సీబీఐ-ఈడీలను ఒక్కరోజు తనకు అప్పగించాలని అడుగుతున్న కేజ్రీవాల్

0
728

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై పలు విమర్శలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! దేశంలోని పలువురు నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరుగుతూ ఉండడంతో.. ఇతర పార్టీల నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని.. బీజేపీ నేతల ఇళ్లకు సదరు అధికారులు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని నిలదీస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆప్ నేతలు కూడా విచారణలకు హాజరయ్యారు. ఆప్ నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా వంటి వారికి సంబంధించిన సమాచారం కూడా అధికారులు లాగుతూ ఉన్నారు.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు నాకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారు అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చేతిలోనే ఉన్నాయని.. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో రూ.10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఆప్ నేతలపై 200 కేసులు నమోదు చేసినా, ఒక్కటీ నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపణలు చేశారు. ఢిల్లీ మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని.. ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలో ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పై దాడి చేయాలని ఇప్పటికే తన గూండాలకు మనోజ్ తివారీ బహిరంగంగా చెప్పారని పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారని అన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు ఆప్ భయపడదని అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 3 =