More

    1971 వార్ హీరోకు ఘన సత్కారం

    1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. భారత ప్రభుత్వం‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ పేరుతో ప్రత్యేక కార్యక్రం నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 16న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ల స్మారకం వద్ద.. నాలుగు జ్యోతులను వెలించి దేశం నలుమూలలకు పంపించారు. ఇందులో భాగంగా.. విజయ జ్యోతి గురువారం తిరుపతికి చేరుకుంది. ఈ సదర్శంగా జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

    1971 నాటి యుద్ధంలో విశిష్ట సేవలు అందించిన తిరుపతి వాసి.. విశ్రాంత మేజర్‌ జనరల్‌ సీవీ వేణుగోపాల్‌ ను ఘనంగా సత్కరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. యుద్ధవీరుడి నివాసానికి వెళ్లి విజయ జ్యోతిని అందించారు. యుద్ధంలో వేణుగోపాల్‌ అందించిన సేవలను ఆర్మీ అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. నాటి యుద్ధ స్మృతులను సీఎం వైఎస్‌ జగన్‌.. సీవీ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేణుగోపాల్ ఇంటి వద్ద మొక్క నాటారు.

    1971లో జరిగిన భారత్, పాకిస్తాన్‌ మధ్య బంగ్లాదేశ్‌ విషయంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాతనే బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. 1947లో ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత దేశ విభజన జరిగి మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్‌లు ఏర్పడ్డాయి. భారత్‌కు పశ్చిమాన, తూర్పున ముస్లింలు అధికంగా ఉండటంతో.. పశ్చిమ పాకిస్తాన్‌, తూర్పు పాకిస్తాన్‌ కలసి ఒకే దేశంగా ఏర్పడ్డాయి. అయితే భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోయినప్పటి నుంచే ప్రత్యేక దేశం కోసం తూర్పు పాకిస్తాన్‌లో ఆందోళనలు జరిగాయి. రాజకీయం, ఆర్థికంగా తమకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంత.. తూర్పు పాకిస్తానీయుల ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు రానురాను ఉద్యమంగా మారాయి. దీంతో పాకిస్తాన్ పాలకులు తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేస్తూ వచ్చారు. అటు తూర్పు పాకిస్తాన్‌లో ఉన్న హిందువులను అణచివేసే ప్రయత్నాలను పాకిస్తాన్‌ ప్రభుత్వం చేసింది. లక్షలాది హిందువులు ఆశ్రయం కోసం భారత్‌వైపు వచ్చారు. వారికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆశ్రయం కల్పించారు. తూర్పు పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలలో శరణార్థుల కోసం శిబిరాలను ఏర్పాటు చేశారు. అయితే రోజు రోజుకూ శరణార్థుల సంఖ్య పెరుగుతుండడంతో భారత్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ప్రధాని ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తానీయుల ప్రత్యేక దేశం డిమాండ్‌కు మద్ధతు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్, భారత్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైంది. 13 రోజుల్లోనే పాకిస్తాన్‌ను భారత బలగాలు మట్టికరిపించాయి. బంగ్లాదేశ్‌ ఏర్పాటైంది.

    ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ కు మద్దతుగా వేలాది భారత సైనికులు వీరోచితంగా పోరాటం చేశారు. వారిలో చిత్తూరుకు చెందిన సీవీ వేణుగోపాల్‌ కూడా విశేష సేవలందించారు. ఆయను చిత్తూరు వేణుగోపాల్‌ అని కూడా పిలుస్తుంటారు. 1927లో జన్మించిన సి. వేణుగోపాల్.. 1950లో భారత సైన్యంలో చేరారు. 1971 యుద్ధంలో వేణుగోపాల్‌ సమర్థవంతమైన నాయకత్వం, యుద్ధ వ్యూహాలు భారత్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే భారత ప్రభుత్వం వేణుగోపాల్‌ను మహా వీరచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్ తో సత్కరించింది. ఈ క్రమంలో 1971 యుద్ధం జరిగి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ లో భాగంగా నాటి యుద్ధ వీరులను సన్మానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. రిటైర్డ్ మేజర్ జనరల్ సి. వేణుగోపాల్ ను ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం వేణుగోపాల్ వయసు 95 సంవత్సరాలు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వేడుకలకు హాజరు కాలేకపోయారు. దీంతో సీఎం జగన్ స్వంయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు.

    Trending Stories

    Related Stories