సెప్టెంబర్ 22 న ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఐదు జాతుల ఖడ్గమృగాల విషయంలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 2011 నుండి నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చాలా వరకూ ఖడ్గమృగాలు అంతరించి పోయే స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా వాటి కొమ్ముల కోసమే వేటగాళ్లు చంపుకుంటూ వెళుతున్నారు.
మనదేశంలో అస్సాంలోని అటవీ శాఖ కూడా ఖడ్గ మృగాలను కాపాడుతూ వస్తోంది. ఆ ప్రాంతంలో కూడా చాలా ఖడ్గ మృగాలు మరణించాయి. కొన్ని వేటగాళ్ల కారణంగా మరణించగా.. ఇంకొన్ని సహజంగా మరణించాయి. అలా చనిపోయిన వాటి కొమ్ములను అధికారులు సేకరించి పెట్టారు. ప్రపంచ ఖడ్గమృగం దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది ఖడ్గమృగాల కొమ్ములను దగ్దం చేసింది. కాజీరంగ జాతీయ ఉద్యానవనంలోని బోకాఖట్‌లో 2,479 ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కొమ్ములను అక్కడి అధికారులు బహిరంగంగా దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కొమ్ములను సేకరించే పని దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. వాటిని అటవీ శాఖ ఆధీనంలో రాష్ట్ర ట్రెజరీలలో ఉంచారు. ముఖ్యంగా, ఖడ్గమృగం యొక్క కొమ్ముల పొడిని ఉపయోగించి సాంప్రదాయ చైనీస్ ఔషధాలను తయారు చేస్తారనే అపోహ ఉంది. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరను పొందుతారు స్మగ్లర్లు. వారందరికీ బుద్ధి చెప్పడమే కాకుండా అపోహలను తొలగించాలని అస్సాం ప్రభుత్వం భావించింది. హిందూ సాంప్రదాయ ఆచారంలో దహన సంస్కారాలను నిర్వహించి.. దాదాపు 2500 కొమ్ములను దహనం చేశారు.
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన ‘రైనో హార్న్ రీ-వెరిఫికేషన్’ కార్యక్రమంలో భాగంగా వీటిని స్మగ్లర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గత వారం రాష్ట్ర మంత్రివర్గం కొమ్ముల దహనం చేయనున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రైనో కొమ్ములకు ఎలాంటి ఔషధ ప్రాముఖ్యత లేదని వేటగాళ్లకు బలమైన సందేశం ఇవ్వడం కోసం అస్సాం ప్రభుత్వం ఇలా చేసింది. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకంతో ప్రజలు వాటిని వేటాడుతున్నారు. ఫలితంగా ఖడ్గమృగాల సంఖ్య తగ్గిపోతున్నది. ఈ నేపథ్యం లో ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టి, ఖడ్గమృగాలను సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ కొమ్ములను కాల్చివేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అలాగే ఇతర రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.