ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వారం రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తోపాటు, హోంమంత్రి అమిత్ షా, అలాగే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ సమావేశం అయ్యారు. అటు పార్టీలో కొత్తగా చేసిన జితిన్ ప్రసాద కూడా ఢిల్లీలో యూపీ సీఎం యోగిని కలవడం జరిగింది.
అయితే సడన్ గా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు? బీజేపీ హైకమాండ్ ఆయన్ను పిలిపించినందకే ఢిల్లీ వెళ్లారని.. కొంతమంది రాజకీయ పండితులు కథనాలు అల్లారు. ఇక లెఫ్ట్ లుటియెన్స్ మీడియా చానళ్లు అయితే.. ఒక అడుగు ముందుకు వేసి.., యోగికి ఉద్వాసన తప్పదని.., యూపీలో నాయకత్వ మార్పు దిశగా బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోందని, అందుకే సీఎం యోగిని ఢిల్లీ పిలిపించారని బ్రేకింగ్ లు నడిపాయి.
ఇంకా పీఎం మోదీ …యోగి పాలన తీరుపై అసంతృప్తితో ఉన్నారని.. యూపీ ప్రభుత్వ ప్రకటనల్లో పీఎం మోదీ చిత్రపటం ప్రచురించడం లేదని అందుకే సీఎం యోగిని ఢిల్లీకి పిలిపించివుంటారని కొందరు కాంగ్రెస్ నేతలు కొన్ని టీవీ చానళ్ల చర్చల్లో ఆరోపణలు చేశారు.
2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో.., కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే…80 లోక్ సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కమలం పార్టీకి ఎంతో కీలకంగా మారింది.! అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం గ్రౌండ్ లేవల్ నుంచి రహస్య నివేదికలు తెప్పించుకుందని అంటున్నారు. దాని ప్రకారమే వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓ రోడ్ మ్యాప్ ను అమిత్ షా రూపొందించారనే ప్రచారం కూడా జరుగుతోంది.
అమిత్ షా రచించిన వ్యూహంలో భాగంగానే.. యూపీలో బీజేపీని గెలిపించేందుకు, అవసరమైతే ఇతర పార్టీల నుంచి వచ్చే విభీషణుల సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.! దాంతోపాటు యూపీ సీఎం యోగి తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల కారణంగా, రాష్ట్రంలో బ్రాహ్మణ సమాజంలో, కొంత అసంతృప్తి నెలకొందని గుర్తించిన బీజేపీ అధిష్ఠానం…, వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే యూపీ కాంగ్రెస్ నేత… బ్రాహ్మణ చేతన పరిషత్ కన్వీనర్ గా కూడా వ్యవహారిస్తున్న జితిన్ ప్రసాదను బీజేపీలోకి ఆహ్వానించారని అంటున్నారు. అంతేకాదు జితన్ ప్రసాదకు యోగి మంత్రివర్గంలో సైతం అవకాశం దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. మొదట ఆయన్ను మంత్రిని చేసి.., ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారని కొన్ని వర్గాలు అంటున్నాయి.
మరోవైపు 2022 లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే జరుగుతాయని తాజా భేటీలో బీజేపీ అధిష్ఠానం స్పష్టం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో లెఫ్ట్ లిబరల్ లుటియెన్స్ మీడియా చానళ్లు సీఎం యోగిపై ఇంత వరకు వండివార్చిన కథనాలు వట్టికథనాలేనని తేలిపోయింది.
యూపీలో ఓబీసీ కుర్మీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్నా దళ్ నాయకురాలు అనుప్రియా పటేల్ , అలాగే ఎంబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున సంజయ్ నిషాద్ లు కూడా బీజేపీ హైకమాండ్ తో సమావేశం అయ్యారు. అటు యూపీ నుంచి కొంతమంది ఎంపీలకు సైతం కేంద్రమంత్రివర్గంలో కూడా చోటు లభించనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కూడా పీఎం మోదీ… సీఎం యోగితో చర్చించినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి.
ప్రధానమంత్రితో సీఎం యోగిల మధ్య సమావేశం దాదాపు గంటన్నరకు పైగానే జరిగింది. సీఎం యోగితో సమావేశం తర్వాత ప్రధాని మోదీ… అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ లతోనూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత ఐదేళ్లల్లో బీజేపీలో పీఎం మోదీ తర్వాత శక్తివంతమైన జాతీయ నాయకుడిగా అమిత్ షా ఎదిగారు. యూపీలో బీజేపీకి అద్భుత విజయాలు సాధించి పెట్టారు. కేంద్రంలో బీజేపీ సొంత బలంతో అధికారంలో రావడానికి అమిత్ షా ఎంతగానో కృషి చేశారు. అలాగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అమిత్ షా బీజేపీకి విజయాన్ని సాధించి పెట్టారు.
అయితే గత రెండు మూడేళ్లల్లో అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, మనోజ్ పారికర్ వంటి అనేకమంది బీజేపీ నేతలు కాలధర్మం చెందారు. మరోవైపు జాతీయదృక్పథం కలిగిన రెండో తరం నేతలు దేశానికి నేతృత్వం వహించేలా బీజేపీ హైకమాండ్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. 2022, 2023 ఈ రెండు సంవత్సరాలు కూడా బీజేపీకి… అలాగే దేశానికి ఎంతో కీలకమని…, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తప్పనిసరిగా ఏర్పడాల్సిందేనని.., విపక్షాలతో కూడిన సంకీర్ణ కిచిడి ప్రభుత్వం ఏర్పడితే, భారత్ ను అగ్రదేశాల సరసన నిలిపేందుకు పీఎం మోదీ పడిన శ్రమ అంతా వృధా అయిపోతుందని అటు సంఘ్ పెద్దలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో 2024 లోక్ సభ నాటికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఎన్డీఏ మిత్రపక్షాలకు సైతం ఆమోదయోగ్యమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు సైతం బీజేపీ హైకమాండ్ తన వంతు ప్రయత్నాలు చేస్తోందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.
యోగి ఆదిత్యనాథ్… ఉత్తర ప్రదేశ్ సీఎంగా నియమితులైన తర్వాత… జరిగిన చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం సీఎం యోగిని స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. అలాగే వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం యోగి నాయకత్వంలో ఎన్నికలు వెళ్లాలని నిర్ణయించింది. ఏ నాయకుడైనా జాతీయ స్థాయిలో అందరికి ఆమోదయోగ్యమైన నాయకుడిగా ఎదగలాంటే ఏళ్ళు పడుతుంది.
పీఎం నరేంద్రమోదీ అయితే పార్టీ జాతీయ నాయకత్వంలోని ఓ వర్గంతోపాటు.. దేశంలోని లెఫ్ట్ లుటియెన్స్ మీడియాతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఎన్నో అవమానాలకు గురయ్యారు. అన్నింటీని దిగమింగుకుని… గుజరాత్ సీఎంగా దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేయగలిగారు. ఆ తర్వాతే ఆయన జాతీయ నేతగా మారగాలిగారు.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కూడా పాలనపరంగా తనదైన ముద్రవేశారు. అయితే కరోనా విపత్కర పరిస్థితులను ఆసరగా చేసుకుని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అంతవరకు ఆయన చేసిన అభివృద్ధిపనులను చాకచాక్యంగా సైడ్ లేన్ చేసిందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో యూపీలో తిరిగి బీజేపీని సీఎం యోగి అధికారంలోకి తీసుకువస్తారా? జస్ట్ వెయిట్ అండ్ సీ.