ఓట్ల వేటలో భాగంగా.. కాంగ్రెస్ కాబోయే రారాజు.. కేరళ మొత్తం చుట్టేశాడు. సముద్రంలోకి దూకి ఈతకొట్టాడు. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టాడు. యాభైఏళ్ల లేటు వయసులో.. యంగ్ గా కనబడేందుకు వేషాన్ని మార్చేశాడు. కుర్తా పైజామా వదిలేసి.. జీన్స్, టీషర్ట్ లోకి మారాడు. పక్క రాష్ట్రం తమిళనాడుకు వెళ్లి.. కాలేజీ స్టూడెంట్స్ ముందు కండబలం చూపించాడు. ఓ విద్యార్థినితో పోటీపడి మరీ పుష్ అప్ లు చేశాడు. అబ్బో.. ఓట్లను ఆకర్షించడానికి ఈయన పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇంతా చేస్తే.. ఈ వయనాడు వస్తాదుకు.. సొంత నియోజకవర్గం నేతలే గట్టి షాకిచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దక్షిణాది పర్యటన ముగించుకుని.. అలా ఇంటికి చేరాడో లేదో.. ఈ చేదు నిజం రాహుల్ చెవిన పడింది. దీంతో.. తాను కష్టపడి పనిచేసినప్పటి.. గత ఎన్నికల ప్రొగ్రెస్ రికార్డు.. రాహుల్ కళ్లముందు గిర్రున తిరిగింది.
విషయానికొస్తే.. తాజాగా రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం వయనాడ్ కు చెందిన నలుగురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ సభ్యుడు కె.కె. విశ్వనాథన్, కేపీసీసీ సెక్రటరీ ఎం.ఎస్. విశ్వనాథన్, డీసీసీ జనరల్ సెక్రటరీ పి.కె. అనిల్ కుమార్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుజయ వేణుగోపాల్ రెడ్డి పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. పార్టీ నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. అందుకే పార్టీని వీడాల్సి వచ్చిందని.. ఎంఎస్ విశ్వనాథన్ ఆరోపించారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టుగా తెలిపారు. డీసీసీ జనరల్ సెక్రెటరీ పి.కె. అనిల్ కుమార్ పార్టీని వీడి లోక్‌తాంత్రిక్ జనతాదళ్ లో చేరారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె. సుధాకరన్ తో పాటు పలువురు సీనియర్ నేతలను ఆ పార్టీ నాయకత్వం వయనాడ్ కు పంపింది.
మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగునున్న తరుణంలో.. కాంగ్రెస్ ముఖ్యనేతలు రాజీనామాలు చేయడం.. ఆ పార్టీ అధిష్టానాన్నిన షాక్ కు గురిచేసింది. అది కూడా రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం నుంచి కావడం.. హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఇది పార్టీకి నష్టం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. పరిస్థితి కాస్తా ఎల్డీఎఫ్ కే అనుకూలంగా వున్నట్టు.. ఇటీవలి సర్వేలు తేల్చేశాయి. అటు బీజేపీ కూడా పంజుకుంటున్నట్టు సంకేతాలిచ్చాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు.
దేశమంతా తమ ప్రాభవాన్ని కోల్పోయి కేవలం మూడు, నాలుగు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలంటే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తీరాలి. ఇలాంటి తరుణంలో స్వయంగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ జిల్లాలోనే.. పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత నియోజవర్గంలో సీనియర్ నేతల్నే కాపాడుకోలేకపోయిన రాహుల్.. కేరళలో కాంగ్రెస్ ఎలా గట్టెక్కిస్తాడని.. సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట..!