More

    రెండు రోజుల్లో తొమ్మిది మంది తీవ్ర వాదులను అంతం చేసిన భారత సైన్యం

    జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రత బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. శ్రీనగర్‌ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఆ అసమయంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. చనిపోయిన తీవ్రవాదుల్లో ఒకరిని జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన సుహైల్‌ అహ్మద్‌ రాథర్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరిని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.

    ఈ ఘటనలో ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు భద్రతా బలగాల సిబ్బంది కూడా గాయపడ్డారని వారు తెలిపారు. అనంత్‌నాగ్‌లో ముగ్గురు జెఎమ్‌ ఉగ్రవాదులు మరణించడంతో, దక్షిణ కాశ్మీర్‌లో బుధవారం రాత్రి జరిగిన రెండు కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరుకుంది.

    కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలోని నౌగామ్ షహాబాద్‌లో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. సోదాల సమయంలో, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురుతిరిగాయి. ఇది ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని, ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన చెప్పారు. కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక పోలీసు గాయపడ్డారు.. వారిని ఆర్మీ యొక్క 92 బేస్ ఆసుపత్రికి తరలించారు.

    ఉగ్రవాదులు జెఎమ్‌తో అనుబంధం కలిగి ఉన్నారని, హతమైన ఉగ్రవాదిలో ఒకరు పాకిస్థాన్ జాతీయుడని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ‘రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జేఈఎంకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. హతమైన నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థానీ, ఇద్దరు స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు. మరో ఇద్దరు ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇది మాకు పెద్ద విజయం’ అని విజయ్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    కుల్గామ్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. మరో ఇద్దరు స్థానికులేనని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో యుద్ధ సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, రెండు రోజుల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదలును భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి.

    Trending Stories

    Related Stories