కు తాము డ్రగ్స్ సరఫరా చేసినట్టు పట్టుబడిన నైజీరియన్స్ ఒప్పుకున్నారు. దీంతో ఈ ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇక, ఇప్పటికే సందీప్‌ను బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు పార్టీలు ఇచ్చినట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చిన‌ట్లు సమాచారం. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీల్లో పాల్గొన్నారని, వారు కూడా డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే ఆర్డర్ మేరకు చాలాసార్లు కొకైన్ కూడా పంపినట్టు సందీప్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో చాలా మంది ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నామని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అయితే, కలహార్ రెడ్డి, శంకర్ గౌడ్‌తో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు త్వరలోనే ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్నది ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ వ్యక్తికి తన వ్యాపారంలో భాగంగా సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు డ్రగ్స్ మార్కెట్‌లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని తెలుస్తోంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేల పేర్లు వినపడటం సంచలనంగా మారింది. పూర్తి స్థాయి ఆధారాలు ఉండి.. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే రాజకీయాల్లో అది పెను సంచలనం కానుంది. నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై స్పష్టత ఉన్నప్పటికీ.. వారి అరెస్ట్‌కు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని పోలీసు వర్గాల సమాచారం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nineteen + seven =