ఓటు వేయండి.. వాషింగ్ మెషీన్ పొందండి..!

0
737

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలన్ని కూడా తమను గెలిపిస్తే ఆల్ ఫ్రీ అంటూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. డీఎంకే కు దీటుగా అన్నా డీఎంకే కూడా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించింది. పోటీ పోటీగా హామీల వర్షం కురిపించింది.  తమ పార్టీని తిరిగి అధికారంలో నిలబెడితే ఇంటికో ఉద్యోగం, వాషింగ్ మిషన్, అలాగే 18 ఏళ్ళు నిండిన యువతి యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ, ఇంకా ఉచిత లైసెన్సు ఆఫర్ చేసింది అన్నాడీఎంకే.!

AIADMK ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే కీలక నేతలు ముఖ్యమంత్రి ఈపీఎస్, ఉప ముఖ్యమంత్రి  ఓపీఎస్ లు కలిసి ఈ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో విడుదలకు అన్నాడీఎంకే వర్గాలు భారీగానే కసరత్తు చేసినట్లు కనడుతోంది. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాతే…తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించిన ఆ పార్టీ నేతలు, డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అన్నాడీఎంకే మేనిఫెస్టోలో సైతం ప్రస్తావించారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా అన్నాడీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చినట్లుగా  ప్రచారం జరుగుతోంది. మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చినకొన్ని పథకాల పేర్లును సైతం మార్చి ఈ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.

అమ్మవిజన్ -2023 పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో 163 హామీలను ప్రస్తావించడం జరిగింది. బియ్యం రేషన్‌ కార్డుదారులకు ఉచిత ప్రభుత్వ కేబుల్‌ కనెక్షన్లు.  నూతన జంటకు అమ్మ సారె. ఇందులో భాగంగా గృహోపకరణాల పంపిణీ. ఆర్థిక సాయంగా తాళికి తంగం కింద ఇచ్చే ఆర్థిక సాయం పట్టభద్రులకు రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంపు, పట్టభద్రులు కాని వారికి ఇస్తున్న రూ.25 వేలు రూ.30 వేలకు పెంపు. యూపీఎస్సీ, నీట్‌, ఐఐటీ, జేఈఈ, టీఎన్‌పీఎస్సీ పరీక్షలకు శిక్షణా కేంద్రం ఏర్పాటు. ప్రతి జిల్లాలో పేద విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఏర్పాటు. రైతులు వ్యవసాయ యంత్రాలు, సామగ్రిని సులభంగా పొందడానికి ముఖ్యమంత్రి రైతు బ్యాంకు పథకం అమలు. రాష్ట్రంలోని 309 తాలూకాల్లో బ్యాంకుల ఏర్పాటు. 100 రోజుల ఉపాధి హామీ పనులు 150 రోజులకు పెంపు.  ప్రజలకు పొంగల్‌ సందర్భంగా కానుకలు, నగదు పంపిణీ కొనసాగింపు.   అంగన్‌వాడీ, అన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రోజుకు 200మి.లీ. పాలు లేదా పాలపొడి పంపిణీ. అమ్మ మినీ క్లినిక్‌లకు ఆధునిక వైద్యసదుపాయాల కల్పన, కొత్త భవనాల నిర్మాణం.డాక్టర్‌ ముత్తులక్ష్మీ రెడ్డి ప్రసూతి పథకం కింద అందించే భత్యం రూ.18 వేల నుంచి రూ.21 వేలకు పెంపు.  మహిళా స్వయం సహాయక బృందాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించడానికి ప్రత్యేక మహిళా బ్యాంకు ఏర్పాటు.  18 ఏళ్లు నిండిన వారికి ఉచిత ద్విచక్ర వాహన శిక్షణతో డ్రైవింగ్‌ లైసెన్స్‌.  ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్‌ 40 శాతానికి పెంపు. చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల వేతనాలు.  జర్నలిస్ట్‌లకు అందిస్తున్న కుటుంబ సహాయనిధి పెంపు. ప్రధాన నగరాల్లో జర్నలిస్ట్‌లకు ఇళ్లు నిర్మించడానికి నివాసయోగ్యమైన ప్లాట్లు ఏర్పాటు.  రాష్ట్ర వ్యాప్తంగా సూపర్‌ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌ల విస్తరణ, క్యాన్సర్‌ చికిత్సకు ప్రాధాన్యత. ప్రసూతి సెలవులను 12 నెలలకు పొడిగింపు, మహిళా శిశువు సంరక్షణ నిధి పెంపు, మహిళ భద్రతకు అన్ని నగారాల్లోనూ గస్తీ వాహనం, పోలీసు యాప్, ఆటో డ్రైవర్లకు ఎంజీఆర్‌ గ్రీన్‌ ఆటో పథకం పేరిట రూ. 25 వేలు సాయం. ధ్యాతి్మక పర్యటనలకు ప్రభుత్వ సాయం పెంపు. శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ చర్యలు. ఇంకా చాలానే హామీలు ఉన్నాయి.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకే ఇలాగే ఉచిత హమీల వర్షం కురిపించింది. అలాగే ఆ సమయంలో జయలలితా జీవించి ఉన్నారు. ఇచ్చిన హామీల్లో చాలా వాటిని ఆమె అమలు కూడా చేసింది. అయితే ఆమె అకాల మరణం తర్వాత… అన్నాడీఎంకేలో స్టార్ క్యాంపెయినరే లేకుండా పోయారు. దీనికి తోడు అన్నాడీఎంకేలోని అంతర్గత రాజకీయా కలహాలు ఆ పార్టీని మరింత వీక్ చేశాయి. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వములే అంతా తామై నడిపిస్తున్నారు. జైలు నుంచి విడుదలైన శశికళ కూడా రాజకీయాలు గుడ్ బై చెప్పారు. దీంతో ప్రచార బాధ్యతలు కూడా అటు ఈపీఎస్, ఓపీఎస్ లే మోస్తున్నారు. అయితే వీరి ఉచిత హామీలను తమిళ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో తెలియాలంటే మే 2వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ వరకు ఆగాల్సిందే. 

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =