మళ్లీ గూడు వదిలిన కశ్మీరీ పండిట్లు..! రక్తచరిత్ర పునరావృతం కానుందా..?

0
825

సుందర కశ్మీర్ కు పూర్వ వైభవం తేవడానికి, కశ్మీరీ పండిట్లు తిరిగి పుట్టిన ఊళ్లకు చేరుకుని ప్రశాంతంగా గడపడానికి కేంద్ర సర్కారు ఎంతో కృషి చేస్తోంది. కశ్మీర్ పండిట్లను అన్నివిధాలా ఆదుకుని, భద్రత, భరోసా కల్పిస్తోంది. అక్కడ పండిట్ల ఉద్యోగ కల్పన, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం అనేక రకాలైన స్కీములను అమలు పరుస్తోంది. ఓవైపు పండిట్లకు పునరుజ్జీవం కల్పిస్తూనే.. వారి భద్రత కోసం కూడా అనేక ఏర్పాట్లు చేస్తోంది మోదీ ప్రభుత్వం. మునుపెన్నడూ లేని విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. కశ్మీర్ కలుగులో దాగిన ముష్కర మూకలకు పొగబెట్టి బయటికి రప్పించడమే కాకుండా.. సరిహద్దుల్లో దొంగదెబ్బ తీయాలని చూస్తున్న పాకిస్తాన్ ఉగ్రమూకలకు కూడా చెక్ పెడుతోంది.ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ.. నిఘా కెమెరాలతో, శాటిలైట్ నేత్రాలతో నిత్యం కాపు కాస్తోంది. అయితే, ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఉగ్రమూకల అరాచకాలకు అడ్డుకట్ట పడటం లేదు. పండిట్ల పునరుజ్జీవనాన్ని జీర్ణించుకోలేకపోతున్న ముష్కరులు.. ఎక్కడ తాము ఉనిక కోల్పోతామోనని.. లక్షిత హత్యలకు దిగుతున్నారు. మళ్లీ మంచి రోజులొస్తున్నాయని.. భవిష్యత్తుపై కోటి ఆశలతో లోయలో అడుగుపెట్టిన పండిట్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అమాయకులపై కశ్మీరీ పండిట్లను బలితీసుకుంటున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన దగ్గర్నుంచి.. పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు పదుల సంఖ్యలో పండిట్లను హత్య చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఉగ్రవాదులు పేట్రేగి పోతుండడంతో.. కశ్మీరీ పండిట్లు మళ్లీ లోయను వీడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పది కశ్మీరీ పండిట్ కుటుంబాలు షోపియాన్‌లోని తమ గ్రామాన్ని విడిచిపెట్టాయి. 35 నుంచి 40 మంది కశ్మీరీ పండిట్లతో కూడిన ఈ పది కుటుంబాలు జమ్మూకు తరలిపోయాయి. తమకు రక్షణ కల్పించాలని కశ్మీరీ పండిట్లు స్థానిక ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పోలీస్ పోస్టులు దూరంగా ఏర్పాటు చేశారని, దీంతో, ఉగ్రవాద చర్యలకు భయపడి జమ్ముకు తరలిపోయినట్టు గ్రామస్థులు తెలిపారు. ఉగ్రవాదులు లక్షిత హత్యకాండలు సాగిస్తున్నారని,.. దీంతో తమకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని కశ్మీరీ పండిట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులు తమను హతమారుస్తామని బెదిరిస్తున్నారని.. అందుకే, తాము వలసబాట పట్టాల్సి వచ్చిందని చౌదరిగుండ్ గ్రామ నివాసి కన్నీటి పర్యమయ్యారు.

అక్టోబర్ 15న షోపియాన్ జిల్లా, చౌదరిగుండ్ గ్రామంలో తమ పూర్వీకుల ఇంటి వెలుపల కశ్మీరీ పండిట్ పూరన్ క్రిషన్ భట్‌ను హత్య చేశారని గ్రామస్థులు తెలిపారు. అనంతరం, మోనిష్ కుమార్, రామ్ సాగర్ లను ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడిలో హత్య చేశారని చెప్పారు. అక్టోబరు 18న షోపియాన్‌లో తమ అద్దె ఇంట్లో నిద్రిస్తుండగా వీరిద్దరూ హత్యకు గురయ్యారన్నారు. చౌదరిగుండ్ గ్రామం నుంచి పండిట్లు జమ్మూకు వెళ్లిపోవడంతో.. ఈ గ్రామం వెలవెలబోతోంది. కశ్మీర్ లోయలో నివసించడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎప్పుడు ఏ హత్యాకాండ జరుగుతుందో అని భయంగా వుందని ఓ గ్రామస్థుడు తెలిపారు . తమకు పూర్తిగా భద్రత కరువైందని అని మరో గ్రామస్థుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంతో కష్టించి పండించిన ఆపిల్ పంటను, అందంగా అలంకరించుకున్న ఇళ్లను, ఇంటిలోని సామగ్రిని.. సర్వం వదిలి వేసి కట్టుబట్టలతో జమ్ములోని బంధువుల ఇంటికి చేరి.. అక్కడ రోజులు గడుపుతున్నామని చౌదరిగుండ్ గ్రామస్థులు చెప్పడం కశ్మీరీ పండిట్ల దీనావస్థకు అద్దం పడుతోంది. ఇంత జరుగుతున్నా.. కశ్మీరీ పండిట్ల నరమేధాన్ని చూసి.. కశ్మీర్ ను రావణ కాష్టంలా మార్చిన మాజీ రాజకీయ రాబందులు.. లోయలో దశాబ్దాల పాటు పాలించిన రాక్షసమూకలు.. సంబరాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి హత్యలు జరుగుతూనేవుంటాయని.. మళ్లీ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ గగ్గోలు పెడుతున్నాయి. కశ్మీరీ పండిట్ల హత్యలకు అడ్డుకట్ట పడాలంటే, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఇటీవల ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు అతనిలోని ఉగ్ర రాక్షసత్వానికి అద్దం పడుతున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =