రష్యాలోని ఓ యూనివర్సిటీలో తుపాకీతో ప్రవేశించిన వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం పెర్మ్ కరై రీజియన్‌లోని పెర్మ్ స్టేట్ యూనివర్సిటీలో జరిగింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు కొందరు స్టూడెంట్స్ బిల్డింగ్‌పై నుంచి దూకి గాయాలపాలయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని తుపాకీతో పెర్మ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడ్డాడు. లోపలికి వెళ్లగానే కాల్పులు మొదలుపెట్టడంతో.. అతడి నుంచి తప్పించుకునేందుకు కొంత మంది స్టూడెంట్లు యూనివర్సిటీ ఆడిటోరియంలో దాక్కున్నారు. మరికొంత మంది విద్యార్థులు కిటికీలు ఓపెన్ చేసుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశారు. రష్యా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాల్పులకు తెగబడ్డ దుండగుడిని చంపేశారని రష్యా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ కాల్పులకు పాల్పడింది ఆ యూనివర్సిటీలో చదువుతున్న 18 సంవత్సరాల విద్యార్థి అని తెలుస్తోంది. 18 ఏళ్ల తైముర్ బెక్మాన్సువర్‌గా గుర్తించారు. తన ప్లాన్ గురించి అతను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. “పోలీసులు ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరిని చంపేశామని తెలిపారు.. అతడి సహచరుల గురించి సమాచారాన్ని తనిఖీ చేస్తున్నాము. విద్యార్థులు భయంతో ఉన్నారు. ప్రస్తుతానికి కాల్పులు ఆగిపోయాయి”అని గవర్నర్ చెప్పారు.
రష్యాలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భయంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. పెర్మ్ స్టేట్ యూనివర్సిటీ అత్యంత ఓల్డ్ యూనివర్సిటీ. వీలైతే క్యాంప్‌ను వదిలి వెళ్లండి లేదా రూమ్‌ల్లోనే తాళాలు వేసుకుని ఉండాలని కాల్పుల సమయంలో యూనివర్సిటీ ఓ అలర్ట్ ఇచ్చింది. పెర్మ్ నగరంలో ఉన్న వైద్య అధికారుల ప్రకారం సుమారు 10 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. డజన్ల కొద్దీ విద్యార్థులు గాయపడ్డారు.