సిగ్గు సిగ్గు చైనా.. సైనికుల లెక్కతో అభాసుపాలు

0
1175

ఎలాంటి దేశమైనా సరే తన సైనికుల విషయంలో కొన్నింట అబద్దాలడదు.. ముఖ్యంగా వారు తమ తమ దేశ రక్షణకోసం విధులు నిర్వర్తిస్తున్న తరుణంలో ప్రాణాలు కోల్పోతే వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించడంలో అహాన్ని ప్రదర్శించదు. కానీ మన పొరుగు తిరకాసు దేశాల్లో ఒకటైన చైనాకు ఈ కనీస సంస్కారం లేదు.

గల్వాన్ లోయలో చైనా ఘాతుకం గురించి గుర్తొచ్చినప్పుడల్లా ప్రతి భారతీయుడుకి ఆవేశం పెల్లుబుకుతుంది. అమర జవానుల త్యాగాలు స్మృతికి వచ్చి కళ్ళు చెమర్చుతాయి. అయితే మన దెబ్బకు శత్రు దేశపు సైన్యం మట్టికరిచినపుడు వీర సైనికుల పోరాటపటిమ చూసి గర్విస్తాం.

అయితే కింద పడినా పై చేయి మాదే అనుకునే రకం ఒకటుంది చూశారూ.. అది చైనా నైజం. చేసింది పాపపు పని. పొడిచింది వెన్నుపోటు.. అయినా మన దెబ్బకు పిఎల్ ఏ ఊహించని విధంగా దెబ్బతింది. మన వారు 20 మంది అమరులయ్యారు… వారి వైపు 60 మంది వరకు హతమయ్యారు. సరిగ్గా ఈ విషయమే జీర్ణించుకోలేని నక్కజిత్తుల దేశం తన దేశపు పరువు పోతుందేమోనని.. వారి సైనికులకు కనీస గౌరవసంస్కారాలు గానీ.. వారి వివరాలు కానీ వెల్లడించలేదు. నిజానికి ఆ ఘర్షణలో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించింది అన్నది ప్రపంచం ఎరిగిన సత్యమే. కానీ చైనా ఆ విషయాన్ని బయటపెట్టలేదు.

ఐతే గల్వాన్ లోయ ఘర్షణతో చైనా సైనికుల మరణంపై తొలిసారిగా స్పందించింది. అయితే తనకు అలవాటు అయిన ధోరణిలో అబద్దాన్ని అందంగా ప్రకటించుకుంది సిగ్గుమాలిన చైనా.. గాల్వన్ ఘటనలో మరణించిన వారి పేర్లు, వివరాలను బయటపెట్టింది. అంతేకాదు గల్వాన్ లోయ ఘర్షణల్లో ప్రాణ త్యాగం చేసిన నలుగురు సైనికులకు హానరరీ టైటిల్‌తో సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది. ఆ రోజు సైనా జవాన్లకు నాయకత్వం వహించిన కల్నల్‌కు కూడా అవార్డును ప్రకటించింది. ప్రాణత్యాగం చేసిన వారిలో చెన్ హాంగ్‌జున్, చెన్ జియాన్‌గ్రాంగ్, గ్జియో సియువాన్, వాంగ్ జోరాన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు చైనాకు చెందిన పీపుల్స్ డైలీ కథనాన్ని ప్రచురించింది. కల్నల్ కీ ఫాబో తీవ్రంగా గాయపడినట్లు చెప్పుకొచ్చింది.

ఇలాంటి విషయాల్లో ఏ దేశమూ స్పందించడంలో ఆలస్యం చేయదు. తొలుత ఇరు దేశాల మధ్య సఖ్యత దెబ్బ తినకూడదు అనే ఉద్దేశ్యం తోనే మేం విషయాలు వెల్లడి చేయడం లేదు. నిజానికి చైనాలాంటి దేశం పక్కదేశాన్ని దిగజార్చడానికి ఏ చిన్న అవకాశం దొరికినా మీడియాలో గలాటా సృష్టిస్తుంది. అలాంటిది నిజంగా తమ దేశంలో సైనికులు కేవలం నలుగురే చనిపోతే ముందే ప్రకటించి.. భారత వీర సైనికులు సంఖ్య పక్కన అది చూపెట్టి వికటాట్టహాసం చేసేది. కానీ మన జవానులు రిటర్న్ గిఫ్ట్ భారీగా ఇచ్చేసరికి మైండ్ మ్యూట్ అయిపోయింది.

అదలా ఉంచితే చైనా వైపు కనీసం 30 మంది మరణించి ఉంటారని అప్పట్లోనే భారత ఆర్మీ తెలిపింది. 45 మంది వరకు మరణించి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇలా ఎన్నో రకరకాల ఊహాగానాలు వినిపించినా.. చైనా మాత్రం నోరు విప్పలేదు. కానీ తొలిసారి వారి వివరాలను వెల్లడించింది. ఐతే నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది డ్రాగన్.

కాగా, గల్వాన్ ఘటనలో చైనా వైపు కూడా భారీగా నష్టం జరిగిందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ నార్తన్ కమాండ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి ఇటీవల CNN News18 డిఫెన్స్ ఎడిటర్ శ్రేయా ధోండియాల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చాలామంది సైనికులను అక్కడి నుంచి స్ట్రెచర్స్‌పై తీసుకెళ్లారని జనరల్ వైకే జోషి తెలిపారు. అలాంటి వారి సంఖ్య దాదాపు 60 వరకు ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే వారిలో ఎంతమంది చనిపోయారు ? ఎంతమంది బతికున్నారనే విషయాన్ని చెప్పలేమని అన్నారు. అయితే ఇటీవల టస్ అనే రష్యన్ ఏజెన్సీ.. చైనా వైపు చనిపోయిన వారి సంఖ్య 45 వరకు ఉంటుందని పేర్కొన్నట్టు తెలిపారు. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చని వైకే జోషి అన్నారు. అందుకని చెప్పి ఇక లాభంలేదనుకుందే ఏమో గానీ.. అబద్దాన్ని అఫీసియల్ గా ప్రకటిస్తూ మరోసారి అభాసుపాలయ్యింది చైనా..

ఇక్కడ అతి ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాల్సి వుంది. చైనా తన గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో తమ సొంత సైనికుల్ని ఎంతలా అవమానిస్తుంది అన్నది. కేవలం నలుగురి పేర్లను వెల్లడించి మిగతా చనిపోయిన సైనికుల వివరాలను వెల్లడించకుండా… ఆయా కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చారు డ్రాగన్ పాలకులు..

గల్వాన్ ఘటనపై తొమ్మిది నెలల తర్వాత నోరి విప్పిన చైనా… ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న పరువు కాస్తా ఊడుతుందనుకుందో ఏమో.. హడావుడిగా గల్వాన్ గణాంకాలు ప్రకటించింది. ప్రకటిస్తే ప్రకటించింది గానీ.. ఇంత వాస్తవదూరంగా లెక్కలు చెబితే ఎలా..? అయినా బీజింగ్ పాలకులు ఏనాడు నిజం చెప్పారు గనక. కరోనా లెక్కల్ని దాచి.. ప్రపంచాన్నే ఏమార్చిన డ్రాగన్ కు తమ సైనికులు చనిపోయారని చెప్పాలంటే మనసెలా వస్తుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − ten =