మోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రక్షణ వ్యవస్థ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. ఇప్పటికే ఎన్నో యుద్ధవిమానాలను, అధునాతన ఆయుధ సంపత్తిని భారత సైన్యం చేతిలో పెట్టింది ప్రభుత్వం. మున్ముందు కూడా రక్షణ వ్యవస్థ కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. తాజాగా భారత నావికా దళం, భారత కోస్ట్ గార్డు కోసం ప్రభుత్వం మరొక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డు కోసం 11 ఎయిర్ పోర్టు సర్వేలైన్స్ రాడార్లను తీసుకుని రానుంది. అందుకోసం ఏకంగా 323 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది భారతప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అందుకు సంబంధించిన కీలక ప్రకటనను చేసింది. ముంబైకు చెందిన మహీంద్రా టెలీఫోనిక్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ కు ఈ బాధ్యతలను అప్పగించింది. మొత్తం 11 ఎయిర్ పోర్టు సర్వేలైన్స్ రాడార్లు మోనో పల్స్ సెకెండరీ సర్వేలైన్స్ రాడార్లతో నిక్షిప్తమై ఉండేలా తయారు చేయనుంది మహీంద్రా టెలీఫోనిక్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ.
‘బై అండ్ మేక్’ కేటగిరీలో భాగంగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని డిఫెన్స్ మినిస్ట్రీ తమ స్టేట్మెంట్ లో భాగంగా చెప్పింది. ఈ ప్రాజెక్టు కోసం 323.47 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. భారత్ కు చెందిన మహేంద్ర సంస్థ ఈ రాడార్లను తయారు చేస్తూ ఉండడం కూడా విశేషం. ఒక విదేశీ అమ్మకందారుడి నుండి దశలవారీగా, నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేసుకుని ‘బై అండ్ మేక్’ పద్ధతిలో భారత్ కు సంబంధించిన రక్షణ అవసరాలను భారత్ లోని కంపెనీలు తీర్చనున్నాయి.
ఈ రాడార్లు భారత రక్షణ వ్యవస్థకు ఎంతో కీలకంగా మారనున్నాయి. భారత గగనతలంలో వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ ను ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెట్టే విధంగా ఉండబోతోందని డిఫెన్స్ మినిస్ట్రీ చెబుతోంది. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళ్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది.