హైందవ ధర్మవీరుడు రాజా శంభాజీ – 2

0
1525

ఒక వైపు సవతి తల్లి కుట్రలు. మరో వైపు చిన్నవాడైన తమ్ముడు.! ఆ తమ్ముడంటే అన్నకు ప్రాణం.! మరోవైపు దుష్టుడైన ఔరంగజేబు నుంచి ముంచుకొస్తున్న ముప్పు..! ఈ విపత్కర పరిస్థితుల్లో హిందూ స్వరాజ్య రక్షణే ధ్యేయంగా ముందుకు కదిలారు. ఔరంగజేబుకే ముచ్చెమటలు పట్టించాడు. జస్ట్ ఏడాదిలోపే హిందూ రాజ్యాన్ని ఖతం చేసి…మొత్తం దేశాన్ని దారుల్ ఉల్ ఇస్లాంగా చేస్తానని కలలుగన్న మొగల్ పాదుషాకు తొమ్మిదేళ్ళపాటు నరకం చూపించిన వీరుడి గురించి హిందూ సమాజానికి ఎంత వరకు తెలుసు? ఆ వీరుడి పేరే వీర శంభాజీ. ఛత్రపతి శివాజీ తనయుడు.

శంభాజీ కూడా తన తండ్రిలాగానే హిందూ వైదిక సంప్రదాయాలను అనుసరించే పట్టాభిషిక్తుడైనారు. శంభాజీ వీర యోధుడు మాత్రమే కాదు… తన తండ్రి ఛత్రపతి శివాజీ మాదిరిగానే గొప్ప రాజనీతి విశారదుడు కూడా.! చిన్నతనంలోనే తన తల్లిమరణంతో ప్రేమకు దూరమయ్యాడు. జీజామాతే అతన్నిదగ్గరుండి చూసుకునేది. తన పెద్దమ్మ సోయరాబాయ్ అంటే పడేది కాదు. కానీ ఆమె కుమారుడు… తన తమ్ముడైన రాజారామ్ ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు శంభాజీ..! రాయ్ గఢ్ లో పట్టాభిషేకం జరిగిన తర్వాత…రాజ్యసంపత్తిని లెక్కవేయించారు. తొమ్మిది కోట్ల రూపాయల బంగారు నాణెలు, 30 వేల కత్తులు, 40 వేల బల్లాలు, 60 వేల డాలులూ, 40 వేల విల్లులూ, 18 లక్షల బాణాలు లెక్కతెలాయి. స్వరాజ్య సంరక్షణ కోసం మరిన్ని ఆయుధాలు అవసరమని భావించి వాటిని తయారు చేయించేందుకు సిద్ధమయ్యారు.  

ఇటు ఔరంగజేబు దక్షణాదికి రావడంతో… హిందూ స్వరాజ్యానికి శత్రువులైన వారందరికీ బలం చేకూరినట్లు అయ్యింది. గోల్కొండ, బీజాపూర్, మొగల్ సర్ధారులు అంతా కలిసి హిందూ స్వరాజ్యాన్ని అంతం చేసేందుకు ప్రణాళికలు రచించ సాగారు. శత్రువుల కుట్రలపై శంభాజీ మహారాజు మెలుకువతోనే ఉన్నారు. అందరిపై ఓ కన్నెసి ఉంచారు.

అటు జంజీరాకోటను కేంద్రంగా చేసుకుని .. హిందూ రాజ్యానికి అడ్డంకులు సృష్టించసాగాడు సిద్ధికి.!  సిద్దీకి ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ ఫిరంగులు, తుపాకులు ఇస్తున్న విషయం గుర్తించాడు శంభాజీ. తాను రాజు కాగానే మొదట సిద్దీ మీదనే దండెత్తాలని అనుకున్నారు. అయితే గోవాలోని పోర్చుగీసువారు స్వరాజ్యంలోని ఫోండాకోటని చుట్టుముట్టారనే వార్త వచ్చింది. శంభాజీ ససైన్యంగా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఇలా పోర్చుగీసువారు అకాస్మాత్తుగా స్వరాజ్యంపై దాడి చేయడం వెనుక ఔరంగజేబు ప్రోద్బలముందని శంభాజీకి తెలుసు.! హిందూ స్వరాజ్యాన్ని నాలుగు వైపుల నుంచి ముట్టడించాలని ఔరంగజేబు భావించాడు. అయితే హిందూ మరాఠా సేనలు… యుద్ధంలో పోర్చుగీసును చిత్తుగా ఓడించాయి. దీంతో నలువైపుల నుంచి హిందూ రాజ్యాన్ని చుట్టుముట్టాలన్న ఔరంగజేబు వ్యూహాన్ని శంభాజీ మొదటిసారిగా దెబ్బకొట్టారు. పోర్చుగీసువారిని ఓడించడం ద్వారా… ఔరంగజేబుకు తాము లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు శంభాజీ.  

ఇటు మరాఠా సేనలు…తర్వాత దాడి చేసేది తన మొగల్ సేనలపైనేనని గుర్తించాడు ఔరంగజేబు..! దీంతో శంభాజీ దృష్టిని మరల్చేందుకు…, ఔరంగజేబు గోల్కండ, బీజపూర్ రాజ్యానికి చెందిన కోటలను స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో బీజాపూర్ సహాయార్థం శంభాజీ మహారాజు… తన మిత్రుడైన కవి కలష్ ను పంపించారు. అయితే అప్పటికే బీజాపూర్ ఔరంగజేబు వశం అయ్యింది. ఆ సమయంలో కవి కలష్.. పన్హాలా, ఖేళణా, మల్కాపూర్ ప్రాంతంలో ఉన్నాడు. కవి కలష్ ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే మొగల్ సేనలు తిష్టవేశాయనే వార్త శంభాజీ మహారాజుకు చేరింది. దీంతో కవి కలష్ కు సాయం చేసేందుకు వెళ్లాలని శంభాజీ నిర్ణయించుకున్నారు. అయితే మొగల్ సేనలు…వారి గుఢాచారులు విస్తరించిన విపత్కర పరిస్థితిలో కోటను విడిచి వెళ్లడం మంచిది కాదని మరాఠా సర్థారులు హెచ్చరించారు. అయినా శంభాజీ మహారాజు వారి హెచ్చరికలను పట్టించుకోలేదు. తనకు స్నేహితుడైన కవి కలష్ ను రక్షించడం కోసం ముందుకు కదిలారు.

అయితే…శంభాజీ కోట వదిలి వెళ్లిన వార్త… వేగుల ద్వారా ఔరంగజేబుకు చేరింది.  వెంటనే ఔరంగజేబు…, తన వజీర్ ఆసద్ ఖాన్ ద్వారా… తన సేనాని ముక్రబ్ ఖాన్ కు సమాచారం అందించాడు. ఎలాగైన శంభాజీని బంధించి తన వద్దకు తీసుకుని రావాలని అజ్ఞాపించాడు ఔరంగజేబు!  అయితే మొగల్ సేనలను తనను వెంబడించే కంటే  ముందుగానే…శంభాజీ పన్హాలా కోట చేరాడు. కొన్ని నెలలపాటు శంభాజీ పన్హాల కోటలోనే ఉన్నారు. అప్పటికే ఔరంగజేబు సైనికులు.. పన్హాల కోట చుట్టుప్రక్కలలోని అన్ని ప్రాంతాలను చుట్టుముట్టారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కోట నుంచి సురక్షితంగా బయటపడాలని శంభాజీ భావించారు. కరాడ్, వాయి మీదుగా కాకుండా సంగమేశ్వర్ మీదుగా తన రాజధాని రాయ్ గఢ్ చేరాలని శంభాజీ అనుకున్నారు. ఆ రోజు సాయంత్రమే సంగమేశ్వర్ చేరుకున్నారు. సేనాపతి మావోజీ ఘోర్పడే, ఆయన కుమారుడు సంతాజీ ఘోర్పడే , స్వామి సమర్థ రామదాసు శిష్యుడు రంగనాథ్ స్వామి, ఖండోబల్లాల్ , ఇంకా కవి కలష్…, శంభాజీ మహారాజు వెంట ఉన్నారు.

ఇటు..మొగల్ సేనల కళ్లుగప్పి రాయ్ గఢ్ కోటను చేరేందుకు వ్యూహాలు రచిస్తుండగానే…, రాయ్ గఢ్ ను సైతం మొగల్ సేనలు చుట్టుముట్టిన వార్త శంభాజీని చేరింది. ఆ రోజు రాత్రి అంతా కలిసి  సంగమేశ్వర్ లోనే మకాం వేశారు. అయితే శంభాజీ సంగమేశ్వర్ దిశగా వెళ్ళిన విషయాన్నితెలుసుకున్న మొగల్ సేనలు…ఆ దిశగా కదిలాయి. తనను పట్టుకునేందుకు మొగల్ సైన్యం సంగమేశ్వర్ వస్తుందనే విషయం శంభాజీకి వేగుల ద్వారా తెలిసింది. ఆ సమయంలో శంభాజీ వెంట కేవలం నాలుగైదు వందల మంది సైనికులు మాత్రమే ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో నలు వైపుల మొగల్ సైనికులు మాటువేసి ఉన్నారు.  ఈ ముట్టడి నుంచి తప్పించుకోవడం ఎలా అనుకుంటున్న సమయంలో అర్థరాత్రి ముకర్రబ్ ఖాన్ సైన్యం సంగమేశ్వర్ పై దాడి చేసింది. ఖాన్ వెంట రెండు వేల మంది సైనికులు ఉన్నారు. మాలోజీ తన వెంట కొంతమంది  సైనికులను తీసుకుని మొగల్ సేనలపై పడ్డాడు. తన చివరి రక్తం బొట్టు వరకు మొగల్ సేనలను నిలువరిస్తానని…ఈ లోపున శంభాజీ రాజాను సురక్షితంగా తప్పించుకోవాలని మలోజీ తెలిపారు.

అటు శత్రువు బలం తమకన్నా రెట్టింపు ఉన్నా…, మలోజీ నేతృత్వంలో మరాఠా సైనికులు వీరోచిత పోరాటం చేశారు. 250 మంది మరాఠా సైనికులు తమ చివరి శ్వాస వరకు మొగల్ సేనలను నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ పోరాటంలో మాలోజీ కూడా వీరమరణం  పొందారు.

ఈ పోరాటం కొనసాగుతుండగనే ముందుకు కదిలిన శంభాజీని కొంతమంది మొగల్ సైనికులు గమనించి వెంబడించారు. శంభాజీ తన గుర్రం వేగం పెంచారు. వెంట కవి కలష్ తోపాటు కొంతమంది సర్థారులు ఉన్నారు. అయితే ఓ బాణం కవి కలష్ చేతికి తగలడంతో కిందపడిపోయాడు. అప్పటికే చాలా దూరం వెళ్లిన శంభాజీ… కలష్ కిందపడిన విషయాన్ని గుర్తించి రక్షించేందుకు వెనక్కి తిరిగి వచ్చారు. అతన్ని లేపి గుర్రం మీద ఎక్కించే ప్రయత్నం చేశారు. ఇంతలో కొంతమంది మొగల్ సైనికులు రావడంతో సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లారు.

ఈ విషయాన్ని ముకర్రబ్ ఖాన్ చెవిన వేశారు మొగల్ సైనికులు. ఒక్కసారిగా మొగల్ సేనలు భవనంలోకి చొరబడ్డాయి. పోరాటం మొదలైంది. ఒక్కసారిగా మొగల్ సైనికులు చుట్టుముట్టి శంభాజీని, కవి కలష్ ను తాళ్లు విసిరి బంధించారు.  అటు శంభాజీని రక్షించేందుకు…మరాఠా సైనికులు ఆ భవనానికి చేరుకునేలోగా…, అంతే వేగంగా అక్కడి నుంచి వారిని ఔరంగజేబు వద్దకు తీసుకెళ్లేందుకు పయనం అయ్యాడు ముకర్రబ్ ఖాన్.

ఇటు శంభాజీని రక్షించలేకపోయిన దుఃఖంతో ఖండోజీ, సంతాజీ, పిలాజీ.. రాయ్ గఢ్ చేరారు.  శంభాజీ పట్టుబడటం మొగలులకు పరమానందం కలిగించింది. అయితే తమ చేతికి చిక్కిన రాజును…ఒక రాజు వలే గౌరవించే సంస్కారం మొగల్ పాలకులకు, వారి సర్ధారులకు లేదు. దారిలో రాజా శంభాజీని అనేక అవమానాలకు గురిచేస్తూ బహదూర్ గఢ్ లోని మొగల్ శిబిరంలో బంధించారు. దాదాపు నలభై రోజులపాటు రాజా శంభాజీని అనేక నరకయాతనలకు గురి చేశారు. ఇస్లాం స్వీకరించి.., శంభాజీ…. ముస్లింగా మారితే ప్రాణభిక్ష లభిస్తుందని స్వయంగా ఔరంగజేబు కబురు పంపించాడు. మొగల్ సేనలు చేస్తున్న అవమానాలు, హింసాకాండకు భయపడి…మతం మారి ఆదోగతి పాలుకావడం కంటే వీరమరణమే శరణ్యమని తలిచారు శంభాజీ.  మరణానికి భయపడి మతం మారే నీచపు పనిచేస్తానని కలలో కూడా అనుకోవద్దు…, అయినప్పటికీ  మీ పాదుషా తన కూతుర్ని నాకిచ్చి వివాహం చేస్తానన్న కూడా నా నిర్ణయం మారదు అంటూ ఔరంగజేబుకు తేల్చి చెప్పాడు. శంభాజీ ఇచ్చిన సమాధానంతో ఔరంగజేబు ఒక్కసారిగా ఊగిపోయాడు. కసితో…శంభాజీని చిత్రహింసలకు గురిచేయించాడు. కనుగుడ్లు…, చేతి వేళ్ళు, కాలివేళ్ళ గోళ్లను పికించాడు. బతికుండగానే శంభాజీ చర్మం వలిపించాడు. తనను ఎన్ని నరయాతనలకు గురిచేసిన మతం మారేది లేదని…, ఒక్క కోటను  సైతం మొగలులకు స్వాధీనం చేయనని తెగేసి చెప్పారు శంభాజీ.! చివరకు 1689 మార్చి 11న శంభాజీ శిరస్సును ఖండిచి…శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడవేశారు మొగల్ సైనికులు.! అక్కడి సమీపంలోని వధు గ్రామస్థులు…నదిలో పడవేసిన శంభాజీ శరీర ఖండాలను వెతికి దొరికినవాటిని అతికించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కొంతమంది చరిత్రకారులు శంభాజీపై తప్పుడు రాతలు రాశారు. ఔరంగజేబుకు చిక్కిన అసమర్థుడన్నారు. అయితే ఇది వాస్తవం కాదు. ఆయన పోరాటంలో ఉన్నప్పుడే కొంతమంది నమ్మకద్రోహం చేసిన కారణంగానే ఆయన మొగల్ సేనలకు బంధిగా చిక్కారు. హిందూ ధర్మాన్ని వదిలి పెట్టి… ముస్లింగా మారాలని నరకయాతనలకు గురిచేసినా మతం మాత్రం మారని ధర్మవీరుడు శంభాజీ..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here