రాహుల్ విమర్శల వెనుక మతలబేంటి?

0
1319

ఆదుకునేవాడికి మాత్రమే విమర్శించే హక్కు అనేది ఉంటుంది.! కరోనా కల్లోల సమయంలో ఓ లీడర్ గా  కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్నది లేదు.! తన పార్టీ తరపున నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించింది లేదు. ఇంకా ఆ కఠిన సమయంలో ఓ బాధ్యతకలిగిన విపక్ష పార్టీ నేతగా ప్రభుత్వానికి సహకరించింది కూడా లేదు.! ఎప్పుడూ నెగటివ్ మాటలే..! పాజిటివ్ థింకింగ్ అన్నదే లేదు.! పైగా పని చేసేవారిని దెప్పిపొడుస్తూ విమర్శలు గుప్పించడం. కేంద్ర ప్రభుత్వంపై మరి ముఖ్యంగా,  పీఎం మోదీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడటం.., అదేపనిగా అసత్యాలను తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తూ… ప్రజలను మరింత పానిక్ కు గురిచేయడం.! ఇది సబబా అంటున్నారు బీజేపీ నాయకులు.
రాహుల్ గాంధీ వ్యవహార శైలి గురించి వీరంత దుయ్యబడుతున్నారు.

కరోనా కల్లోలంలో లాక్ డౌన్ మొదలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చే వరకు ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు..అలాగే రాహుల్ గాంధీ పలు విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.  ఫేస్ త్రీ క్లినికల్ ట్రయల్స్ జరపకుండానే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చారని.. రాహుల్ గాంధీ అండ్ కో అదేపనిగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు మొదట ప్రధాని మోదీ పైనే వ్యాక్సిన్ టెస్టు చేయాలని ఆ తర్వాతనే దేశ ప్రజలందరికీ వేయాలని యూపీకి చెందిన కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీ కూడా వ్యాక్సిన్ పై అనుమానాలు రెకేత్తేలా మాట్లాడారు. అలాగే ఎన్డీటీవీ  కూడా వ్యాక్సిన్ పై నెగటివ్ నెరెటీవ్ తో వార్తా కథనాలను ప్రసారం చేసింది.

అయితే మోదీ ప్రభుత్వం విపక్షాల విమర్శలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయిందనే చెప్పాలి. స్వయంగా ప్రధాని మోదీ భారత్ బయోటెక్, అలాగే పూణెలోని సీరం మందుల తయారీ కంపెనీకి వెళ్లారు. వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన బృందంతో  సమీక్ష జరిపారు. అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ , సీఎస్ లతోనూ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతోనూ మాట్లాడారు. వారి సలహాలు సూచనలు స్వీకరించారు. అందరితో చర్చించిన పిదపనే ఓ ప్రణాళికను రూపొందించి… ఒక క్రమపద్ధతిలో విడతలవారిగా ఫ్రీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెట్టారు.

మొదట ఎవరికి వ్యాక్సిన్ ఎక్కువ అవసరమో ఆయా రంగాలవారిని, ముఖ్యంగా కొవిడ్ నివారణ కోసం ఫ్రంట్ లైన్ చేసిన నర్సింగ్ మెడికల్ స్టాప్ కు, ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఇప్పుడు 45 ఏళ్ళలోపు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నప్పటికీ.. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్రా ప్రభుత్వాలదేననే విషయం మర్చిపోరాదు! అయితే కొన్ని రాష్ట్రాల్లో మెడికల్ సిబ్బంది నిర్లక్ష్యం వలన వ్యాక్సిన్ డోసులు వృధా అవుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి.

ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కూడా ప్రారంభమైందనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అల్టర్ అయ్యింది. స్వయంగా ప్రధాని మోదీ ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం అయ్యారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు మహారాష్ట్రలోనే జరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అక్కడ గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వ పరంగా అస్థిరత రాజ్యమేలుతోంది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక మంత్రి  రాజీనామా కూడా చేశాడు. ప్రజల్లో మహా సర్కార్ అసంతృప్తి పెల్లుకుతోంది. ఈ క్రమంలో కరోనా కేసుల నెపాన్ని కేంద్రం పైకి నెట్టేస్తూ.. తమకు తగిన స్థాయిలో కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదని ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఆరోపించారు. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కూడా అంతే స్థాయిలో రిప్లై ఇచ్చారు. వ్యాక్సిన్ల కొరత లేదని.., అసలు మహారాష్ట్ర సర్కార్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపైనే చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాదు మహారాష్ట్రలో కరోనా నివారణ చికిత్సలో కీలకమైన రెమ్ డెసివర్ ఇంజెక్షన్లును బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ఈ రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ధరను రూ. 1100 నుంచి 1400 మధ్య ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. దీనిని బ్లాక్ మార్కెట్ లో 5వేల నుంచి ఆరువేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల పాత్రపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

సీఎంలతో జరిగిన సమీక్ష సమావేశంలో పీఎం మోదీ ఏప్రిల్ 11వ తేదీ నుంచి అంబేద్కర్ జయంతి అయిన 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా  45 సంవత్సరాల పైబడిన అందరికి  వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.   అలాగే కోవాగ్జిన్ టీకా మూడో డోసు క్లినికల్ ట్రయాల్స్ కు సైతం కేంద్రం అనుమతినిచ్చింది.

అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు నేతలు ప్లాన్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.  దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వెస్టేజీని తగ్గించండి అని విజ్ఞప్తి చేసింది. అయినా కూడా  కేంద్రం తగినన్ని వ్యాక్సిన్లను సరఫరా చేయడం లేదని, విదేశాలకు ఎగుమతి ఎందుకు చేస్తున్నారని,  ఇంకా మిగిలిన మందుల కంపెనీలకు సైతం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని, అసలు టీకా మహోత్సవ్ ఎందుకు? ప్రతి ఒక్కరికి టీకాలు వేయండి అంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే ఏకంగా బహిరంగ లేఖ కూడా రాశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓ మాజీ ఎమ్మెల్సీ, వామపక్షవాద మైండ్ సెట్ ఉన్న ప్రొఫెసర్ కమ్ విశ్లేషకుడు అయితే తన విశ్లేషణలో కొవిడ్ ను కంట్రోల్ చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది లెఫ్ట్ లూటియెన్స్ జర్నలిస్టులు, సోకాల్డ్ యాక్టివిస్టులు అందరూ కలిసి కట్టుగా సోషల్ మీడియా వేదికగా భారత్ నుంచి కొవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతులు నిలిపివేయాలంటూ ప్రచారం మొదలు పెట్టారు.

కొవిడ్ నివారణకు సంబంధించి మొదట దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే…, మోదీ ప్రభుత్వం వ్యాక్సిన్ మైత్రి విధానంలో భాగంగా  ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పేద దేశాలకు వ్యాక్సిన్ అందజేస్తోంది. అలాగే అమెరికాతోపాటు, యూరోప్ చెందిన దేశాలు కూడా వ్యాక్సిన్లను రూపొందించాయి. అయితే భారత్ లో తయారైన కొవిడ్ వ్యాక్సిన్లకే దాదాపు 92 దేశాలు మొగ్గుచూపున్నాయి. దీంతో  భారత్ లోని సీరం ఇనిస్టిట్యూట్ తోపాటు, భారత్ బయోటెక్ పై కంపెనీల కొన్ని అమెరికన్ మందులు కంపెనీలు గుర్రుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ తయారీకి సంబంధించి భారత్ లోని సీరం ఇనిస్టిట్యూట్ అమెరికా నుంచి పెద్దమొత్తంలో ముడిసరుకును దిగుమతి చేసుకుంటోంది. అయితే బైడన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ముడి సరుకు ఎగుమతులపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

తాజాగా రాహుల్ గాంధీతోపాటు లెఫ్ట్ లూటియెన్స్ అందరూ గత వారం నుంచి అందరికీ వ్యాక్సిన్ అనే ప్రచారం తేవడం వెనుక వేరే కారణం ఉందంటున్నారు. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం కరోనా కట్టడిలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతుంటే.. మన దేశంలో మాత్రం విపక్షాలు రాద్దాంతం చేయడం ప్రజలను తప్పుదోవపట్టించడమేనని వారు చెబుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here