కేవలం 20 రోజుల్లోనే 300 పడకల ఆసుపత్రిని నిర్మించేశారు. ఈ నిర్మాణం అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది. గువహతి లోని సరుసాజై స్టేడియం కాంప్లెక్స్ వద్ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కేవలం 20 రోజుల్లో కోవిడ్ -19 రోగుల కోసం 300 పడకల ఆసుపత్రిని నిర్మించింది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది. మొత్తం 3200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 21.46 కోట్లు ఖర్చు చేశారు. జనరల్ వార్డులో 200 పడకలు, 100 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) పడకలు ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. ప్రయోగశాల, అల్ట్రాసౌండ్, ఇసిజి గది, ఫార్మసీ, ఎక్స్‌రే గదులు కూడా ఉన్నాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ కోవిడ్ -19 రోగులకు ఆసుపత్రి బెడ్ల సమస్యను తీర్చడానికి రాష్ట్రవ్యాప్తంగా 390 ఐసియు పడకలు, 2,684 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయగలిగామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక కరోనా రోగుల ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి వీలు కల్పించిందని, దేశంలోని ఈశాన్య భాగంలోని ఇతర రాష్ట్రాలకు కూడా సాయం అందించిందని తెలిపారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా అస్సాం చేస్తున్న యుద్ధానికి డిఆర్‌డిఓ నిర్మించిన ఈ ఆసుపత్రి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం 3,800 రోజువారీ కోవిడ్ -19 కేసులను మూడు శాతం పాజిటివిటీ రేటుతో నమోదు అవుతోంది. కోవిడ్ రెండవ వేవ్ సమయంలో డిఆర్‌డిఓ ఆరు ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. ఢిల్లీలో 750 పడకల సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆసుపత్రి, గుజరాత్ అహ్మదాబాద్‌లో 900 పడకల ధన్వంతరి ఆసుపత్రి, పాట్నాలో 500 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి, వారణాసిలోని 750 పడకల పండిట్ రాజన్ మిశ్రా ఆసుపత్రి లతో పాటూ పరిశోధనా సంస్థను కూడా ఏర్పాటు చేసింది. లక్నోలో 500 పడకల అటల్ బిహారీ వాజ్‌పేయి ఆసుపత్రిని నిర్మించింది.