రైతులకు మద్యం ఇవ్వాలట..! కాంగ్రెస్ లీడర్ మతిలేని వ్యాఖ్యలు

0
1165

వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమం కాంగ్రెస్ ప్రేరేపిత ఉద్యమమే అనడానికి ఇదో బలమైన సాక్ష్యం. ఇప్పటికే ఓవైపు అమాయక రైతులను రైతు సంఘాల నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. మరోవైపు, విదేశీ, విద్రోహ, దేశ విచ్చిన్నకర శక్తులు.. దేశాన్ని అస్తిరపరచడానికి చేస్తున్న కుయుక్తులను మనమంతా చూస్తూనేవున్నాం. ‘టూల్ కిట్’ వ్యవహరమే అందుకు తార్కాణం. ఇక, మొదటి నుంచి రైతు సెంటిమెంటు కార్డును వాడుకుంటూ.. దేశ భవిష్యత్తును కూడా పణంగా పెడుతూ.. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం దిగజారిపోతోంది. విషయానికి వస్తే.. రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి హర్యానా కాంగ్రెస్ నేత విద్యా రాణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రైతు ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలంటే ప్రతీ ఒక్కరూ తమవంతుగా వారికి సహాయం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ‘డబ్బులు, కూరగాయలు, నెయ్యి.. మద్యం అయినా పర్లేదు, మీకు తోచింది వారికి ఇవ్వండి..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతులకు లిక్కర్ ఇవ్వమని ఆమె పిలుపునివ్వడం ఇప్పుడు దుమారం రేపుతోంది.

కాంగ్రెస్ నేత విద్యారాణి వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పందించారు. ‘మాకిక్కడ లిక్కర్‌తో ఏం పని.. ఆమె ఎందుకిలా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటివాళ్లు రైతు ఉద్యమానికి ఏమీ చేయనక్కర్లేదు. ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మీరు చేసే ఉద్యమాల్లో ఏవైనా పంపిణీ చేసుకోండి..’ అని టికాయిత్ పేర్కొన్నారు. అయితే, టికాయత్ వ్యవహారశైలి పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమం పేరిటి ఖలిస్తానీ మూకలకు వారధిగా వ్యహరిస్తున్నాడని ఇప్పటిక పలు కథనాలు వెలువడ్డాయి. జనవరి 26న జరిగిన విధ్వంసం మొదలు కొని.. రైతుల పేరిట జరుగుతున్న అల్లర్లలో తమ ప్రమేయం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా.. అసలు కథ వేరే వుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యవహారం త్వరలోనే బయటపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే, విద్యా రాణి వ్యాఖ్యలపై అటు బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతు ఉద్యమంలోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ రైతు ఉద్యమాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని చూస్తోందని మండిపడింది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పారని.. రైతులను వారు కేవలం ఓటు బ్యాంకుగా, పొలిటికల్‌ టూల్‌ కిట్ గా వాడుకుంటున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు, కేంద్రమంత్రులు హర్షవర్దన్, హర్‌దీప్ సింగ్ పురి కూడా విద్యారాణి వ్యాఖ్యలపై మండిపడ్డారు. రైతుల ఆందోళనల పట్ల కాంగ్రెస్‌ అసలు ఉద్దేశం ఏంటో విద్యారాణి వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. ఇది అత్యంత సిగ్గుచేటు వ్యవహారమని విమర్శించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

5 × four =