More

    30 సంవత్సరాల తర్వాత భూమి యాజమాన్య పత్రాలను పొందిన 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు

    హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ‘మిషన్ వచన్ పూర్తి’ ని ప్రారంభించారు. అందులో భాగంగా కశ్మీరీ పండిట్ కుటుంబాలు 1991 నుండి 1993 సంవత్సరాలలో హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బహదూర్‌ఘర్‌లోని సెక్టార్ 2లో కొనుగోలు చేసిన భూముల యాజమాన్యాన్ని పొందుతాయి. ఈ కుటుంబాల మూడు దశాబ్దాల నిరీక్షణ తాజాగా ముగుస్తుంది. ఆ ప్లాట్లు ఇప్పుడు అధికారికంగా 182 కుటుంబాల పేర్లతో ఉంచారు. గురువారం జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఈ చరిత్రాత్మక ప్రకటన చేసి ఈ కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపు లేఖలను అందజేశారు. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ.. హర్యానా చరిత్రలో ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. 1991-1993 మధ్య కాంగ్రెస్ హయాంలో భూములు కొన్న కశ్మీరీ పండిట్ల కుటుంబాల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఈ 30 ఏళ్లలో, తమ భూమిపై యాజమాన్య హక్కులు పొందాలనే ఆశ దాదాపుగా కోల్పోయారు. కొన్ని సవరణలు చేసి.. కశ్మీరీ పండిట్ కుటుంబాలకు ప్లాట్లు కేటాయించబడ్డాయి.

    లైవ్ హిందుస్థాన్ నివేదిక ప్రకారం, సుమారు మూడు దశాబ్దాల క్రితం, 209 కుటుంబాలు బహదూర్‌ఘర్‌లోని సెక్టార్ 2లో మొత్తం 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. అయితే, సెక్టార్-2ను అభివృద్ధి చేసేందుకు హర్యానా అర్బన్ లోకల్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (హుడా) భూమిని సేకరించినప్పుడు, కశ్మీరీ పండిట్ల భూమి కూడా అందులోకి వెళ్లింది. తమ భూ సేకరణ ప్రక్రియ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేశారు. 1997లో 209 కుటుంబాలకు 10 ఎకరాల భూమిని ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో 12 ఎకరాల భూమిని విడుదల చేసేందుకు అధికారులు అంగీకరించారు. 2016లో 27 కుటుంబాలకు ప్లాట్లు కేటాయించగా.. మిగతా 182 కుటుంబాలు ఎదురుచూస్తూనే ఉన్నాయి.

    రెండు నెలల క్రితం, కశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అజిత్ బాలాజీ జోషిని కలిసింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా బహదూర్‌ఘర్ ఎస్టేట్ ఆఫీసర్ శ్వేతా సుహాగ్‌ను ఆయన కోరారు. సుహాగ్ సాంకేతిక అడ్డంకులన్నింటినీ తొలగించి అక్కడ కశ్మీరీ పండిట్లకు ప్లాట్ల కేటాయింపునకు మార్గం సుగమం చేశారు.

    మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, “ఈ రోజు 182 కుటుంబాలకు కేటాయింపు లేఖలు పంపిణీ చేయబడ్డాయి. వీరే కాకుండా, కొన్ని కుటుంబాలు ఇప్పటికే తమ ప్లాట్లను పొందాయి. ఈ మొత్తం ప్రక్రియ ద్వారా ఈ 209 కుటుంబాలకు చేసిన వాగ్దానాలు నెరవేరాయి.” అని అన్నారు. “ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కశ్మీరీ పండిట్ కుటుంబాలకు రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వాదనలకు ‘మిషన్ వచనపూర్తి’ తగిన సమాధానం” అని అన్నారు. లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విజయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఇప్పుడు నిరాధారమైన ప్రకటనలు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు.

    Trending Stories

    Related Stories