More

  పాకిస్థాన్ లో బయటపడిన 2300 ఏళ్ల నాటి ఆలయం

  2300 సంవత్సరాల పురాతన బౌద్ధ దేవాలయ అవశేషాలు వాయువ్య పాకిస్థాన్‌లో బయట పడ్డాయి. అనేక ఇతర బౌద్ధ కళాఖండాలను పాకిస్థాన్- ఇటాలియన్ పురావస్తు శాస్త్రజ్ఞుల సంయుక్త బృందంచే కనుగొనబడింది. ISMEO అని పిలువబడే ఇటాలియన్ ఆర్కియాలజికల్ మిషన్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ జిల్లాలోని బరికోట్ తహసిల్‌లో పాకిస్తాన్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల సహకారంతో బౌద్ధ కాలం నాటి బజీరా నగరం యొక్క శిధిలాలను త్రవ్వుతున్నారు. కొన్ని రోజుల క్రితం, ఇటాలియన్ మిషన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో షాహి విష్ణు దేవాలయాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది.

  సీనియర్ అధికారి మాట్లాడుతూ, “పాకిస్థానీ-ఇటాలియన్ పురావస్తు శాస్త్రవేత్తలు చారిత్రాత్మక ప్రదేశంలో సంయుక్త త్రవ్వకాల ద్వారా వాయువ్య పాకిస్తాన్‌లో బౌద్ధ కాలానికి చెందిన 2,300 సంవత్సరాల పురాతనమైన అప్సిడల్ ఆలయాన్ని కనుగొన్నారు. అంతేకాకుండా ఇతర విలువైన కళాఖండాలను వెలికితీశారు. స్వాత్‌లో కనుగొనబడిన ఆలయం పాకిస్థాన్ లోని తక్ష శిలా అవశేషాలలో కనుగొనబడిన దేవాలయాల కంటే పురాతనమైనది. ఈ దేవాలయం పాకిస్థాన్‌లోని పురాతన బౌద్ధ దేవాలయం అని చెబుతారు.” అని అన్నారు. బౌద్ధ కాలం నాటి సుమారు 2,700 పురాతన కళాఖండాలు, నాణేలు, ఉంగరాలు, కుండలు, గ్రీస్ రాజు మెనాండర్ కాలం నాటి ఖరోస్తీ భాష వంటివి త్రవ్వకాలలో బయటపడ్డాయి.

  పాకిస్థాన్‌లోని ఇటాలియన్ రాయబారి ఆండ్రియాస్ ఫెరారెస్ మాట్లాడుతూ పాకిస్థాన్‌లోని పురావస్తు ప్రదేశాలు ప్రపంచంలోని వివిధ మతాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చాయని తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో వరుస దొంగల గుంటలు కూడా అన్వేషించబడ్డాయి. త్రవ్వకాల్లో దోపిడీ దారుల విధ్వంసం నుండి బయటపడిన బౌద్ధ స్మారక చిహ్నం కూడా బయటపడిందని ఇటాలియన్ పురావస్తు శాస్త్రజ్ఞుడు లూకా M. ఒలివియరీ గతంలో చెప్పారు. నవంబర్ 2021లో బరికోట్‌లో జరిగిన మరో త్రవ్వకం గురించి ఒలివియరి మాట్లాడుతూ “మేము ఏ కాలానికి చెందినవో తెలియని ఇతర పురావస్తు విశేషాల సమాధుల వరుసను కనుగొన్నాము. ఈ సమాధులు ఇండో-గ్రీక్, సకా-పార్థియన్ కాలానికి చెందిన కుండల ముక్కలు, ఇతర అరుదైన ఆవిష్కరణలను కలిగి ఉన్నాయి” అని అన్నారు

  స్వాత్ జిల్లాలోని చారిత్రాత్మక బజీరా నగరంలో జరిపుతున్న తవ్వకాల్లో మరిన్ని పురావస్తు ప్రదేశాలు కనుగొనబడతాయని ఇటాలియన్ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేశారు. మ్యూజియం మరియు పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ అబ్దుస్ సమద్ మాట్లాడుతూ, బారికోట్ స్వాత్‌లోని బజీరా నగరం తక్షిలా(తక్ష శిల) అవశేషాల కంటే పురాతనమైనది. ఇటాలియన్ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, ఖైబర్ పఖ్తుంఖ్వా పురావస్తు శాఖల PhD విద్యార్థులు ఆ ప్రదేశాల త్రవ్వకాల్లో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. ఖైబర్ ప్రభుత్వం పద్నాలుగు పురావస్తు ప్రదేశాలను కొనుగోలు చేసిందని, అక్కడ తవ్వకం పురోగతిలో ఉందని డాక్టర్ సమద్ తెలియజేశారు.

  Trending Stories

  Related Stories