More

  2024 : టార్గెట్ మోదీ..!
  పీకే అ‘పొజిషన్’..!!

  ఒకటి కాదు.. రెండు కాదు.. కాంగ్రెస్ అధికారానికి దూరమై ఏడేళ్లు దాటిపోయింది. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ టైమ్‎లో సుమారుగా ఓ మూడేళ్లు,.. ఆ తర్వాత వాజ్‎పేయి టైమ్‎లో ఓ ఆరేళ్లు. ఇలా కొద్దికాలం తప్పితే.. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఇన్నేళ్లపాటు ఎప్పుడూ అధికారానికి దూరంగా లేదు. అడపాదడపా ఆ ఫ్రంటూ.. ఈ ఫ్రంటూ అధికారంలోకి వచ్చినా.. వాటిని ఏనాడూ ఏడాది కంటే ఎక్కువగా కొనసాగనివ్వని చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. సరే, థర్డ్ ఫ్రంట్ అధికార సమయాన్ని లెక్కలోకి తీసుకున్నా.. మహా అయితే ఓ నాలుగేళ్లు. అంతేగానీ, ఇలా వరుసగా ఏడేళ్ల పాటు ఏనాడు హస్తం పార్టీ అధికారానికి దూరంగా లేదు. పైగా అధికారానికి దూరమై గాంధీ వారసత్వం అల్లాడిపోతోంది. పీవీ టైమ్‎లో తమ పెత్తనం అనుకున్నంత సాగకపోయినా.. వాజ్ పేయి తర్వాత వచ్చిన అవకాశాన్ని.. మన్మోహనుడితో మమ అనిపింపించింది. ఇక ఆగడం వారి వల్ల కావడం లేదు. ఆరునూరైనా, సూర్యచంద్రులు ఒక్కటైనా ఈసారి పదవిని వదలొద్దని భీష్మించుకుంది గాంధీ కుటుంబం. అయితే ప్రత్యక్షంగా,.. లేదంటే పరోక్షంగా.. ఎలాగోలా పవర్ లోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీకి మూడో అవకాశం ఇవ్వకూడదని.. 2024లో కచ్చితంగా అధికార పగ్గాలు అందుకోవాల్సిందేనని ప్లాన్లు రెడీ చేస్తోంది.

  రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. వచ్చే ఎన్నిల కోసం ఇప్పటి నుంచే థర్డ్ ఫ్రంట్ ను దువ్వే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఒంటరిగా వెళ్తే గత రెండు ఎన్నికల్లో జరిగిన పరాభవం రిపీట్ అవుతుందని భావించిందో ఏమో గానీ.. మమతా బెనర్జీ వంటి థర్డ్ ఫ్రంట్ లీడర్లను మచ్చిక చేసుకోవడం ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇచ్చిన సంతృప్తితో అప్పుడే వ్యూహ రచనకు కూడా పదునుపెట్టినట్టు తెలుస్తోంది. మోదీకి మూడో ఛాన్స్ దక్కకుండా చూసేందుకు ముచ్చటగా మూడు ఫార్మాలు సిద్ధం చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. వీటిలో ఏదో ఒక ఫార్ములాను ఫాలో అయిపోయి గట్టేక్కాలని ప్రయత్నాలు ప్రారంభించిందట. మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించింది. దీంతో 2024 ఎన్నికల్లో మమతా బెనర్జీని ప్రతిపక్ష నేతగా ప్రమోట్ చేసి దీదీ ఛరిష్మాను వాడుకోవాలనుకుంటున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. అంతకుముందు కూడా మూడో ఫ్రంట్ లో భాగంగా.. ఓ గాంధీయేతర అభ్యర్థిని ప్రమోట్ చేసి లబ్దిపొందిన సందర్భాలున్నాయి. ఈసారి అదే ప్లాన్ రిపీట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ దీదీవైపే ఎందుకు మొగ్గచూపుతుంది..? కేజ్రీవాల్, నితీష్ కుమార్ వంటి నేతల్ని కూడా ప్రమోట్ చేయవచ్చు కదా..? అనే అనుమానం రావడం సహజమే. అయితే, దీదీ వైపే ముగ్గుచూపడానికి గల కారణాలు తెలియాలంటే.. గత ఏడేళ్లలో ఈ ఏడేళ్లో బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బల గురించి చర్చించుకోవాలి. 2015 లో నితీష్ కుమార్, 2019లో అరవింద్ కేజ్రీవాల్, 2021లో మమతా బెనర్జీ రూపంలో కమలం పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే, ఇందులో నితీష్ కుమార్.. ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్డీఏతో జట్టుకట్టి, సీఎం పదవి చేపట్టాడు. తన పొలిటికల్ కెరీర్ ముగింపు దశలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఆ అవకాశం లేకుండాపోయింది. ఇక, కేజ్రీవాల్ విషయానికి వస్తే.. అతడు ఢిల్లీ సీఎం అయ్యేనాటికి.. అతనికున్న రాజకీయ అనుభవం చాలా తక్కువ. ఇక, మిగిలింది మమతా బెనర్జీ. పైగా ఇటీవలే బెంగాల్ లో బీజేపీపై ఘన విజయం సాధించి.. ‘మై హూనా’ అంటూ విపక్షాలకు అభయం ఇచ్చారు. అందుకే, ఇప్పుడు దీదీని ముందు పెట్టి,.. కథ నడిపించాలని చూస్తోందట కాంగ్రెస్. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందు ప్రస్తుతం మూడు మార్గాలు కనిపిస్తున్నాయి. వాటి గురించి చర్చించుకుందాం.

  ఇందులో మొదటిది : మమతా బెనర్జీని ప్రతిపక్షనాయకురాలిగా అంగీకరించి ముందుకు సాగడం. రెండవది : మమతా బెనర్జీని కాదని.. గత ఎన్నికల్లో మాదిరిగా డీఎంకే, ఆర్జేడీలతో కలిసి నడవడం. ఇక, మూడవది : రాహుల్ గాంధీని ముందు పెట్టి.. మమతా బెనర్జీ సపోర్టు తీసుకోవడం. వీటిలో మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వున్న ఒకటి, మూడు ప్లాన్ల గురించి ముందు చర్చించుకుందాం. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఘన విజయం సాధించిన తర్వాత.. తృణమూల్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై గళం విప్పుతున్నాయి. దీదీతో కలిసి కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. నిజానికి, ఓ కాంగ్రేసేతర నాయకురాలికి ఆ పార్టీ అంత ప్రాధాన్యత ఇవ్వదు. అలా చూసినప్పుడు రాహుల్ గాంధీని కాదని.. మమతా బెనర్జీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సాహసమే అవుతుంది. అందువల్ల మొదటి ప్లాన్ ను అమలుపరచడం అంత ఆశామాషీ వ్యవహారం ఏమీ కాదు.

  సరే దీదీకి అవకాశం ఇచ్చారే అనుకుందాం. అప్పుడు జాతీయస్థాయిలో మోదీతో తలపడటం మమతా బెనర్జీకి ఇదే మొదటిసారి అవుతుంది. అప్పుడు సహజంగానే.. ఇది హిందువులు, ముస్లింల మధ్య పోటీగా మారుతుంది. అదే జరిగితే మెజార్టీ హిందూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి దూరమవుతారు. మరి, కేవలం మైనార్టీ ఓటు బ్యాంకును మాత్రమే నమ్ముకుని కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమే. అదే జరిగితే, ఎన్డీఏకు మరోసారి ఘన విజయం తథ్యం. పైగా, బెంగాల్ పై మమతా బెనర్జీకి ఎంత పట్టున్నా.. ఆ రాష్ట్రంలో జరుగుతున్న మారణహోమాన్ని గమనిస్తున్న దేశ ప్రజలు.. ఆమెను ఓ నయవంచకురాలిగానే చూస్తారు. ఇలా ఎన్నికల్లో గెలిచిన తర్వాత హత్యారాజకీయాలకు పాల్పడే లీడర్‎ను ఓటర్లు నమ్ముతారా..? 2024లో ఒకవేళ దీదీ విజయం సాధిస్తే.. బెంగాల్ హత్యా రాజకీయాలో దేశవ్యాప్తం కావన్న గ్యారెంటీ ఏంటి..? ఇలా.. హత్యారాజకీయాలకు పాల్పడే మనస్తత్వం కలిగిన దీదీని.. దేశ ప్రజలు నాయకురాలిగా అంగీకరిస్తారా..? సో.. ప్లాన్ నెంబర్ వన్‎ను అమలు చేయడం కూడా అంత సులభం కాదు.

  ఇక, ప్లాన్ నెంబర్ త్రీని చూద్దాం.. ఈ ప్లాన్ లో రాహుల్ గాంధీని ముందు పెట్టి.. దీదీ మద్దతుగా నిలపడటం ప్రధాన ఉద్ధేశం. ఈ ప్లాన్ వల్ల కూడా ఉపయోగం తక్కువే. ప్రధాని పీఠానికి రాహుల్ గాంధీని ప్రత్యామ్నాయంగా చూపించడం కొత్తేం కాదు. గత రెండు టర్ముల్లో జరిగింది అదే. అది ఫెయిల్యూర్ స్ట్రాటజీ అని తేలిపోయింది. అయితే, ప్రస్తుతానికి, ప్లాన్ వన్ కంటే.. కూడా ప్లాన్ త్రీనే కొంచెం బలోపేతంగా కనిపిస్తున్నా.. ఎన్డీఏ విజయానికి అడ్డుకట్ట వేయడం కష్టమనేది విశ్లేషకుల అభిప్రాయం. కాకపోతే, కాంగ్రెస్ పార్టీ ఆ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశం వుండొచ్చు. అదే జరిగితే 2019 మరోసారి రిపీట్ అవుతుంది అంతే..!

  ఇక, మిగిలింది ప్లాన్ నెంబర్ టు. అంటే దీదీ ప్రాతినిథ్యం లేకుండా 2019 స్ట్రాటజీని రిపీట్ చేయడం.. ఇది కాంగ్రెస్ పార్టీ ముందున్న అవకాశం. అంటే, ఎప్పటిలాగే ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, సీపీఎం, ఆర్జేడీ వంటి నమ్మకమైన మిత్రులతో కలిసి నడవడం. ఇదే సమయంలో బెంగాల్ ప్రజలు అందించిన విజయంతో ఉత్సాహంగా వున్న మమతా బెనర్జీ.. శివసేన, జేడీఎస్, ఆప్, అకాలీదళ్, టీఆర్ఎస్, వైసీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలతో మరో బృందాన్ని తయారు చేసుకునే అవకాశం వుంది. ఇలా మొత్తం విపక్షాలన్నీ రెండు జట్లుగా విడిపోయిన పక్షంలో.. బీజేపీ వ్యతిరేక ఓటు కూడా రెండు గ్రూపులుగా చీలిపోతుంది. అప్పుడు, టీఎంసీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆశ్యర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. కాంగ్రెస్ మరింత కిందికి దిగజారిపోతుంది. సో.. ఈ స్ట్రాటజీ కాంగ్రెస్ అమలు పరిచే అవకాశాలు చాలా తక్కువ. సో.. ప్లాన్ 1 అండ్ 3 లపైనే ఫోకస్ పెట్టవచ్చు. టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సైతం ఈ రెండు ప్లాన్ల వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి, ఈ వ్యూహాల వెనుక ఆయనే కర్మ, కర్త అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగితే గెలుపు ఖాయమనేది రాజకీయ పార్టీల ధీమా. 2014లో బీజేపీ అఖండ విజయంతో వెలుగులోకి వచ్చిన ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ తర్వాత బీజేపీని వీడిన పీకే.. ప్రస్తుతం కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల పురోగతి కోసం పాటుపడుతున్నారు. ప్లాన్ వేశాడంటే తిరుగుండదనే రీతిలో వుంటాయి పీకే వ్యూహాలు. గతంలో కేజ్రీవాల్ ను ఢిల్లీ పీఠంపై కూర్చొబెట్టిందీ ఆయనే. అఖిలేష్ యాదవ్‎ను సీఎం చేసిందీ ఆయనే. బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీల మహాకూటమి కోసం పని చేసి సత్తా చాటారు. అయితే, ఆ తర్వాత మహాకూటమిలో విబేధాలు రావడం.. నితీష్, బీజేపీ కలిసి సర్కార్‎ను ఏర్పాటు చేశారు. మళ్లీ ఉత్తరాదిలోనే కాదు.. పీకే పాపులారిటీ దక్షిణాదికి కూడా విస్తరించింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, తమిళనాడులో స్టాలిన్ విజయం వెనుక పీకే కృషి చాలావుంది. పీకే వకాల్తా పుచ్చుకున్నాడంటే.. ఆరు నూరైనా ఆ పార్టీని గెలిపించడానికి శాయాశక్తులా కృషిచేస్తాడు. గ్రౌండ్ లెవల్లో అధ్యయనం చేసి వ్యూహాలు రచిస్తాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపడంలో పీకే సిద్ధహస్తుడు. గెలుపుకోసం ఎంత దిగజారుడు పనులకైనా వెనుకాడడు. ఉన్నట్టుండి తమ నేతపై సానుభూతి కలిగేలా చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి విషయంలో కోడికత్తి వ్యూహం ప్రశాంత్ కిషోర్‎దేనని చెప్పుకుంటారు. కోడికత్తితో జగన్‎పై దాడి అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ ఘటన రాజకీయంగా జగన్‎కు చాలా హెల్ప్ చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. మొన్నటికి మొన్న మమతా బెనర్జీ గెలుపుకోసం బ్యాండేజీ వ్యూహాన్ని అమలు చేశాడు పీకే. దీదీ కాలుకు బ్యాండేజీ కట్టి ప్రచారానికి దింపి సానుభూతి కొట్టేశాడు. ఈ పరిణామంతో.. అప్పటిదాకా ఫిఫ్టీ ఫిఫ్టీగా వున్న గ్రాఫ్ ఒక్కసారిగా దీదీవైపు టర్న్ కావడం ప్రారంభించింది. ఆ తర్వాత మమతా బెనర్జీ థర్డ్ విక్టరీకి దారితీసింది.

  ఇప్పుడు 2024 ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ దృష్టిసారించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈసారి మోదీని ఎలాగైనా గద్దె దింపాలని వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాంగా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు పీకే. మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి నాయకులను ప్రమోట్ చేసి.. మోదీ షాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. ఈ వ్యూహంలో భాగంగానే ఇటీవల శరద్ పవార్ తో భేటీ అయి మంతనాలు జరిపాడు ప్రశాంత్ కిషోర్. శరద్ పవార్‎ను విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిపించి.. ఎన్డీఏపై పైచేయి సాధించాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని.. 2024 ఎన్నికల్లో విపక్షాల తరఫున మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి విజయం సాధించాలన్నది పీకే వ్యూహంగా తెలుస్తోంది. ఇంతకుముందు చెప్పుకున్న కాంగ్రెస్ మూడు ప్లాన్లు కూడా పీకే చలవేనని తెలుస్తోంది. ఇందులో రెండు ప్లాన్లలో మమతా బెనర్జీని కీలకపాత్రధారిగా నిలబెట్టారు పీకే. ఇప్పటికే టీఎంసీతో ఐదేళ్ల పాటు ఒప్పందాన్ని పొడగించుకున్న పీకే.. దీదీని పీఎంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఇందుకు సుముఖంగానే వున్నట్టు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఆలోచన వేరు. గతంలో మాదిరిగా విపక్షాలకు మద్దతు తెలిపి ఎవరినో ఒకరిని పీఎంగా చేసి.. ఆ తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం. ఇందులో భాగంగా ముందు దీదీ వంటి నేతలను పీఎంగా చేసి.. ఆ తర్వాత తనదైన రాజకీయ విద్యతో విపక్ష కూటమిలో చిచ్చు పెట్టి మళ్లీ అధికారానికి చేరువకావాలన్నది హస్తం పార్టీ యోచన. ఇదంతా జరగాలంటే, ముందు పీకే వ్యూహం ఫలించి, మమతా బెనర్జీ ప్రధాని కావాలి. మరి, ఈసారి పీకే వ్యూహాలు ఫలిస్తాయా..? మోదీ ఛరిష్మాను తట్టుకుని విపక్షాలను విజయ పథంలో నడిస్తాడా..? తెలియాలంటే.. 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.

  Trending Stories

  Related Stories