More

  మువ్వన్నెల జెండాకు వందేళ్లు
  పింగళి వెంకయ్యకు నేషనలిస్ట్ హబ్ నీరాజనం

  జాతీయ పతాకమంటే కేవలం వస్త్రం కాదు. జాతీయ పతాకమంటే రంగుల కలయిక కాదు. జాతీయ పతాకమంటే ఓ జెండా కర్ర కానే కాదు. జాతీయ పతాకమంటే జాతి గౌరవానికి చిహ్నం. దేశ ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రపంచంలో ఒక్కో దేశానికి ఒక్కో జెండా ఉంటుంది. దాని వెనుక ఘ‌న చ‌రిత్ర ఉంటుంది. అలాగే మన మువ్వన్నెల జెండాకు కూడా ఘనమైన చరిత్ర వుంది. భారత జాతి ఆశల్ని, ఆశయాలను ప్రతిబింబించే రంగుల కలయికే మన త్రివర్ణ పతాకం. స్వాతంత్ర్యం పోరాటానికి శాశ్వత చిరునామా. బ్రిటిష్ వాడి గుండెల్లో పిడిబాకు. జాతీయ పతాకాన్ని చూడగానే గుండె నిండా జాతీయభావం ఉప్పొంగుంది. దేశభక్తితో నరనరనా రక్తం ఉరకలెత్తుంది. అలాంటి మహోన్నత కేతనాన్ని తయారు చేసింది మన తెలుగువాడు కావడం మనకు మరింత గర్వకారణం. నేడు ఖండాంతరాల్లోనే కాదు, అంతరిక్షంలోనూ ఘనకీర్తి చాటుతున్న మన మువ్వెన్నల జెండా శతవసంతంలోకి అడుగుపెట్టింది. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి మార్చి 31తో వందేళ్లు పూర్తయ్యాయి.

  భారత స్వాతంత్ర్య పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి. ప్రతి భారతీయుని రక్తం స్వాతంత్ర్య కాంక్షతో రగిలిపోతోంది. ఉద్యమమైతే ఉధృతంగా సాగుతున్నా.. భారతావని ఏకతాటిపై ఉందని బ్రిటిష్ వాడికి బలమైన సాక్ష్యం ఇచ్చేందుకు ఓ చిహ్నం లేకుండాపోయింది. అప్పుడే జాతీయ పతాక నిర్మాణానికి అడుగులు పడ్డాయి. మహాత్మాగాంధీ పిలుపు మేరకు మన తెలుగువాడు పింగళి వెంకయ్య మువ్వన్నెల జెండాను రూపొందించారు. విజయవాడ వేదికగా 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ రెండు రోజుల సమావేశాలను నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన ఎందరో నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు. దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఈ ఘటనే కీలక మలుపు అని చెబుతుంటారు. ఈ సమావేశాల్లోనే స్వాతంత్ర్య సంగ్రామం కోసం నిధుల సమీకరణకు అంకురార్పణ జరిగింది. ఈ సమావేశాల్లోనే పింగళి వెంకయ్య కాంగ్రెస్ జెండాకు ముసాయిదా రూపాన్ని ఇచ్చారు. ఆ జెండాకే కొన్ని మార్పులు చేసి ఆ తర్వాత కాలంలో స్వాతంత్ర్యానికి కొన్ని రోజుల ముందు జాతీయ జెండాగా ఆమోదించారు.

  వాస్తవానికి మన జాతీయ జెండా మూడు రంగల సమ్మేళనమైనా.. మొదట్లో పింగళి వెంకయ్య దానిని రెండు రంగులతోనే రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, చరకాను పెట్టి జెండాకు ముసాయిదా రూపం ఇచ్చారు. అయితే, ఆ పతాకంలో గాంధీజీ పలు మార్పులను సూచించారు. ఎరుపు స్థానంలో కాషాయాన్ని పెట్టడం, తెలుపు రంగును జోడించడం, చరకాకు బదులు అశోక చక్రాన్ని పొందుపరచడం వంటి మార్పులను చెప్పారు. ఆ జెండాను మొదట కాంగ్రెస్ జెండాగా వినియోగించారు. తర్వాతి కాలంలో.. అంటే స్వాతంత్ర్యానికి కొన్ని రోజుల ముందు జాతీయ పతాకంగా ప్రకటించారు.

  ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు. పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.

  దేశానికి జాతీయ పతాకాన్ని అందించినా.. ఆ మహనీయునికి ఇప్పటికీ తగిన గుర్తింపు లభించలేదు. ఆయనకు ‘భారతరత్న’ బిరుదు ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ వున్నా.. ఇప్పటివరకు దక్కలేదు. మునుముందైన పింగళి వెంకయ్యకు భారతరత్న గౌరవం దక్కాలని నేషనలిస్ట్ హబ్ మనస్ఫూర్తిగా ఆశిస్తోంది. మువ్వెన్నల జెండా రూపశిల్పికి అధికారిక గుర్తింపు రావాలని కోరుకుంటోంది. జైహింద్..

  Related Stories