National

బార్డర్‎లో మిస్టరీగా కూలీల మిస్సింగ్..! నదిలో ఒకరి మృతదేహం లభ్యం

సరిహద్దుల్లో కూలీల మిస్సింగ్ మిస్టరీగా మారింది. బార్డర్ లో నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు కనిపించుకుండా పోయారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. భారత్-చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణంలో కూలీల బృందం పనిచేస్తోంది. వారిలో 19మంది మంది కార్మికులు గత వారం రోజుల క్రితం తప్పిపోయారు.

అలా మిస్సైన వారిలో ఒకరి మృతదేహం కుమి నదిలో లభ్యమైంది. దీంతో మిగిలిన కూలీలు కూడా నదిలో మునిగి చనిపోయి ఉంటారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది అనుమానం మాత్రమేనని.. ఖచ్చితంగా తెలియదని అంటున్నారు. ఈ కార్మికులకు సెలవు ఇవ్వడానికి కాంట్రాక్టార్ నిరాకరించడంతో.. సుమారు 19మంది కూలీలు కాలినడకన అస్సాంకు వెళ్ళడానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. అలా వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో మిస్ అయినట్లు తెలుస్తోంది. వాళ్లు పని చేస్తే ప్రాంతంలో చుట్టూ దట్టమైన అడవులు ఉండటంతో వాళ్లు దారి తెలియక తప్పిపోయి ఉంటారని భావిస్తున్నారు.

అసోం కు చెందిన కొందరు కార్మికులను రోడ్డు నిర్మాణం కోసం BRO అరుణాచల్‌కు తీసుకువచ్చారు. చైనా సరిహద్దు సమీపంలో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈద్ సందర్భంగా అసోం లోని తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నారు. కార్మికులు ఇంటికి వెళ్లేందుకు కాంట్రాక్టర్‌ బెంగియా బడోను సెలవు అడిగారు. అయితే.. కాంట్రాక్టర్ కూలీల కోరికను అంగీకరించకపోవడంతో.. కాంట్రాక్టర్ కు చెప్పకుండా వారికి ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల నుంచి తప్పించుకున్నారు. అక్కడ నుంచి కాలినడకన అస్సాంకు బయలుదేరారు. అయితే అరుణాచల్‌లోని కురుంగ్ కుమే జిల్లా అడవులలో కూలీలు అదృశ్యమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నదిలో మృతదేహం లభ్యం కావడంతో కూలీలంతా నదిలో కొట్టుకుపోయారా అనే కోణంలో గాలింపు చేపడుతున్నారు.

సంఘటనా స్థలం నుండి డిప్యూటీ కమిషనర్ ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కూలీలందరూ మరణించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ ని పంపి.. మిగిలిన కూలీల ఆచూకీ కోసం కృషి చేస్తామని అధికారులు చెప్పారు. కూలీలు నదిలో కొట్టుకుపోయారా..? లేదా చుట్టూ దట్టమైన అడవులు కావడంతో దారి తెలియక తప్పిపోయి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూలీల అచూకీకి సంబంధించి ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం లేదని పోలీసు అధికారులు తెలిపారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కోసం పెద్దఎత్తున నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతమైన డామిన్ సర్కిల్‌లో రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలను నియమించారు. ఈ నిర్మాణ స్థలం చైనా సరిహద్దుకు సమీపంలోని డామిన్‌లో ఉంది.

కూలీల కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. మరోవైపు తప్పిపోయిన కూలీల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమవారి ఆచూకీ ఏమైందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని ఎలాగైనా రక్షించి తీసుకురావాలని అధికారులను వేడుకుంటున్నారు. కాంట్రాక్టర్ మొండి వైఖరి వల్లే వారు తప్పిపోయినట్లు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు సైతం విచారణ జరుపుతున్నారు. మరోవైపు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా, ఇప్పటికే నదుల నీటిమట్టం పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో.. ఎవరైనా నదిలో మునిగిపోతే.. బాధితులను రక్షించడం పెద్ద సవాల్ అని అధికారులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

two × three =

Back to top button