శ్రీరాముని కన్న నేల మనదేశం..! కోట్లాది మంది భారతీయులకే కాదు…, అటు నేపాలీయులకు, ఇటు ఇండోనేషియా, థాయిలాండ్ వంటి తూర్పు దేశాలలోని కోట్లకొలది ప్రజలకు ఆరాధ్య దైవం. ఎప్పుడో క్రీస్తూ పూర్వం నిర్మించిన ఆలయాన్ని విదేశీ దురాక్రమణదారుడైన బాబరు తన సేనలతో ధ్వంసం చేయించాడు. ఆ రోజు నుంచే హిందువులు పోరాటం మొదలు పెట్టారు. దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తున్నా తమ పోరాటాన్ని మాత్రం హిందువులు వదిలి పెట్టలేదు. ఒకటి కాదు రెండు ఇప్పటి వరకు దాదాపు 76 సార్లు రామమందిరం కోసం పోరాటం చేశారు. దాదాపు నాలుగు లక్షల మందికిపైగా హిందువులు వివిధ సమయాల్లో జరిగిన పోరాటల్లో తమ ప్రాణాలను బలిదానం చేశారు.
1528 నుంచి మొదలైన ఈ పోరాటం వివిధ రూపాల్లో 2019 నవంబర్ 9 వరకు కొనసాగింది. దాదాపుగా 492 సంవత్సరాల పాటు జరిగిన ఈ పోరాటం సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పుతో ముగిసింది. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం… పురాతత్వ శాఖ త్రవ్వకాలు, శాటిలైట్ రాడార్ ఫోటోలు, పౌరాణిక, ఐతిహాసిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని… 2.77 ఎకరాల భూమి శ్రీరామ్ లాలాకు చెందినదేనని ఏకాభిప్రాయంతో ప్రకటించారు.
ఆ తర్వాత…సుప్రీం తీర్పును అనుసరించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం కోసం… శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ఒక ధార్మిక ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. తన స్వాధీనంలో ఉన్న 70 ఎకరాల భూమిని సైతం తీర్థ క్షేత్ర ట్రస్ట్ నకు అప్పగించింది. రామమందిర నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ట్రస్ట్… 25 మార్చి 2020న టెంట్ లో ఉన్న శ్రీరామ్ లాలా విగ్రహన్ని నూతనంగా నిర్మించిన తాత్కాలిక చెక్క మందిరానికి తరలించింది.
హిందువుల చిరకాల స్వప్నమైన భవ్యమైన రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5 2020న భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ వేడుకను కరోనా వైరస్ కారణంగా నిరాడంబరంగా నిర్వహించడం జరిగింది. మహంత్ నృత్యగోపాల్ దాస్ గారితోపాటు, దేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులైన పూజ్య ఆచార్యులు, సంత్ లు, ఆర్ఎస్ఎస్ పూజ్య సర్ సంఘచాలక్ మాన్యశ్రీ డాక్టర్ మోహన్ భాగవత్, అలాగే శ్రీరామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆనాటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ భూమి పూజ కార్యక్రమంలో పూజ్య సంత్ మహాత్ములు… భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భారతీయులందరిని భాగస్వాములుగా చేయాలని సంకల్పం చేశారు. అలాగే శ్రీరామ జన్మభూమి విముక్తి కోసం జరిగిన పోరాటగాధలను.. నేటి యువతరానికి తెలియజేప్పేందుకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే…మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ ను నిర్వహిస్తోంది. ఈ పవిత్ర కార్యంలో, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లతోపాటు ఇతర పరివార సంస్థలు, సాధుసంతులు, సామాజిక సేవా సంస్థలు పాలుపంచుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 20వ తేదీ నుంచి ప్రారంభమై… ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 21 రోజులపాటు నిధి సమర్పణ్ అభియాన్ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని గడపగడపకు… జనజాగరణ్ అభియాన్ టీమ్ సభ్యులు వెళ్తున్నారు. శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ ఉద్యమ సాహిత్యంతోపాటు, శ్రీరాముడి డోర్ స్టిక్కర్ ను ప్రతి ఇంటికి గుమ్మానికి అతికిస్తారు.
అలాగే మందిర నిర్మాణం కోసం ముద్రించిన రూ. 10, రూ. 100, రూ.1000 కూపన్లను వారి సమర్పణకు అనుగుణంగా గ్రామస్థులకు అందజేస్తారు. రూ. 2000 వేలు.., ఆపై నిధి ఇచ్చేదాతలకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు దాతలు తాము సమర్పించిన మొత్తానికి సెక్షన్ 80 జీ ద్వారా ఆదాయపన్ను నుంచి మినహాయింపు పొందవచ్చును. క్రింది స్థాయిలో నిధి ప్రముఖ్ ప్రత్యేకంగా నియమించి…, సేకరించిన నిధిని 48 గంటల్లోపు , తీర్థ క్షేత్ర ట్రస్ట్ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి నిధి ప్రముఖ్ కు ఒక ప్రత్యేక కోడ్ ను కేటాయించి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా , బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకుల ద్వారా ఆలయ ట్రస్ట్ అకౌంట్ లో సేకరించిన నిధిని జమ చేయడం జరుగుతుంది.
నిధి సమర్పణ్ అభియాన్ లో భాగంగా… సోషల్ మీడియా మాద్యమం ద్వారా శ్రీరామజన్మభూమి పోరాటగాథలను వరుసగా తెలుగు ప్రజలకు తెలియజెప్పేందుకు నేషనలిస్ట్ హబ్ సిద్ధమైంది. ఈ రామకార్యంలో నేషనలిస్ట్ హబ్ వీక్షకులు అందరూ అండగా నిలుస్తారని ఆశీస్తున్నాం.