More

    రాష్ట్రాల మధ్య చెక్ పోస్టులు పెట్టేశారు.. స్కూల్స్ కు సెలవులు ఇచ్చేశారు

    కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులను ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కోజికోడ్ జిల్లాలోని అంగన్‌వాడీలు, మదర్సాలు, ట్యూషన్ సెంటర్లు, ప్రొఫెషనల్ కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అధికారుల నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ విద్యాసంస్థలను తెరవకూడదని సూచించారు.

    కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం కోజికోడ్ జిల్లాలో పర్యటించనుంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, నిమ్హాన్స్‌ నిపుణులతో కూడిన అయిదుమంది సభ్యుల బృందం పరిస్థితిని అంచనా వేయనుంది. నిఫా వైరస్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న కర్ణాటక ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలను తీసుకుంది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ప్రత్యేేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. అడ్వైజరీనీ జారీ చేసింది. కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి చెందిన ప్రదేశాలకు వెళ్లొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న దక్షిణ కన్నడ, చామరాజనగర, కొడగు, మైసూరు జిల్లాల్లో హైఅలర్ట్‌ను ప్రకటించింది. ఆయా జిల్లాల్లోని చెక్ పోస్టుల మీదుగా రాకపోకలను సాగించే వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది. నిఫా వైరస్ బాధితుల కోసం జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సైతం ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

    ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో కేరళ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆగస్టు 30న మరణించిన మొదటి వ్యక్తిని కాంటాక్ట్ అయిన హై-రిస్క్ కాంటాక్ట్ గ్రూప్‌లో ఉన్న వారందరి నమూనాలను తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం 14 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని, వారి నమూనాలను తీసుకొని ల్యాబ్‌కు పంపుతామన్నారు. ఇటీవల నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించిన కేరళలోని కోజికోడ్ జిల్లాలోని మారుతోంకర, అయంచేరి ప్రాంతాలను కేంద్ర అధికారుల బృందం శుక్రవారం సందర్శించనుంది.

    Related Stories