Aalayam

శ్రీరామజన్మభూమి కోసం హిందువులు జరిపిన పోరాటగాథ – 04

విదేశీ దురాక్రమణ దారుడైన మొగల్ రాజు బాబర్ మరణం తర్వాత కూడా అయోధ్య
రామజన్మభూమికోసం నిరంతరం పోరాటాలు సాగాయి. అక్బర్, జహంగీర్, షాజహన్ ల
కాలంలోనూ హిందూ సమాజం ఎన్నోయాతనలకు గురయ్యింది. అయినా కూడా తమ పోరాటాన్ని వదిలి పెట్టలేదు. వివిధ కాలమానాల్లో సాధుసంతుల నాయకత్వంలో ఎప్పటికప్పుడు పోరాటాన్ని
కొనసాగించింది.ఇక ఔరంగజేబు పాలన కాలంలో అయితే ఏకంగా 30 సార్లు మొగల్
సైన్యాన్ని హిందూ సమాజం ఓడించింది.

1530లో బాబర్ మరణించాడు. అదే సంవత్సరం హంసవర సంస్థానానికి చెందిన రాణి
జయరాజ్ కుమారి…, 3 వేల మంది సాయుధ మహిళలతో కూడిన సైన్యాన్ని తన వెంట
తీసుకుని వెళ్లి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుందని కొంతమంది చరిత్రకారులు
చెబుతారు. బాబ్రీ కట్టడం తిరిగి హిందువుల పరమైందని తెలుసుకున్న విదేశీ ముష్కర
సైన్యాలు మరోసారి అయోధ్యపై విరుచుకుపడ్డాయి. ఈ పోరాటంలో మహారాణి జయరాజ
కుమారి తన ప్రాణాలు కోల్పోయారు. దాంతో మళ్లీ శ్రీరామజన్మభూమి ముస్లింల
చేతుల్లోకి వెళ్లిపోయింది.

హుమయూన్ తర్వాత అక్బర్ మొగలు పాలకుడు అయ్యాడు. శ్రీరామ జన్మభూమిని
ముస్లింల చెర నుంచి విడిపించి తమ నమ్మకాలను గౌరవించాలని కొంతమంది హిందూ
సాధువుల బృందం అక్బర్ కు విన్నవించింది.

మన కమ్యూనిస్టు, మేకాలేవాద చరిత్రకారులు అక్బర్ ను ఎంతో ఉదారవాద చక్రవర్తిగా
ప్రచారం చేస్తారు. ఇంకా అక్బర్ ది గ్రేట్ అంటారు. అలాంటి ది గ్రేట్ అక్బర్ ఎందుకు
హిందువులపై ఉదారత చూపలేదు.? హిందువులకు శ్రీరామజన్మభూమిని ఎందుకు
అప్పగించలేదంటే ఈ కుహానా చరిత్రకారులు, మేధావుల దగ్గర సమాధానం ఉండదు.

అక్బర్ కాలం నాటికే సాధుసంతులు శ్రీరామ జన్మభూమి కోసం దాదాపు 20 సార్లు
పోరాటం చేశారని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. తమ నిరంతర పోరాటలతో
అక్బర్ కాలంలో బాబ్రీకట్టడంలో ఒక వేదికను ఏర్పాటుచేసి దానిపై శ్రీరామ్ లాలా
విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు మొదలు పెట్టారని అంటారు. అయితే ఇంతా పోరాటం
జరుగుతున్నా కూడా అక్బర్ మాత్రం అయోధ్యలోని శ్రీరామజన్మభూమి మందిరంపై తన
ఉదారతనూ చూపనేలేదు. ముస్లింల చెర నుంచి బాబ్రీకట్టడాన్ని విడిపించి హిందువులకు
అప్పగించలేదు..!

అక్బర్ తర్వాత ఆయన కుమారుడు జహాంగీర్ వచ్చాడు. తాగుడుతోనే కాలం గడిపిన
నరరూప రాక్షసుడు జహాంగీర్. సిక్కుల నాల్గవ గురువైన అర్జున్ దేవ్ ను ముస్లింగా
మారమని ఎంతగానో ఒత్తిడి తెచ్చాడు. భయటపెట్టించాలని చూశాడు. అయినా కూడా
గురు అర్జున్ దేవ్ స్వధర్మానికే కట్టుబడ్డాడు. ఇస్లామ్ ను స్వీకరించేదిలేదని తెగేసి చెప్పాడు.
దాంతో గురు అర్జున్ దేవ్ ను అత్యంత కృరంగా హత్య చేయించాడు ఈ మొగల్
రాక్షసుడు…!

జహాంగీర్ తర్వాత ఆయన కుమారుడు షాజహాన్ మొగల్ పాలకుడు అయ్యాడు. ఇతని
కాలంలో ఆగ్రాలో తేజోమహాలయంగా పేరుపొందిన శివాలయంపైనా తాజ్ మహల్
కట్టబడిందని పీఎన్ ఓక్ అనే చరిత్రకారుడు ఆధారాలతో సహా నిరూపించాడు.
అలాగే మన దేశాన్ని పాలించిన బ్రిటీష్ వారు కూడా తాజ్ మహాల్ కు అంతా ప్రాధాన్యం
ఇవ్వలేదని చరిత్రకారులు చెబుతారు.

దేశ విభజన గాయాలు, ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా రగిలిపోతున్న హిందువుల్లో
క్రోధాగ్నిని చల్లార్చేందుకు… అప్పుడే కుట్రలు మొదలయ్యాయి.
ప్రధాని నెహ్రూ…, ఆనాటి విద్యామంత్రి అబుల్ కలామ్ ఆజాద్, ఇర్ఫాన్ హాబీబ్ త్రయం
చరిత్ర వక్రీకరణలకు ఈ సమయంలోనే నాంది పలికిందని జాతీయవాద చరిత్రకారులు
చెబుతారు. 1954 తర్వాతే తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నాంగా ప్రచారం చేయడం
మొదలు పెట్టారని కొంతమంది చరిత్రకారులు అంటారు.

అదే సమయంలో…
రాణాప్రతాప్ , శివాజీ, గురుగోవింద్ సింగ్ వంటి హిందూ వీరుల చరిత్రను తక్కువ చేసి
మొగల్ పాలకులను ఈ మార్క్స్ , మేకాలేవాద చరిత్రకారులే మహోన్నతులుగా
పేర్కొన్నారని చెబుతారు. షాజహాన్ పాలన కాలంలో వేలాది మంది హిందువుల ఆస్తులను మొగలులు
స్వాధీనం చేసుకున్నారు. హిందువులపై అనేక రకాల పన్నులు విధించారు. ముస్లింల
రాజ్యంలో హిందువులుగా జీవించాలంటే…కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతా
పన్ను కట్టాలని హుకుం జారీ చేశారు. దీనినే జిజియా టాక్స్ అన్నారు. జిజియా ట్యాక్స్
అంటే అదో జుట్టు పన్ను అంటూ దాన్ని ఒక మాములు ట్యాక్స్ గా కప్పిపుచ్చే
ప్రయత్నం చేశారు మార్క్స్ మేకాలే వాద చరిత్రకారులు.! జహాంగీర్, షాజహాన్ లు సైతం
శ్రీరామజన్మభూమిని హిందువులకు అప్పగించేందుకు విముఖతనే చూపారు.

తర్వాత కాలంలో షాజహాన్ అనారోగ్యం బారినపడ్డాడు..! అంతే ఆయన నలుగురు
కుమారులు దారాషికో, షుజ, ఔరంగజేబ్, మురాద్ బక్ష్ ల మధ్య వారసత్వ పోరాటం
మొదలైంది. తన అన్న దారాషికోను మోసంతో బంధించి… ఆ తర్వాత అత్యంత
దారుణంగా హత్యా చేయించి మొగల్ చక్రవర్తి అయ్యాడు ఔరంగజేబు.! ఔరంగజేబు
స్థానంలో ఆయన అన్న దారాషికో మొగల్ చక్రవర్తిగా అయివుంటే భారతదేశ చరిత్ర
మరోలా ఉండేదని కొంతమంది చరిత్రకారులు చెబుతారు.

ఔరంగజేబులా…. దారాషికో కరడుగట్టిన ముస్లిం మతోన్మాది కాడు..! పైగా తన జీవిత
కాలంలో చాలా కాలంపాటు ఆయన కాశీలోని వేద పండితులు…సంస్కృత పండితుల వద్దనే
గడిపాడు. హిందూ ధర్మం పట్ల ఆకర్షితుడైనా దారా… ఉపనిషత్తులతోపాటు
‘భగవద్గీత’ను, ఇంకా అనేక హిందూ ధార్మిక గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువాదం
చేశాడు.

హిందుత్వం పట్ల ఆకర్షితుడైన దారా షికో మొగల్ చక్రవర్తి అయితే…ఇక తమ ఆటలు సాగవని ముస్లిం మతోన్మాదులు,
ముల్లాలు, మౌల్వీలు భయపడ్డారు. దారా షికో చేసిన హిందూ ధార్మిక గ్రంథాల
అనువాదాన్ని సైతం వారు తప్పుపట్టారు. ఇస్లామిక్ మతోన్మాదిగా పేరుగాంచిన
ఔరంగజేబును మరింతగా రెచ్చగొట్టారు. దారాషికోను చంపుతామని మాట ఇస్తేనే…
ఔరంగజేబు జరుపుతున్న వారసత్వ పోరులో అతనికి అండగా నిలుస్తామని మాట
తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఔరంగజేబు గద్దెనెక్కగానే దారాషికోను చంపించారు.

ఔరంగజేబు తన పాలనలో హిందువుల పట్ల పరమ దుర్మార్గంగా వ్యవహారించాడు. తన
రాజ్యంలో హిందూ ధర్మాన్ని పాటిస్తూ బ్రతికిబట్ట కట్టాలంటే అందరూ జిజియా టాక్స్
చెల్లించాలంటూ కఠిన హెచ్చరికలు జారీ చేశాడు. హిందూ దేవాలయాలను, గ్రంథాలను
తగుల బెట్టించాడు. హిందూ గురుకులాలపై దాడులు చేయించాడు.

అంతేకాదు హిందువులకు పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీనగరంపై కూడా
దాడులు చేశాడు ఔరంగజేబు. 1669లో జ్యోతిర్లింగ క్షేత్రమైన…, కాశీ
విశ్వనాథ మందిరాన్ని ధ్వంసం చేయించాడు. గోపురంపై గుమ్మటాలను ఏర్పాటు చేసి
మసీదును నిర్మించాడు. ఇప్పటికి మనం కాశీకి వెళ్తే ఈ కట్టాన్ని చుడవచ్చు.

అలాగే మధురలోని శ్రీకృష్ణుడి జన్మస్థలంలోని మందిరాన్ని సైతం కూల్చివేయించాడు.
దాంతోపాటు ఆ కాలంలోనే రాజా బీర్ సింగ్… 33 లక్షల ఖర్చుతో అత్యంత
సుందరమయంగా నిర్మించిన కేశవ దేవాలయాన్ని కూడా ఔరంగజేబు తన ముష్కర
మూకలచేత కూల్చివేయించాడు. దేవాలయాలే కాదు ఎన్నో ప్రాచీన విజ్ఞాన గ్రంథాలను
సైతం ఔరంగజేబు నాశనం చేయించాడు.

అంతేకాదు కశ్మీర్ హిందూ పండిట్లను కూడా మతం మార్చేందుకు తెగబడ్డాడు. వారిని
అష్టకష్టాల పాలు చేశాడు. వారిని భయంకరమైన యాతనలకు గురిచేశాడు. మతం
మారేందుకు డెడ్ లైన్లు విధించాడు. మతం మారడం ఇష్టంలేని కొంతమంది కశ్మీర్ పండిట్లు
సిక్కుల తొమ్మిదవ గురువైన గురు తెగ్ బహదూర్ ను శరణువేడారు. గురుతెగ్ బహదూర్
మతం మారితే మేమూ మతం మారుతామని చెప్పండని ఆయన కశ్మీర్ హిందూ పండిట్లకు
అభయం ఇచ్చాడు.

దాంతో గురుతెగ్ బహదూర్ ను ఖైదు చేసి…ఢిల్లీకి రప్పించాడు ఔరంగజేబు. ఎన్నో
ప్రలోభాలు పెట్టి మతం మారమని ఒత్తిడి తెచ్చాడు. అయినా కూడా గురు తెగ్ బహదూర్
చలించలేదు. తరతరాలుగా తన పూర్వీకులు ఆచరిస్తూ వచ్చిన ప్రాచీన ధర్మాన్ని వదిలి
పెట్టి…, బ్రతికే కంటే మరణించడమే మేలు అని దృడంగా పలికాడు గురు తెగ్ బహదూర్.
దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఔరంగజేబు….గురు తెగ్ బహదూర్ కళ్ల ముదే ఆయన
ఇద్దరు శిష్యులను అత్యంత దారుణంగా హత్య చేయించాడు. ఆ తర్వాత అందరి ముందు
గురు తెగ్ బహదూర్ తలను నరికించాడు ఔరంగజేబు.

గురు తెగ్ బహదూర్ దారుణ హత్య… దేశంలోని హిందువుల అందరిలో ఆగ్రహాఆవేశాలు
రగిలించింది. ఈ ఘాతుకాన్ని సహించలేకపోయిన సిక్కు గురు రామ్ దాస్ శిష్యుడు…,
సాధు వైష్ణవదాస్… సాధుసంతులను, సంస్థానాధీశులను, హిందూ ప్రజానీకాన్ని ఏకం
చేసి అయోధ్య ప్రాంతంలోని మొగల్ సైనికులపై విరుచుకుపడ్డాడు.

మొగల్ సైనిక ప్రతినిధి జన్ బజ్ ఖాన్ ను తరిమికొట్టారు. వరుసగా 30 సార్లు జన్ బజ్ ఖాన్
అయోధ్యపై దాడికి రాగా ముప్పైసార్లు అతన్ని ఓడించారు. విషయం తెలుసుకుని
ఆగ్రహంతో ఊగిపోయిన ఔరంగజేబు…జన్ బజ్ ఖాన్ ను అసమర్ధుడంటూ తప్పించి…50
వేల మంది సైనికులతో ఈసారి సయ్యద్ ఆలీని అయోధ్యకు పంపించాడు. అటు విషయం
తెలుసుకున్న గురు గోవింద్ సింగ్ సేనలు కూడా సాధు వైష్ణవదాస్ కు తోడుగా
తరలివచ్చాయి. యుద్ధం భీకరంగా సాగింది. చివరకు యుద్ధంలో హిందూ వీరులు పైచేయి
సాధించారు. హసన్ ఆలీ హతమయ్యాడు. ఈ విషయాలు అన్ని కూడా ఔరంగజేబు
స్వయంగా తన ఆలంగీరీ నామాలో రాసుకున్నాడు కూడా..!

ఇక సైన్యాధికారులతో లాభం లేదని భావించినా ఔరంగజేబు 1664 తానే ప్లాన్ రెడీ చేశాడు.
భారీ సైన్యంతో నలువైపుల నుంచి అయోధ్యను ముట్టడించాడు. బాబ్రీకట్టడంలోని
శ్రీరామజన్మభూమి ఆలయం స్వాధీనం కోసం రక్తాన్ని పారించాడు. ఈ యుద్ధంలో
దాదాపు 10 వేల మందికి పైగా హిందువులు అమరులయ్యారు. అతికష్టం మీద
హిందువుల నుంచి మళ్లీ శ్రీరామజన్మభూమి మందిర వేదికను స్వాధీనం చేసుకున్నానని
ఔరంగజేబు తన డైరీ ఆలంగీరీ నామాలో రాసుకున్నాడు. మళ్లీ విగ్రహాలు
ప్రతిష్ఠించకుండా అక్కడ పెద్ద గొయ్యిని తవ్వించాడు. హిందూ సమాజం కూడా
పట్టువదలకుండా అదే గొయ్యివద్ద ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వాహించుకుంటూ
వచ్చింది.

Leave a Reply

Your email address will not be published.

two + 20 =

Back to top button