సినీ ‘బిల్డప్’ బాబులకు.. ‘కాంతారా’ చెప్పిన కొత్త కథ..!

0
1155

భారతీయ సినిమా రంగం కుదుపుకు గురవుతోంది. కాదుకాదు, ముందుకు నెట్టబడుతోంది. ఎవరు ఏ విధంగా వ్యాఖ్యానించినా.. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం.. ఏదో ఒక సినిమాటిక్ ట్విస్ట్ అయితే మొదలైపోయింది..!

ఇంతకీ, ఇప్పుడు సినిమా ప్రపంచానికి అనివార్యమై కూర్చున్న ఆ మార్పేంటి..? ‘కంటెంట్ వర్సెస్ ఇంటెంట్’ అన్నట్టుగా ఒక ఉద్యమం నడుస్తోంది. దాన్ని మరెవరో కాదు.. కోట్ల రూపాయల కలెక్షన్స్.. ఇంత కాలం అమాయకంగా ఫిల్మ్ మేకర్స్ కు సమర్పించుకున్న ఆడియన్సే నడుపుతున్నారు. ప్రేక్షకులు మొహాలు చూసి థియేటర్ కు రావటం లేదు.. మొహమాటం కొద్దీ బొమ్మని ఆడించటం లేదు..! తమకు నచ్చకపోతే ఎంత పెద్ద తారలకైనా.. పట్టపగలు తారకల్ని చూపిస్తున్నారు..!

అసలు ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ‘కాంతారా’అనే సినిమా ఇప్పుడు జనాలకి ఓ రేంజ్లో నచ్చేస్తోంది. బాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా.. ఆమీర్ ఖాన్ మొదలు టాలీవుడ్ లో ఆచార్య.. చిరంజీవి వరకూ అందరికీ చుక్కలు చూపిన వారే.. వారేవా అంటూ.. ‘కాంతారా’లాంటి చిరు సినిమాని విపరీతంగా ఆదరిస్తున్నారు..! అంతగా అందులో ఏం నచ్చింది..?

సినిమా ఇండస్ట్రీకి ఫ్లాప్స్, హిట్స్, అట్టర్ ఫాప్స్, సూపర్ డూపర్ హిట్స్.. ఇవన్నీ మామూలే. ఆ క్రమంలోనే గత కొంత కాలంగా లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర, ఆచార్య లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అదే సమయంలో హిందీలో వచ్చిన భూల్ భులయ్యా-2, తెలుగులో వచ్చిన సీతారామం లాంటి సినిమాలు సంతృప్తికరంగా పెద్ద తెర మీద నుంచీ వెనక్కి వెళ్లాయి. అయితే, ఇదంతా రొటీన్ వ్యవహారమే. కొన్ని కమర్షియల్ సినిమాలు ఆడటం, మరికొన్ని ఆడకపోవటం విశేషమేం కాదు. వింత అంతకన్నా కాదు. కానీ, గత కొన్ని నెలల్లోనే రెండు సినిమాలు.. మారుతున్న మన భారతీయ ప్రేక్షకుల ఆలోచనా ధోరణిని విస్పష్టం చేశాయి. ఆ రెండూ భారీ చిత్రాలు కూడా కాకపోవటమే.. మల్టీప్లెక్సులు, ఓటీటీల ఈనాటి కాలంలో సిసలైన కొసమెరుపు..!

ఇప్పుడు కాంతారా సినిమా గురించిన చర్చ లాగే కొన్ని నెలల కిందట ‘కార్తికేయ-2’ సినిమాపై కూడా బోలెడు డిస్కషన్ జరిగింది. అందుక్కారణం సదరు సినిమా హీరో కాదు. ఆ సినిమా కోసం ఖర్చు చేసిన బడ్జెట్ కూడా కాదు. కేవలం కంటెంట్ తోనే బాక్సాఫీస్ వద్ద టికెట్లు కట్ అయ్యేలా కార్తికేయ-2 చేయగలిగింది. సినిమాలో శ్రీకృష్ణుడి గురించి, పురాతన, పురాణాంతర్గత ద్వారక గురించి గొప్పగా చూపాడు దర్శకుడు. అంతే కాదు, అక్కడితో ఆగక వేల ఏళ్ల భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ‘కార్తికేయ-2’ పెద్ద పీట వేసింది..!

‘కార్తికేయ’ సినిమాతో పాటే ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజైంది. అది అస్సలు ఆడలేదు. అందుక్కారణం ఆమీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా కొంత వరకూ కారణం. జాతీయవాదులకి అవ్వి నచ్చకపోటంతో సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టారు. బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా పెద్ద దుమారమే రేపింది. కానీ, లాల్ సింగ్ చద్దా అనే సినిమా ఓ దశాబ్దాల కిందటి హాలీవుడ్ సినిమాకి నకలు కావటం.. అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ కి అసలు కారణంగా చెప్పుకోవాలి. బాయ్ కాట్ చేసిన వారు, చేయమన్న వారు కాకుండా… మిగతా వారు కూడా ఎందుకు చూడలేదు..? లాల్ సింగ్ సినిమాలో అసలు విషయం లేకపోవటమే ప్రధాన కారణం..!

కంటెంట్ లేని సినిమాల్ని జనం నిర్ధాక్షిణ్యంగా తిప్పి కొడుతున్నారు. ఇది ప్రస్తుతం క్లియర్. లాల్ సింగ్ చద్దా మొదలు మన తెలుగు సినిమా ఆచార్య వరకూ పదే పదే ఇదే ఋజువు అవుతోంది. అమేజాన్ లాంటి అంతర్జాతీయ ఓటీటీలు ఒకవైపు, ఆహా లాంటి లోకల్ ప్లాట్ ఫామ్స్ మరోవైపు.. ఆడియన్స్ కి కొత్త ఎంటర్టైన్మెంట్ దగ్గర చేశాయి. పైగా స్టార్స్ కోసం పరుగులు తీసే జనరేషన్ క్రమంగా పక్కకు తప్పుకుంటోంది. మిలీనియల్స్ గా చెప్పుకొనే పాతికేళ్ల లోపు సినీ వ్యూయర్స్ వెబ్ సిరీస్‎లు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సరికొత్త వినోదానికి అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కి, స్టార్స్ కి జనాల్ని థియేటర్స్ కు తీసుకు రావటం తలకుమించిన భారమవుతోంది..! అందుకే, ఆరు పాటలు, నాలుగు ఫైట్సు ఫార్ములాని నమ్ముకున్న ప్రతీ సినిమా.. అడ్వాన్స్ బుకింగ్స్ లేక అడ్డంగా బుక్కైపోతోంది. మరి ప్రేక్షకుల్ని ఒప్పించి, మెప్పిస్తున్న సినిమాలేవీ..?

ఈ మధ్య కాలంలో ఫ్లాపులుగా మిగిలిన సినిమాలు చాలా ఉండవచ్చు. వాట్ని పక్కన పెడితే హిట్టైన వాటిలో ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’ వంటి సినిమాలు అత్యంత భారీ బడ్జెట్స్‎తో బాక్సులు బద్ధలు కొట్టాయి. ఈ సినిమాలు ‘బ్రహ్మాస్త్ర’ వంటి చిత్రాలకు భిన్నంగా కలెక్షన్లు ఎలా సాధించగలిగాయి..? ‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తి అనే ప్రధానాకర్షణతో జనం ముందుకొచ్చింది. చరణ్, తారక్ లాంటి స్టార్స్ ఉన్నా జక్కన్న నమ్ముకున్నది స్టోరీని. ఆ కంటెంటే సినిమాని గట్టెక్కించేసింది. ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప’ సినిమాలు కథా పరంగా సరికొత్తవి కాకపోయినా.. కథనంతో దర్శకులు మనల్ని ఆకట్టుకున్నారు. అంటే.. జనం ప్రస్తుతం థియేటర్ కి రావాలంటే.. వేల రూపాయలు పర్సుల్లోంచి బయటకు తీయాలంటే.. సినిమాలో పెద్ద తెర మీద మాత్రమే చూడాల్సినంత పెద్ద ప్రత్యేకత ఉండాలి..! లేదంటే, ‘లైగర్’ సినిమాని లైట్ తీసుకున్నట్టు.. ఓటీటీలో చూద్దాంలే అనుకుంటారు.

‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ సినిమాలు విపరీతమైన బడ్జెట్ తో ఆకట్టుకున్నాయి. ఇది అందరూ ఊహించిందే. కానీ, అదే సమయంలో ‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి చిన్న సినిమా వందల కోట్లు వసూలు చేసింది. అదే మనం గుర్తించాల్సిన అసలు మార్పు..! గతంలో కొన్ని రకాల కథలు జనం చూడరనే భ్రమలు, అపోహలు ఇండస్ట్రీలో ఉండేవి. వాట్ని వరుసగా బద్ధలుకొడుతూ వస్తున్నాయి ‘ద కశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ-2’.. ఇప్పుడు ‘కాంతారా’..!

‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘కార్తికేయ 2’ మూవీ.. కేవలం కంటెంట్ తో సక్సెస్ కొట్టింది. సినిమాలోని కథ.. భక్తిని, భారతీయతని ఎత్తి చూపటంతో జనం మంగళ హారతులు పట్టారు. అదే సమయంలో, లాల్ సింగ్ చద్దా సినిమాలో ఆమీర్ ఖాన్ పాకిస్థాన్ ఉగ్రవాదిని కాపాడతాడు. అది ఎంత మాత్రం ఆడియన్స్ అంగీకరించలేదు. ఇంతకు ముందులా మనసులో ఏదో ఇంటెంట్ పెట్టుకుని థర్డ్ గ్రేడ్ కంటెంట్ జనం నెత్తిన వేస్తే మోసే పరిస్థితి అస్సలు లేదు. ఇదే ‘కంటెంట్ వర్సెస్ ఇంటెంట్’ అంటే..!

దేశాన్ని, ఒకే ఒక్క మతాన్ని, ఓ వర్గాన్ని అదే పనిగా కించపరుస్తూ.. ఏదో పీకేశామని చెప్పుకునే ‘పీకే’ లాంటి చిత్రాల కాలం పోయింది. తెలుగులోనూ గతంలో మాదిరిగా యముడు, నారదుడు వంటి పౌరాణిక పాత్రల్ని కామెడీ క్యారెక్టర్స్ చేసి చూపితే.. మౌనంగా ఉండే పరిస్థితి లేదు. కొన్నాళ్ల క్రితం వేంకటేశ్వర స్వామివారి కీర్తనని ఓ గాయనీ శృంగారం రంగరించి యూట్యూబ్ లో ప్రదర్శిస్తే ఎంతలా చీవాట్లు వెల్లువెత్తాయో మనకు తెలిసిందే కదా..! ప్రేక్షకుల్లో చైతన్యం వచ్చేసింది. స్వాతంత్య్రానికి ముందు నుంచీ, ఆ తరువాత కూడా మనకు మన పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భావం, కట్టు, బొట్టు, విశ్వాసాలు వగైరా వగైరా మీద చులకన భావం కలిగేలా కుట్ర చేస్తూ వచ్చారు. ఒక వైపు పాలకులు, మరోవైపు మేధావులుగా చెలామణి అయిన స్వార్థపరులు.. భారతీయత పట్ల అపరాధ భావం సృష్టించారు. పాశ్చాత్యమే పాయసం.. మనదంతా పాచి భోజనం అన్నట్లుగా దుర్భోధ, ప్రచారం చేశారు. అది 2014 తరువాత నుంచీ క్రమంగా మారుతోంది. అన్ని రంగాలు ‘మోది’ఫై అవుతున్నాయి. ఇందుకు సినిమా రంగమేమీ అతీతం కాదు.

మన సినిమాల్లో ఒకప్పుడు శుద్ధమైన పౌరాణికులుండేవి. భక్తి రస చిత్రాలు కూడా అనేకం వచ్చాయి. బాలీవుడ్ తో పోల్చితే తెలుగు వంటి ప్రాంతీయ భాషా సినీ రంగాల్లో ఇంకా ఎక్కువ భారతీయతను ప్రతిబింబించే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కానీ, కొన్ని దశాబ్దాలుగా భారతీయత నిండుగా ప్రతిబింబించే సినిమాలు తక్కువైపోతూ వచ్చాయి. హిందీ తెరపై పరిస్థితి మరింత దారుణం. డేటింగ్ కల్చర్, పబ్ కల్చర్, అమెరికన్స్ లా ముసుగులు వేసుకునే ఇండియన్ హీరో, హీరోయిన్స్ స్టోరీలే ఎక్కువైపోయాయి. దానికి విరుగుడే ఇప్పుడు మొదలైంది. హిందీ చిత్రాల్ని సౌత్ సినిమాలు ఉత్తరాదిలోనూ ఓడిస్తున్నాయి. అందుక్కారణం ఎటువంటి బ్యాడ్ ఇంటెంట్ లేని క్రియేటివ్ కంటెంటే..! దక్షిణాది చిత్రాల్లోని భారతీయత, స్థానిక కట్టు, బొట్టు, సంస్కృతి, సంప్రదాయం నార్త్ ఆడియన్స్ కి కూడా నచ్చుతున్నాయి. అందుకే, ప్రభాస్ లాంటి వందల కోట్ల ‘బాహుబలి’ వచ్చినా.. నిఖిల్ లాంటి చిన్న హీరో ‘కార్తికేయ-2’తో వచ్చినా.. ఎక్కడలేని ఉత్సాహంతో ఆదరిస్తున్నారు..!

తమ సినిమాలో భారతదేశం మీద, హిందూ సంస్కృతి మీద విషం చిమ్మకుండా… విషయంతో జనం ముందుకొస్తే.. హిట్టు గ్యారెంటీ. ఈ నిజాన్ని తాజాగా నిరూపించింది ‘కాంతారా’. రామ్ గోపాల్ వర్మ లాంటి దేవుడ్ని నమ్మనని చెప్పుకునే నాస్తిక దర్శకుడు కూడా ‘కాంతారా’ డైరెక్టర్ రిషభ్ శెట్టిని ఆకాశానికి ఎత్తేశాడు. సినిమాలో చూపిందంతా అడవిలోని గిరిజనుల భక్తి, విశ్వాసాలు, పూజాపునస్కారాలే అయినా ఆర్జీవికి సినిమా తెగ నచ్చేసింది. ఆయనకే కాదు చాలా మంది సినీ సెలబ్రిటీలకు ‘కాంతారా’ ఫుల్లుగా నచ్చింది. సామాన్య జనం సంగతైతే చెప్పేదే లేదు. కేవలం పది కోట్లతో రూపొందిన కాంతారా కన్నడ మార్కెట్లో 150 కోట్లు వసూలు చేస్తుందని అంచనా..! తెలుగులో కూడా డబ్బింగ్ వర్షన్ ఆల్రెడీ 10 కోట్ల మార్కును దాటేసింది. హిందీ మార్కెట్లో కూడా ‘కాంతారా’ కాసుల వర్షం కురిపిస్తోంది..! దీన్నిబట్టి ఫిల్మ్ మేకర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి..?

బడ్జెట్ భారీదైనా, తక్కువైనా.. జనాలు వెర్రి వాళ్లు కాదనే విషయం గుర్తు పెట్టుకుని సినిమా చేస్తే.. తప్పక ఆడుతుంది. ఎవరు టికెట్లు కొని మీ సినిమాలు చూస్తారో.. వారి దేవుళ్లని, మతాన్ని, కట్టు, బొట్టుని, ఆచార-సంప్రదాయాల్ని వెటకారం చేస్తే.. మీ వెకిలి సినిమాని అంతే వెగటుగా అవతలకి విసిరేస్తారు..! డబ్బులు తీసుకుని రివ్యూలు రాసే బ్రోకర్లకి తప్ప.. నిజమైన ప్రేక్షకులకి సూడో మేధావితనం.. ఎప్పుడూ నచ్చదు..! ఇక మీదట అసలే సాధ్యం కాదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nine + 3 =