ఉలిక్కి పడ్డ ఢిల్లీ.. భారీ అగ్ని ప్రమాదంలో 27 మంది మృతి

0
711

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 27 మంది ఇప్పటిదాకా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్థుల భవనంలో మంటలు వ్యాపించడంతో 27 మంది మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల 40 నిమిషాల సమయంలో మంటలు అంటుకోగా అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్ల సాయంతో అర్ధరాత్రి వరకూ మంటలను ఆర్పేందుకు శ్రమించింది. మంటలను అదుపు చేసి భవనం లోపలికి వెళ్లే సరికే వారికి కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భవనంలో మంటలు, పొగ అలుముకుంటుండగా అందులో ఉన్న వారు తాళ్ల సాయంతో, పగలగొట్టిన కిటికీల నుంచి బయటపడ్డారు. మంటలు అంటుకున్న భవనం నుంచి మరో భవంతిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు మరికొందరు. 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 60 నుంచి 70 మందిని రక్షించామని తెలిపారు. ఇంకా గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఈ భవనంలోని తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాల ఉత్పత్తి సంస్థలో మంటలు ఆరంభమై భవనమంతా పాకాయని డీసీపీ శర్మ చెప్పారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందన్నారు. కంపెనీ అధిపతిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

నాలుగు అంతస్తుల వాణిజ్య భవనం ముండ్కా మెట్రో స్టేషన్‌లోని పిల్లర్ నంబర్ 544 సమీపంలో ఉంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భవన యజమాని వద్ద అగ్నిమాపక ఎన్‌ఓసి లేదని పోలీసులు తెలుసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. “భవనంలో అగ్నిమాపక ఎన్‌ఓసి లేదు. భవనం యజమానిని పై అంతస్తులో నివసించే మనీష్ లక్రాగా గుర్తించారు. లక్రా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, అతన్ని త్వరలో పట్టుకుంటాం” అని పోలీసులు ANIకి తెలిపారు.