More

    గుజరాత్ కు 1000 కోట్ల రూపాయల తక్షణ సాయం

    తౌక్త తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏరియల్ సర్వేను నిర్వహించారు. తౌక్త తుపాను కారణంగా గుజరాత్ అతలాకుతలం అయిపోయింది. తౌక్త విధ్వంసానికి గురైన గుజరాత్ కు రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. గుజరాత్ లో తుపాను నష్టంపై అంచనాకు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గుజరాత్ లోని గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్ నగర్ జిల్లాలను, డయ్యూను ఏరియల్ సర్వే ద్వారా నేడు ప్రధాని వీక్షించారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా తౌక్త తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

    గుజరాత్ లోని పలు జిల్లాలను సందర్శించామని.. డయ్యూలో కూడా పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా చూశామని నరేంద్ర మోది తెలిపారు. తౌక్త తుపాను కారణంగా చాలా మంది నష్టపోయారని మోదీ తెలిపారు. తౌక్త తుపాను ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం టచ్ లోనే ఉందని మోదీ అన్నారు. తౌక్త తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం చేయనున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు.

    తౌక్త తుపాను గుజరాత్ లోని పోరుబందర్, మహువా మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఇది పెను తుపాను స్థాయిలో ఉండడంతో విధ్వంసం కూడా అదే స్థాయిలో జరిగింది. గుజరాత్ రాష్ట్రానికి తక్షణ సాయంగా 1000 కోట్ల రూపాయలను అందించగా.. ఇంకా అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నరేంద్ర మోదీతో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ కూడా భేటీ అయ్యారు.

    Related Stories