అత్యాచార బాధితురాలికి 10 లక్షల పరిహారం చెల్లించిన ఏపీ ప్రభుత్వం

0
762

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలిని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. సీఎం జగన్ ప్రకటించిన మేరకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్టపరిహారం చెక్ ను అందజేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.

హోం మంత్రి వనిత మాట్లాడుతూ, అత్యాచార ఘటన అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి అండగా నిలుస్తామని, అర్హతలను పరిశీలించి బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఏపీ విప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటుచేసుకుంది. అత్య‌చార బాధితురాలు, ఆమె త‌ల్లి స‌మ‌క్షంలోనే వీరిద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు కేక‌లు వేసుకున్నారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు వాసిరెడ్డి ప‌ద్మ రాగా… అప్ప‌టికే అక్క‌డికి చంద్ర‌బాబు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ఆసుప‌త్రికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.
వారిని దాటుకుని వాసిరెడ్డి ప‌ద్మ లోపలికి వెళ్ల‌గా… ఆమె తిరుగు ప‌య‌నం కాక‌ముందే అక్క‌డికి చంద్ర‌బాబు వచ్చారు. రాష్ట్రంలో ఇంత దారుణాలు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నార‌ని వాసిరెడ్డిని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాము కూడా బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని, నేరాల కట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పద్మ బ‌దులిచ్చారు. చంద్ర‌బాబు.. వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య వాగ్వాదం జ‌రుగుతుండ‌గా టీడీపీ నాయకురాలు పంచుమ‌ర్తి అనురాధ వచ్చి.. వాసిరెడ్డి ప‌ద్మ‌పై విమర్శలు చేశారు. ప‌రిస్థితి చేయి దాటిపోతోంద‌ని భావించిన చంద్ర‌బాబు అనురాధను సంయ‌మనం పాటించాలంటూ సూచించారు.