More

    హిజాబ్ ముఖ్యం.. పరీక్షలు వద్దంటూ 231 మంది గైర్హాజరు

    కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో చదువుతున్న కనీసం 231 మంది ముస్లిం విద్యార్థులు పరీక్షకు హాజరు అవ్వలేదు. హిజాబ్‌ను తొలగించమని అధికారులు కోరడంతో శుక్రవారం ప్రిపరేటరీ పరీక్షలకు హాజరు కావడానికి నిరాకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ లేదా బురఖా వంటి మతపరమైన దుస్తులను నిషేధిస్తూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి విద్యాసంస్థల దుస్తుల కోడ్‌ను అనుసరించాలని కళాశాల అధికారులు విద్యార్థులను కోరారు. హై కోర్టు తీర్పు ఆధారంగా అధికారులు.. కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు హిజాబ్‌ను తొలగించాలని కోరారు.

    హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిని పరీక్షకు అనుమతించేది లేదని పీయూ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కూడా స్పష్టం చేశారు. బాలికలు వారి హిజాబ్‌ను తొలగించడానికి నిరాకరించారు. దీంతో కళాశాల యాజమాన్యం వారిని పరీక్షకు కూర్చోవడానికి అనుమతించలేదు. శుక్రవారం కన్నడ పరీక్ష జరిగింది. మహిళలు హిజాబ్ ధరించి పరీక్ష రాయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం వ్యక్తులతో సహా దాదాపు 250 మంది విద్యార్థులు నిరసనకు దిగడంతో క్యాంపస్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ముస్లిం నాయకులు హిజాబ్‌ను తొలగించి పరీక్షలు రాయమని విద్యార్థులను ఒప్పించే ప్రయత్నం చేశారు, అయితే చాలా మంది ముస్లిం విద్యార్థులు పరీక్షకు హాజరుకాకుండా వెళ్లిపోయారు. కళాశాల ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ, “కొంతమంది బాలురుతో సహా 231 మంది ద్వితీయ సంవత్సరం పియూ విద్యార్థులు కన్నడ పరీక్ష రాయకుండానే వెళ్లిపోయారు.” అని చెప్పుకొచ్చారు.

    కర్నాటక హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చినా.. హిజాబ్‌ను ధరించాలని విద్యార్థులు పట్టుబట్టారు. హిజాబ్ అనేది మతపరమైన ఆచారం కాదని, విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించరాదని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పులో పేర్కొంది. పాఠశాలలు, కళాశాలలు తమ ప్రాంగణంలో యూనిఫాం డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరి చేసే హక్కు ఉందని పేర్కొంది. ఉత్తర్వు ఉన్నప్పటికీ, పలువురు ముస్లిం విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా హిజాబ్, స్కల్ క్యాప్ మొదలైనవి ధరించి హైకోర్టు తీర్పును ఉల్లంఘించారు. ముస్లిం అబ్బాయిలు తకియా క్యాప్ (మతపరమైన టోపీ) ధరించి పాఠశాలకు వెళ్లడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించింది. అలా కర్ణాటక పాఠశాలల్లో యూనిఫాం నిబంధనలను ఉల్లంఘించారు.

    రాయచూర్‌లోని ఉర్దూ పాఠశాలకు చెందిన టీచర్ టోపీ ధరించిన ముస్లిం బాలుడిని పాఠశాల ఆవరణలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వీడియోలో కనిపించింది. తరగతి గదిలోకి ప్రవేశించే ముందు టోపీని తీసివేయమని బాలుడిని కోరారు.

    Trending Stories

    Related Stories