భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. ఇక్కడి వారికి అమెరికాపై మోజు మాత్రం తగ్గడం లేదు. అగ్రరాజ్యం అమెరికాలోకి అనేక మంది భారతీయులు అక్రమంగా చొరబడుతున్నారు. తాజాగా విడుదలైన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికా.శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది. ఇందులో భారతీయులు సైతం వున్నారు. అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే. అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.
అక్కడ తమ పిల్లలు సంపాదిస్తుంటే ఇక్కడ గొప్పగా చెప్పుకోవడంతో పాటు ఆస్తుల్ని సంపాదించుకోవచ్చన్నది లక్షలాది మంది భారతీయ పేరెంట్స్ కల. అయితే ఈ కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమించే వారు కొందరైతే. అక్రమ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టాలని భావించేవారు ఇంకొందరు. ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు. అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు. కొద్దివారాల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు.
ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు. దీనికి సంబంధించి యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంచలన విషయాలను బయటపెట్టింది.ఈ నివేదికలో అమెరికాలోకి అక్రమంగా వస్తున్న వారి గురించి తెలియజేసింది. ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో కెనడా నుంచి 10,562 మంది భారతీయ వలసదారులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని తెలిపింది. లాక్‌డౌన్, కరోనా, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి కారణాలతో వలసలు చోటు చేసుకున్నట్లు సీబీపీ చెప్పింది. అటు అమెరికా ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 1,200 మంది భారతీయులను పట్టుకున్నట్లు వెల్లడించింది.