More

  బండి సంజయ్ కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌.. జేపీ నడ్డా బహిరంగ లెటర్

  తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు కరీంనగర్‌ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను విధించింది. పోలీసులు బండి సంజయ్‌ని కరీంనగర్‌ జైలుకు తరలించారు. సంజయ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జనవరి 17వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. బండి సంజయ్‌తో పాటు కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు కూడా కోర్టు రిమాండ్‌ విధించింది. ఇంకా 11 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తమ రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

  (21) Jagat Prakash Nadda on Twitter: “నిన్న రాత్రి @BJP4Telangana అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp పై తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం దాడి, అరెస్టు, బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జి అమానుషం.. తీవ్ర విచారకరం.. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. ఈ దురుద్దేశపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. https://t.co/n07yp0FH8i” / Twitter

  ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ చేపట్టిన జాగరణదీక్ష ప్రాంతంలో లాఠీఛార్జీలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని బండి సంజయ్‌ దీక్షకు దిగగా, రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆయన పోలీసు స్టేషన్ లోనే దీక్షకు దిగారు. రాత్రి ఏడున్నర గంటల నుంచే దీక్ష కోసం ఏర్పాట్లు చేయగా, మధ్యాహ్నం నుంచే బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయలు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి చేరుకున్నారు. ఈ దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కరోనా నిబంధనలు అతి క్రమించి దీక్ష చేపట్టారని పోలీసులు దాదాపు 3 గంటల తర్వాత బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుండి బండి సంజయ్‌ను కోర్టుకు తరలించారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్‌కి బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేస్తూ 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

  బండి సంజయ్‌ అరెస్ట్‌ను భారతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. కోవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ బండి సంజయ్‌.. తన ఆఫీసులో ఉపాధ్యాయుల సమస్యలపై జాగరణ దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారని జేపీ నడ్డా మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన బండి సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అని జేపీ నడ్డా మెచ్చుకున్నారు. కేసుల గురించి భయపడాల్సి అవసరం లేదన్నారు. బండి సంజయ్ వెనక జాతీయ నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. పోరాటంలో మరింత ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసులే బీజేపీ నేతలు, కార్యకర్తలపై హింసకు పాల్పడుతున్నారని నడ్డా ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడింది. అందుకే ఈ దీక్షపై దాడి చేసి చెదరగొట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపు, అరాచకత్వానికి నిదర్శనంగా భారీ పోలీసు బలగాలతో పక్కా వ్యూహాంతో దాడికి పాల్పడ్డారని జేపీ నడ్డా మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వం కలవరపడుతూ ఉందన్నారు జేపీ నడ్డా. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి అవమానకర, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదన్నారు.

  Jp Nadda Letter

  Trending Stories

  Related Stories