రైళ్లపై జరుగుతున్న రాళ్లదాడులపై దక్షిణ మధ్య రైల్వే తీవ్రంగా స్పందించింది. ఇలాంటి దాడులకు పాల్పడే వాళ్లకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేసింది. ఐతే రాళ్లు విసరడం వల్ల పలు సందర్భాల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా రైల్వే ఆస్తులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 39 మందిని గుర్తించి, కేసులు నమోదు చేసింది. వారిని అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ దాడులలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రైళ్లపై రాళ్లు రువ్వడం తీవ్రమైన నేరమని, రైల్వే చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌సిఆర్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ నేరాలకు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాజీపేట్-ఖమ్మం, కాజీపేట్-బోంగీర్, ఏలూరు-రాజమండ్రి వంటి రూట్లలో వందేభారత్ రైళ్లపై దాడి జరిగిందన్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరంలోనే తొమ్మిది ఘటనలు చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇలాంటి నేరపూరిత చర్యలకు దూరంగా ఉండాలని పౌరులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండేలా పిల్లలకు సలహాలు, అవగాహన కల్పించాలని కోరారు.