నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనాస్వేచ్ఛలో భాగం. దేశంలో ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు వుంది. అయితే, నిరసన తెలిపే హక్కు వుంది కదా.. అని ఇష్టం వచ్చినట్టు.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడతామంటే కుదరదంటోంది సుప్రీం కోర్టు.
2019లో ఢిల్లీలోని షహీన్ భాగ్ అల్లర్ల నేపథ్యంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆనాటి నిరసన కార్యక్రమాలు హింసాయుతంగా మారాయి. ఈ నిరసనలకు సంబంధించి సుప్రీంలో పలు పిటిషన్లు నమోదయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం ధర్మాసనం షహీన్ బాగ్ నిరసనలు చట్ట వ్యతిరేకమని తీర్పును వెలువరించింది. అయితే, సుప్రీం తీర్పుపై గతేడాది 12 మంది నిరసకారులు రివ్యూ పటిషన్లు దాఖలు చేశారు. తాజాగా పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేసింది. నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది కదా అని ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసన తెలుతామంటే కుదరదని చెప్పింది. సుదీర్ఘకాలం నిరసనలు చేపట్టేవారు పబ్లిక్ స్థలాలను ఆక్రమించుకోవడం వల్ల ఇతరుల హక్కులకు భంగం కలిగించినవారు అవుతారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. బహిరంగ ప్రదేశాలలో నిరసనలు చేపట్టడం సరికాదని.. నిరసన కార్యక్రమాలు వాటికి కేటాయించిన స్థలాల్లోనే జరగాలని సూచించింది.
సీఏఏకి వ్యతిరేకంగా 2019లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. అయితే షహీన్ భాగ్ ప్రాంతంలో నిరసన కార్యక్రమాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మహిళలు, పిల్లలు కూడా ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగాయి.