భారత్-చైనా సరిహద్దులో పాంగోంగ్ సరస్సు వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది. ఆ ప్రాంతంలో భారత సైన్యం మరింత పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంది. భారత సైన్యం కోసం 17 ఫ్లాట్ బాటమ్డ్ బోట్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటిలో ఎక్కువ భాగం తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో వద్ద అత్యవసర పరిస్థితుల్లో దళాలను వేగంగా మోహరించడం కోసం వినియోగించనున్నారు. పాంగోంగ్ సరస్సు వద్ద బలగాలు మరింత వేగంగా వెళ్లడానికి వీలుగా ఆర్మీ 17 మర పడవలను కొనుగోలు చేసింది. శత్రు దేశాల సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తే బలగాలను వేగంగా తరలించేందుకు వీటిని వినియోగించనున్నారు. కొన్ని నెలల క్రితం తూర్పు లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు వద్ద చైనా దురాక్రమణలకు పాల్పడగా.. కొన్ని నెలల పాటూ ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఈ ఏడాది మార్చిలో వివాదాస్పదమైన పాంగోంగ్ త్సో ప్రాంతం విషయమై భారత్-చైనా దేశాల మధ్య అనేక సార్లు సైనిక మరియు దౌత్య పరమైన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. చైనా తన సైనికులను స్ప్రింగ్స్ మరియు గోగ్రా పోస్ట్ నుండి వెనక్కి తీసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికీ హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్ నుంచి వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. ఇటీవలే అక్కడ మళ్లీ బలగాలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు దీటుగా బదులిచ్చేందుకే ఈ పడవలను కొనుగోలు చేసినట్టు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. గోవాకు చెందిన అక్వేరియస్ షిప్‌యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి పడవలను కొనుగోలు చేయనున్నారు. గోవాకు చెందిన ఆక్వేరియస్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ పడవలను అందిస్తుందని సమాచారం. ఇప్పటికే కొన్ని మరపడవలున్నా వాటికి తోడు ఇవీ ఉంటే మరింత దూకుడుగా భారత్ వ్యవహరించవచ్చు. ఇప్పటికే కొనుగోలు చేసిన వాటిలో కొన్ని బోట్లను భారత సైన్యానికి అప్పగించింది. మిగతా బోట్లను సెప్టెంబర్ నాటికి అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా, ఒక్కో పడవ 35 అడుగుల పొడవుంటుంది. 20 నుంచి 22 మందిని పడవ మోసుకెళ్లగలదు. గంటకు 37 కిలోమీటర్ల వేగంతో నీటిపై దూసుకెళ్లగలదు. ప్రస్తుతం వాటికి ఎలాంటి ఆయుధాలనూ అమర్చలేదని, భవిష్యత్ లో అవసరాలను బట్టి తేలికపాటి ఆయుధాలను అమరుస్తామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేయబడిన ఈ బోట్లలో వెళితే చాలా వరకూ సమయం ఆదా అవ్వనుంది.
మరింత దూకుడును ప్రదర్శిస్తున్న భారత సైన్యం:
ఎల్‌ఐసిలో కొనసాగుతున్న ప్రతిష్టంభనతో, భారత సైన్యం ఈ ప్రాంతంలో పట్టు సాధించడం కోసం మౌలిక సదుపాయాలను పెంచుతోంది. తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు, ఇతర పెద్ద సరస్సులపై నిఘా పెంచడానికి జనవరిలో సైన్యం 12 అధిక-పనితీరు గల పెట్రోల్ బోట్లను తీసుకుంది. ఈ 12 పెట్రోలింగ్ బోట్ల కాంట్రాక్టు విషయమై ప్రభుత్వ రంగ ప్రభుత్వ సంస్థ అయిన గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మే నాటికి డెలివరీలు ప్రారంభం అయ్యాయి. సరస్సుపై ఆధిపత్యం చెలాయించడానికి మరియు శత్రుదేశ పడవలను త్వరగా చేరుకోవడానికి వేగవంతమైన పెట్రోలింగ్ పడవలు అవసరమని రక్షణ అధికారి తెలిపారు.
సరస్సు ఒడ్డుకు దళాలను, సామగ్రిని తరలించడానికి తక్కువ సమయంలోనే దళాలను మొహరించడానికి ఈ పడవలు ఉపయోగించబడతాయి. అక్కడ ఉన్న దళాలను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పారు. రోడ్ల వెంట ప్రయాణించడంతో ఎక్కువ సమయం తీసుకుంటుందని.. పడవల్లో వెళ్లడం ద్వారా చాలా వరకూ సమయం ఆదా అవుతుందని వెల్లడించారు. చైనా దళాల నుండి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకున్న భారత్ ఆర్మీ ఈ ప్రాంతంలో భారీగా దళాలను మోహరించింది.