ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రూ అప్ చార్జీలకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. బిల్లులో ట్రూ అప్ సెక్షన్ కింద యూనిట్‌కు రూ.1.23 పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. వంద యూనిట్లు వాడితే రూ. 123 అదనంగా వస్తుందన్నమాట. ఈ బిల్లులు చూసి వినియోగదారులు షాకవుతున్నారు. గత ఆరేళ్ల కాలంలో విద్యుత్ సంస్థలు అంచనా కన్నా ఎక్కువ ఖర్చుచేశాయని ఆ మొత్తాన్ని ప్రజల దగ్గర నుండి రాబట్టుకోడానికి ట్రూ అప్ చార్జీలను తీసుకుని వచ్చారు. 8 నెలల్లో రూ.3,660 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందంటూ ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వం ట్రూ అప్ సర్దుబాటు కోసం నిధులేవీ ఇవ్వలేదని అందుకే ప్రజల దగ్గర వసూలు చేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఈ నెల కరెంట్ బిల్లులు భారీగా వచ్చాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిన్న హోటల్ కు 21 కోట్ల రూపాయల బిల్లు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఓ టిఫిన్ హోటల్ కు కరెంటు బిల్లు వచ్చింది. ఆ కరెంటు బిల్లు చూసిన టిఫిన్ హోటల్ నిర్వాహకురాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెప్టెంబరు మాసానికి రూ.21 కోట్ల మేర బిల్లు వేశారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో ఆ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగదారునికి కొత్త బిల్లు అందజేస్తామన్నారు.

ఈ బిల్లు తీయడంలో నిర్లక్ష్యం వహించాడంటూ చింతలపూడి మీటర్ రీడింగ్ ఉద్యోగి ప్రభాకర్ తో పాటు ఆ ప్రాంత ఏఈపైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సాంకేతికలోపం కారణంగానే ఇలాంటి బిల్లులు వస్తుంటాయని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.జనార్ధనరావు స్పష్టం చేశారు. ఈనెల 7న చింతలపూడి సెక్షన్‌లో గత నెలలో మార్చిన మీటర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు.
